Updated : 10/04/2022 02:27 IST

సహోద్యోగి.. నచ్చకపోతే!

ఉద్యోగం చేసేచోట స్నేహితులుంటే ఎంత ఆహ్లాదంగా పని గడిచిపోతుందో... నచ్చని వాళ్లు ఉంటే అంత భారంగా గడుస్తుంది. మాట్లాడటం మానేయడమో, ఉద్యోగం మారడమో పరిష్కారం కాదంటున్నారు నిపుణులు. మరేం చేయాలి?

* అసలు తనలో మీకు నచ్చనిదేంటి? కారణం సహేతుకమేనా గమనించుకోండి. కొన్నిసార్లు అకారణంగానే అయిష్టం ఏర్పడుతుంది. దీంతో అవతలి వ్యక్తి ఏం చేసినా మనకు దోషంలానే కనిపిస్తుంది. అలా ఏమైనా ఉంటే.. మిమ్మల్ని మీరు మార్చుకోవడం మంచిది.

* లేదూ.. బలమైన కారణమే ఉందంటారా! క్లయింట్లతో ఎలా ప్రవర్తిస్తారు? ఒప్పందం ప్రకారం చేస్తామన్న పనిని చేసిస్తాం అంతే కదా! ఆ పని వరకే వారితో బంధం. నచ్చని వారితోనూ అలాగే ప్రవర్తిస్తే సరి. పని ప్రదేశం దాటితే వారితో మీకు సంబంధమే ఉండదు. కాబట్టి, వారిపై మీ భావోద్వేగాలను ఖర్చు చేయకండి. పని విషయాలను చర్చించడం వరకే పరిమితమైతే సరిపోతుంది.

వాళ్ల నుంచి తప్పించుకొని తిరగడమో, ఉద్యోగాన్ని మానేయడమో చేయొద్దు. అప్పటికి బాగానే అనిపించినా.. వేరేచోటా అలాంటివారు ఎదురవ్వరని చెప్పలేం కదా! పని విషయంలో పక్కాగా ఉండి, మిగతా బాధపెట్టే అంశాలను పట్టించుకోకపోతే సరి. వాళ్లే మీ జోలికి రాకుండా ఉంటారు.

పదే పదే కలిసి పనిచేయాల్సొస్తే.. తరచూ మాట్లాడుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు పరిమితులు విధించుకోండి. ఉదాహరణకు వాళ్లు మాట్లాడే తీరు కానీ, పని విషయంలో ఒత్తిడి చేయడం.. ఇలా మీకు నచ్చని విషయమేంటో వివరించి, ఎప్పుడు సంప్రదిస్తే మంచిదో తెలియజేస్తే సరి.

ఒక్కోసారి భావోద్వేగాలను మరీ పట్టి ఉంచినా ఒత్తిడే. కాబట్టి, వాళ్లలో నచ్చని విషయాలను మీ పని, ఆఫీసుతో ఏమాత్రం సంబంధం లేని వాళ్లతో పంచుకోండి. ఒత్తిడి భారముండదు. ప్రాణస్నేహితులతోనో, కుటుంబంలో పెద్దలతోనో ఏకరువు పెట్టండి. కోపాన్నంతా వాళ్ల ముందు వెళ్లగక్కేయండి. మనసు ప్రశాంతమవుతుంది. వీలైతే వాళ్లూ మీకు కొన్ని సలహాలు ఇస్తారు. అయితే... తోటి ఉద్యోగులతో మాత్రం ఇలా పంచుకోకండి. వదంతుల ప్రమాదముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని