ఆత్మవిశ్వాసమే విజయం...

రమ్యకు పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే ఒత్తిడి మొదలవుతుంది. పాఠాలన్నీ చదివినా సమయం వచ్చేసరికి ఆందోళన ప్రారంభమవుతుంది. 90 శాతం మందికి ఇది సాధారణ సమస్య అంటున్నారు

Published : 04 Apr 2022 00:48 IST

రమ్యకు పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే ఒత్తిడి మొదలవుతుంది. పాఠాలన్నీ చదివినా సమయం వచ్చేసరికి ఆందోళన ప్రారంభమవుతుంది. 90 శాతం మందికి ఇది సాధారణ సమస్య అంటున్నారు నిపుణులు.  దీన్ని అధిగమించడానికి ఏం చెబుతారంటే...

అవగాహన.. మొదట సబ్జెక్టులన్నింటిపై అవగాహన పెంచుకోవడంతోపాటు  రెండుమూడేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించండి. ప్రశ్నను ఏ కోణంలో అడుగుతున్నారో గుర్తిస్తే, దానికి తగ్గట్టు సమాధానం ఇవ్వడంపై దృష్టి పెట్టొచ్చు. కొన్నింటికి జవాబులు సాధన చేయడమూ మంచిది.

నియమిత సమయం.. సమయం వృథా కాకుండా రోజుకీ, వారానికి తగ్గట్టు ప్రత్యేకంగా ప్రణాళిక తయారుచేసుకుని తప్పకుండా అనుసరించాలి. అలాగే వేకువజామున మెదడు చురుగ్గా ఉంటుంది. క్లిష్టమైన ప్రశ్నలను ఈ సమయంలో ప్రయత్నించొచ్చు.

ఆత్మవిశ్వాసంతో... చదివినప్పుడు పూర్తిగా తెలిసినట్లు ఉండి, ఆ తర్వాత మర్చిపోతున్నట్లు ఉందంటే ఆత్మవిశ్వాసం తగ్గిందని అర్థం. అనవసరపు ఆందోళన విజయాన్ని దూరం చేస్తుంది. ధైర్యంగా ఉంటే పరిష్కారం దొరుకుతుంది.

మరోసారి.. చదివిన ప్రతి పాఠాన్నీ మరోసారి పునఃశ్చరణ చేసుకోవాలి. ఇందుకోసం రోజూ ప్రత్యేకంగా సమయం పెట్టుకోవాలి. ఎన్నిసార్లు చదివినా గుర్తుండని జవాబులను చూడకుండా రాసి ప్రయత్నిస్తే, అది మీ మెదడులో నిక్షిప్తమవుతుంది.

విశ్రాంతి.. ఆరు గంటలు నిద్ర  ముఖ్యం. రెండు గంటలకోసారి విరామం తప్పనిసరి. అప్పుడే మెదడు శక్తిమంతం అవుతుంది. చదివిన ప్రతీదీ జ్ఞాపకం ఉండేలా చేయగలుగుతుంది. పోషకాహారం తీసుకోండి. వ్యాయామం, ధ్యానం వంటివి శారీరక, మానసికారోగ్యాన్ని అందిస్తాయి.

చివరిగా.. పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు కొత్త పాఠాల జోలికి వెళ్లకుండా పాత వాటినే పునఃశ్చరణ చేసుకోండి. ఆత్మస్థైర్యంతో  ప్రశాంతమైన మనసుతో రాయడం మొదలుపెడితే చదివిన ప్రతి అంశాన్ని మెదడు మీ ముందుంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని