ఏ బిడ్డా.. ఇది మా అడ్డా!

ఉద్యోగం కోసం చూస్తున్నారా? వీళ్లు సాయం చేస్తారు. వ్యాపారంలో అడుగెలా వేయాలో సూచిస్తారు. ఆఫీసు మొదలుపెట్టుకోవాలా చోటిస్తారు. అంతేనా.. అలసిపోతే విశ్రాంతికి గది, పిల్లలు, పెంపుడు జంతువులు తీసుకెళ్లే వీలు. సరకులు, బ్యూటీపార్లర్‌ సేవలు.. అన్నీ అందిస్తారు. అయితే సేవలు మాత్రం ఆడవాళ్లకే! ఎవరు వీళ్లంటారా?

Published : 05 Mar 2022 00:51 IST

మనకే ప్రత్యేకం

ఉద్యోగం కోసం చూస్తున్నారా? వీళ్లు సాయం చేస్తారు. వ్యాపారంలో అడుగెలా వేయాలో సూచిస్తారు. ఆఫీసు మొదలుపెట్టుకోవాలా చోటిస్తారు. అంతేనా.. అలసిపోతే విశ్రాంతికి గది, పిల్లలు, పెంపుడు జంతువులు తీసుకెళ్లే వీలు. సరకులు, బ్యూటీపార్లర్‌ సేవలు.. అన్నీ అందిస్తారు. అయితే సేవలు మాత్రం ఆడవాళ్లకే! ఎవరు వీళ్లంటారా?

ఇంటినీ, ఉద్యోగాన్నీ సమన్వయం చేసుకోవాలి.. మరోవైపు భద్రత భయం.. ఏ కారణం చేతైనా విరామం తీసుకుంటే కెరియరే ప్రశ్నార్థకం.. తన కాళ్లపై తాను నిలబడాలనుకునే మహిళకు ఎన్ని అవరోధాలో! వీటన్నింటికీ పరిష్కారం చూపాలనుకున్నారు వందనా రామనాథన్‌, జినాల్‌ పటేల్‌. ఆ ఉద్దేశంతోనే.. డబ్ల్యూస్క్వేర్‌ ప్రారంభించారు. ఇదో కో వర్కింగ్‌ స్పేస్‌.. భిన్న రంగాల వాళ్లు ఒకేచోట పని చేసే వేదిక. వందనా, జినాల్‌ స్నేహితులు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఒక డిజిటల్‌ మార్కెటింగ్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. గృహిణులకు ఫ్రీలాన్సింగ్‌ అవకాశాలిచ్చేవారు. క్లయింట్లతో వ్యాపార లావాదేవీలేవైనా కాఫీ షాపులు, రెస్టరెంట్లలోనే జరిగేవి. చాలామంది ‘మీ ఆఫీసు ఎక్కడుంది?’ అనడిగేవారు. వాళ్లు పనిచేసేది ఇంటి నుంచే. వెబ్‌సైట్‌ మినహా ఏమీ లేదు. ఇలా అయితే సమస్య అవుతుందని దాదాపు ఏడాది తర్వాత చిన్న కార్యాలయం తీసుకుందామని చాలా ప్రయత్నించారు. అప్పుడే అద్దెలు ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్థమైంది వీళ్లకి. అప్పుడు వచ్చిన ఆలోచనే ‘డబ్ల్యూస్క్వేర్‌’, 2017లో ప్రారంభించారు. వీళ్లది చెన్నై.

వందనా, జినాల్‌

దీనిలో.. ఒక రోజు నుంచి ఎన్నేళ్లకైనా పని స్థలాన్ని అద్దెకు తీసుకోవచ్చు. వాళ్ల వ్యాపారాభివృద్ధి నుంచి ఉత్పత్తులను అమ్మడం వరకూ ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. అయితే అద్దె చెల్లించాలి. అదీ నామమాత్రమే. ఇంకా.. కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టిన వాళ్లకి కొన్ని అంశాల్లో అవగాహన ఉండదు. వాళ్లకి సాయపడేలా వర్క్‌షాప్‌లు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్పత్తుల మార్కెటింగ్‌లో మార్గనిర్దేశం చేస్తారు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువత కోసం ఇంక్యుబేషన్‌ ప్రోగ్రామ్‌లు, ఇంటర్న్‌షిప్‌లు అందిస్తున్నారు. ‘డబ్ల్యూకనెక్ట్‌’ యాప్‌ను తయారుచేసి, ఉద్యోగావకాశాల్నీ కల్పిస్తున్నారు. సంస్థ అంతిమ లక్ష్యం.. మహిళలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, నెట్‌వర్కింగ్‌, వినియోగదారుల్ని అందించి ఆర్థికంగా, కెరియర్‌ పరంగా నిలదొక్కుకునేలా చేయడమే! పనే కాదు.. ఉచిత వైఫై, విశ్రాంతి గది, తేనీరు, మీటింగ్‌ రూమ్‌లతోపాటు పిల్లలు, పెంపుడు జంతువుల్నీ తెచ్చుకునే వీలుంది. ఒత్తిడిలేని పనివాతావరణం అందించడం వాళ్ల ఉద్దేశమన్నమాట. త్వరలోనే వీళ్ల సేవలు దేశవ్యాప్తం చేయనున్నారు. ఎక్కడైనా సేవలు మాత్రం ఆడవాళ్లకే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్