అందం.. నిర్వచనం మారుస్తున్నారు...

అందమంటే..? తెల్లగా మెరిసే మేనిఛాయ, మోడళ్లను తలపించే కొలతలు.. ఇవేనా? మరి అవి లేనివాళ్లంతా అందవిహీనులేనా? కాదంటారు వీళ్లు. చూసే హృదయం ఉండాలి కానీ.. ప్రతి ఒక్కరిదీ అందమేనని

Updated : 03 Apr 2022 06:27 IST

అందమంటే..? తెల్లగా మెరిసే మేనిఛాయ, మోడళ్లను తలపించే కొలతలు.. ఇవేనా? మరి అవి లేనివాళ్లంతా అందవిహీనులేనా? కాదంటారు వీళ్లు. చూసే హృదయం ఉండాలి కానీ.. ప్రతి ఒక్కరిదీ అందమేనని చెబుతున్నారు. అంతేనా.. తమ శరీరాన్ని చూసుకొని కుంగిపోయే వారిలో సానుకూలతనూ నింపుతున్నారీ బాడీ పాజిటివ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు.


రెండేళ్లు ప్రపంచానికి దూరం: సమీరా రెడ్డి

జై చిరంజీవ, అశోక్‌, నరసింహుడు.. సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి గుర్తుందా? తెలుగే కాదు తమిళం, హిందీ, కన్నడ, బెంగాళీ చిత్రాల్లోనూ గుర్తింపు తెచ్చుకుందీమె. అక్షయ్‌ వర్దే అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఏడాదికే బాబు. ‘అందరు తారల్లా నేనూ కడుపుతో ఉన్న ఫొటోలను ఆనందంగా పంచుకోవాలనుకున్నా. కానీ 105 కేజీల దాకా బరువు పెరగడంతో సామాజిక మాధ్యమాలకు దూరమయ్యా. ప్రసవం అయ్యాక ఇంకా పెరిగా. నా శరీరాన్ని చూసి ఏడ్చేదాన్ని. డిప్రెషన్‌కీ గురయ్యా. దీనికితోడు ‘అలోపేసియా ఏరియాటా’ సోకి కుచ్చులుగా జుట్టు ఊడిపోయేది. హోమియోపతిని ఆశ్రయించా. మనసునూ స్థిమిత పరచుకుని బయటికి వచ్చా. వాస్తవాలను చూపాలనుకుని స్ట్రెచ్‌ మార్క్స్‌, తెల్లజుట్టు, మొటిమల మచ్చలు దేన్నీ దాయలేదు. మొదట్లో అందరూ నిరుత్సాహ పరుస్తూ మెసేజ్‌లు పెట్టేవారు. భరించలేని తిట్లూ ఉండేవి. అవేమీ పట్టించుకోలేదు. వయసుతోపాటు మారిన అందమంటూ వారికి సమాధానమిచ్చా. ఇప్పుడూ కసరత్తులు వగైరా చేస్తా.. కానీ ఆరోగ్యం కోసమే. ఇప్పుడు నన్ను అనుసరించే వాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ. పైగా.. నిన్ను చూసి స్ఫూర్తి పొందుతున్నామంటారు’ అనే 43 ఏళ్ల సమీర.. కుటుంబం తోడు వల్లే ఇదంతా సాధ్యమైందని చెబుతుంది. తనను 14లక్షలకుపైగా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్నారు.


ఎముకల గూడనేవారు..: డాలీ సింగ్‌

అమ్మానాన్నా రోజంతా కష్టపడితే గానీ గడవని కుటుంబం డాలీది. వీళ్లది నైనిటాల్‌. ఈమెది బక్క పలుచని శరీరం. పైగా చామన ఛాయ. దీంతో స్కూల్లో ఎముకల గూడు అని ఏడిపించే వారు. టీచర్లు కూడా సాయపడేవారు కాదు. ‘నాకేమో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే ఇష్టం. ఓసారి స్కూల్లో నా డ్రెస్‌ను డిజైన్‌ చేసుకొని ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా. అందరూ ఏడిపించారు. అది నాపై వ్యతిరేక ప్రభావం చూపింది. ఎవరిని చూసినా భయపడేదాన్ని. ఏం వేసుకున్నా విమర్శలే. స్నేహితులే ఉండేవారు కాదు. అందుకే ఫ్యాషన్‌ డిజైనింగే చేయాలని నిశ్చయించుకొని దిల్లీ వచ్చా. ఈ బక్కమ్మాయేం సాధించగలదో చూపించాలనుకున్నా’ అంటుంది డాలీ. ఫ్యాషన్‌ బ్లాగర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. సొంతంగా డిజైనింగ్‌తోపాటు మోడలింగ్‌ కూడా చేస్తోంది. బక్క పలచని శరీరాలంటూ సిగ్గుపడే అమ్మాయిల్లో స్ఫూర్తి నింపుతోంది. సరదాను జొప్పిస్తూ ఒప్పించడం ఈమె నైజం. ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా లక్షల అభిమానులను సంపాదించుకున్న ఈమె నటి కూడా. ‘రాజూ కీ మమ్మీ’ పేరుతో బాలీవుడ్‌ అగ్ర తారలను ఇంటర్వ్యూలు చేస్తుంది. అమ్మానాన్నలకు ఇల్లు కొనివ్వడమే కాదు.. తన కోసమూ సొంతంగా సమకూర్చుకుంది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 లక్షలు, యూట్యూబ్‌లో 6 లక్షలకుపైగా ఫాలోయర్లున్నారు.


ఆత్మహత్య వరకూ వెళ్లి: హర్నామ్‌ కౌర్‌

12 ఏళ్లు వచ్చేవరకూ హర్నామ్‌ అందరిలాగే ఉండేది. తర్వాతే మారింది. పెదవిపైనా, గడ్డం ప్రాంతంలో వెంట్రుకలు మొదలయ్యాయి. దాన్ని చూసి స్కూల్లో హేళనలు. వీళ్లది పంజాబ్‌. కానీ ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారు. అప్పటికే వర్ణవివక్షను ఎదుర్కొంటున్న తనను ఇది మరింత కుంగదీసింది. వైద్య పరీక్షల్లో అది పాలిసిస్టిక్‌ ఒవరీ సిండ్రోమ్‌గా తేలింది. టెసోస్టిరాన్‌ స్థాయులు పెరిగి అవాంఛిత రోమాలు వస్తున్నాయన్నారు. ‘మొదట్లో తీయించుకునే దాన్ని. మరుసటి రోజుకే పెరిగిపోయేవి. స్కూల్లో గే, భూతమంటూ కొట్టేవారు. బయటకు వెళ్లడానికే భయపడేదాన్ని. గుర్తు పట్టకుండా అన్నయ్య దుస్తులు వేసుకునేదాన్ని. అయినా వేధింపులు తగ్గలేదు. ఆత్మహత్యకీ ప్రయత్నించా. అప్పుడే అనిపించింది... నన్ను నేనే ప్రేమించుకోలేకపోతే వేరేవాళ్లు మాత్రం ఎందుకు ఇష్టపడతారని. ఇకప్పటి నుంచి దాక్కోలేదు. వెంట్రుకల్నీ తొలగించడం మానేశా. నాలాంటి వాళ్లకి ప్రోత్సాహ మివ్వాలనుకున్నా’ అంటోంది హర్నామ్‌. ఈమె యాంటీ బుల్లీయింగ్‌ యాక్టివిస్ట్‌. మోడల్‌, టెడెక్స్‌ మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా. గిన్నిస్‌లోకీ ఎక్కింది. ఈమెను ఇన్‌స్టాలో లక్షన్నర మందికిపైగా అనుసరిస్తున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్