సర్టిఫికెట్లు తిరిగి పొందాలంటే?

నేను ఎం.ఎ., బి.ఎడ్‌. చేశాను. పదహారేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నా. నా చదువంతా మా పుట్టింటి కుల ధ్రువీకరణతోనే అయ్యింది. తెలంగాణ వచ్చాక టీఎస్‌ సర్టిఫికెట్‌ ఉండాలంటే అప్లై చేశాం. అందులో తండ్రి, భర్త కులాలను స్పష్టంగా రాశా. అయితే సర్టిఫికెట్‌ మాత్రం మావారి కులం పేరిట వచ్చింది. నాలుగు సార్లు అప్లై చేసినా భర్త పేరు మీదనే కుల ధ్రువీకరణ పత్రం వచ్చింది. 2017-18లో ప్రభుత్వ

Updated : 12 Apr 2022 14:21 IST

 

నేను ఎం.ఎ., బి.ఎడ్‌. చేశాను. పదహారేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నా. నా చదువంతా మా పుట్టింటి కుల ధ్రువీకరణతోనే అయ్యింది. తెలంగాణ వచ్చాక టీఎస్‌ సర్టిఫికెట్‌ ఉండాలంటే అప్లై చేశాం. అందులో తండ్రి, భర్త కులాలను స్పష్టంగా రాశా. అయితే సర్టిఫికెట్‌ మాత్రం మావారి కులం పేరిట వచ్చింది. నాలుగు సార్లు అప్లై చేసినా భర్త పేరు మీదనే కుల ధ్రువీకరణ పత్రం వచ్చింది. 2017-18లో ప్రభుత్వ ఉద్యోగమూ వచ్చింది. 2019లో పోస్టింగ్‌ ఇచ్చారు. సమస్య ఏమిటంటే... నా భర్త పేరుతో కులధ్రువీకరణ పత్రం తీసుకున్నానని, దొంగ సర్టిఫికెట్‌ పెట్టానని జాబ్‌ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేశారు. నా సర్టిఫికెట్లు కూడా నాకివ్వడం లేదు.. వాటిని తిరిగి పొందగలనా? ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వెలువడనున్నాయి కదా. వీటికి అప్లై చేసుకోవచ్చా?

- ఓ సోదరి


సాధారణంగా పుట్టిన కులాన్నే కుల ధ్రువీకరణ పత్రంలో నిర్ధరిస్తారు. కానీ మీరు అప్లై చేసినప్పుడు మీవారి కుల ధ్రువీకరణతో సర్టిఫికెట్‌ వచ్చిందంటున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు మీ భర్తా, మీ నాన్న... ఇద్దరి కులాలను స్పష్టంగా రాశామని చెబుతున్నారు. మరి మీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసినప్పుడు దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ‘నేను స్పష్టంగా నా కుల ధ్రువీకరణ పత్రం గురించి వివరణ ఇచ్చా. అయినా నా జాబ్‌ అపాయింట్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేశారు’ అని హైకోర్టులో ఎందుకు కేసు వేయలేదు? మీరలా ప్రశ్నించి ఉంటే.. హైకోర్టులో మీ సర్టిఫికెట్లపై మళ్లీ తదుపరి విచారణ చేయమని అడిగి ఒక ఆర్డర్‌ తెచ్చుకుని ఉండొచ్చు లేదా మీ పై అధికారులకు ‘నేను దొంగ/నకిలీ సర్టిఫికెట్‌ పెట్టలేదు. అది ప్రభుత్వం ద్వారా వచ్చింది’ అని మీరు చెప్పి ఉండాల్సింది. అక్కడా మీరు ప్రశ్నించినట్లు కనిపించడం లేదు. కాబట్టి కనీసం ఇప్పుడైనా మీ ఉద్యోగ తొలగింపు ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయండి. దాంట్లో మీ తండ్రి, భర్త కులాలు, దరఖాస్తు చేసినప్పుడు పెట్టిన అప్లికేషన్‌లో రాసిన సంగతులు... ఇవన్నీ స్పష్టంగా వివరించండి. అలా చెప్పడంవల్ల నిజానిజాలు తెలుసుకోకుండా మీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ రద్దు చేశారన్న విషయాలు హైకోర్టుకు విశదమవుతాయి. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే మీ భర్తది  కాకుండా మీ తండ్రి గారి కులంతోనే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినట్లు నిజం నిరూపితమవుతుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయక  మీ అసలైన, మీ భర్త కులధ్రువీకరణ పత్రాలు రెండూ చూపించి... అప్లై చేసినప్పుడు జరిగిన పొరపాటు గురించి నిజానిజాలు తెలియ జేయండి. మీ ఉద్యోగం గురించి తేలిన తర్వాత ఒరిజినల్స్‌ గురించి ఆలోచించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని