Updated : 19/03/2022 05:00 IST

మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు...

ఉమ తనను తాను ప్రతి నిమిషం నిందించుకుంటూనే ఉంటుంది. స్వీయ హింసకూ వెనుకాడదు. తనకు మంచి మనసు లేదని, చెడ్డదాన్నని భావిస్తుంది. అపజయానికి భయపడి, ఏ లక్ష్యమూ పెట్టుకోదు. ఇదొక మానసిక అనారోగ్యం అంటున్నారు నిపుణులు. దీన్నుంచి వీలైనంత త్వరగా బయటపడకపోతే తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ముందు మనల్ని మనం గౌరవించుకొని ప్రేమించుకోవాలి. అప్పుడే మనపై మనకు నమ్మకం కలుగుతుంది. ఇందుకోసం ముందుగా మనల్ని మనం గుర్తించాలి. మన సామర్థ్యాలు, బలహీనతలు, భయాలపై అవగాహన తెచ్చుకోవాలి. ప్రతి వ్యక్తికి మంచి, చెడు... రెండూ ఉంటాయి. పూర్తిగా చెడ్డ వ్యక్తిగా మనల్ని మనం పరిగణించుకోకూడదు.

ముందడుగు... కెరియర్‌ లేదా లక్ష్యాన్ని సాధించలేను అనే శంకల్ని వదిలేసి ప్రయత్నించాలనే ఆలోచన చేయాలి. ఫలానా కోర్సు చదవలేను లేదా ఆ ఉద్యోగానికి అర్హురాలిని కాకపోవచ్చు అనే భావాలను దూరంగా ఉంచాలి. ఓసారి ప్రయత్నిస్తే విజయం ఎదురవ్వొచ్చు. అప్పుడు ఈ తరహా ఆలోచనలు దూరమవుతాయి. అందుకే అనుమానాలను వదిలి ముందడుగు వేయాలి.  

పోలిక వద్దు.. ఇతరులతో పోల్చుకోకుండా, మన సామర్థ్యంపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతి ఒక్కరికీ నైపుణ్యాలుంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మీ ప్రత్యేకతలను బయటికి తీయగలుగుతారు. ఏదైనా చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించే ప్రయత్నం చేస్తే చాలు. నలుగురితోనూ కలవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా చూపిస్తాయి. నిరాసక్తతను దూరం చేస్తాయి.

మనసుకూ.. శరీరానికి పోషకాహారాన్ని ఎలా ఇస్తామో, మనసుకీ ఆరోగ్యకరమైన ఆలోచనలందించాలి. అప్పుడే మెదడుకూడా ఆరోగ్యవంతమవుతుంది. మానసిక ఆరోగ్య ప్రభావం శరీరంపైనా ఉంటుందనేది మరవద్దు. ప్రతి నిమిషం మనసులో కలిగే అనుమానాలను దూరంగా ఉంచాలి. ఎటు అడుగువేస్తే ఏం అపజయాలు కలుగుతాయో అనే అనుమానాలను వెనక్కు నెట్టి ధైర్యంగా ఆ పని పూర్తి చేసి చూస్తే చాలు. మనపై మనకు నమ్మకం ఏర్పడుతుంది. అంతేకాదు, సాధించిన చిన్నచిన్న విజయాలకూ మనల్ని మనం ప్రశంసించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని