Updated : 15/03/2022 05:32 IST

ఆ దశ దాటాలంటే..

మాన్వితకు చిన్నప్పటి నుంచి కొత్తవాళ్లతో మాట్లాడాలంటే ఇబ్బంది. ఇప్పుడు తను వెళ్లే ఇంటర్వ్యూలో బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌) తప్పనిసరి అన్నారు. ఈ దశను ఎలా దాటాలా అని ఆందోళనకు గురవుతోంది. చాలా ఉద్యోగాలకు ఈ పరీక్షలోనూ పాసవ్వాలి. ఇందులో విజయం సాధించడం గురించి నిపుణులు చెబుతున్నారు...

బృంద చర్చకు వెళ్లే ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సంస్థకు సంబంధించిన మార్కెటింగ్‌, లాభనష్టాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. చర్చల్లో వీటిపై మాట్లాడాల్సిన సందర్భం రావొచ్చు. అలాగే వర్తమాన వ్యవహారాలపై అవగాహన ఉండాలి. ఇతర సభ్యులతో కలివిడిగా ఉంటూ వారి కళ్లల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. చర్చపై ఏకాగ్రత వహించాలి. ఏదైనా ప్రత్యేక అంశం ఇవ్వగానే ఎవరో ఒకరు మాట్లాడతారులే అని ఉండిపోకుండా మీరే చర్చను ప్రారంభిస్తే మంచిది.

ఇతరుల అనుభవాల నుంచి... ప్రస్తుతం చాలా మంది వారి ఇంటర్వ్యూ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పొందుపరుస్తున్నారు. వాటిని పరిశీలించాలి. ఏ పద్ధతిలో మాట్లాడితే చర్చల్లో చురుగ్గా ఉంటామనేది వాటితో తెలుసుకోవచ్చు. మీకేదైనా సందేహాలొచ్చినా, సలహా కావాల్సినా అందులో పొందుపరిస్తే, అవగాహన ఉన్నవారు సమాధానాలిస్తారు.

చర్చల్లో.. పాల్గొంటునప్పుడు పెన్‌, నోట్‌బుక్‌ ఉండాలి. ఎదుటివారు మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపొద్దు. వాటికి సంబంధించి మీరేదైనా చెప్పాలనుకుంటే రాసి ఉంచాలి. మీ వంతు వచ్చినప్పుడు వాటి గురించి చర్చించాలి. అప్పుడే వినేవారికి మీలో సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తుంది.

భావోద్వేగాలు... చర్చల్లో కోపం, అసహనం వంటి భావోద్వేగాలు ప్రదర్శించకూడదు. ప్రశాంతంగా ఉంటూ అవతలి వారి మాటలను నిశితంగా గమనిస్తూ.. అందులోంచి మీకు ఉపయోగపడే దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప, వారి అభిప్రాయాలను తక్కువ చేయకూడదు. వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. ఇవన్నీ మీకు అదనపు అర్హతలు అవుతాయి. మీ శరీర కదలికలు, కూర్చునే విధానం, మాట్లాడేతీరు వంటివన్నీ పై అధికారులు గమనిస్తారు... పరిగణనలోకి తీసుకుంటారు. చర్చ చివర్లో ముగింపు మాట కూడా మీదే అయితే విజయం మీ సొంతమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని