Updated : 15/04/2022 06:36 IST

ఆఫీసు, ఇల్లు.. నలిగిపోతున్నారా..!

ఇంటికొచ్చాక ఆఫీసు ఫోన్లు ఎత్తకపోతే ‘బాధ్యత లేదు]’ అని అంటారు పైవాళ్లు. చిన్నదే కదా త్వరగా పూర్తి చేద్దామనుకుంటామా! ‘కెరియర్‌ తప్ప ఇల్లు పట్టదు’అని ఇంట్లోవాళ్ల నసుగుళ్లు. చాలాసార్లు అడకత్తెరలో పోకచెక్కలాంటి పరిస్థితే ఉద్యోగినులది. దీన్ని మార్చాలంటే ఈ చిన్న మార్పులు అవసరం.

* మౌనంగా సహిస్తూ వెళ్లినంతకాలం పరిష్కారం దొరకదు. మీ పై అధికారితో ఈ విషయాన్ని చర్చించండి. వ్యక్తిగత జీవితంపై ఎలా ప్రభావం పడుతోందో చెప్పండి. సమయ పరిమితులను స్పష్టం చేయండి. ఇక ఇంట్లో.. రెండు పనుల ప్రభావం మీ మీద ఎలా పడుతోందో వివరించండి. వాళ్లే అర్థం  చేసుకుంటారనుకోవద్దు. మీరు చెప్పనంత వరకూ ఎవరికీ తెలీదు.

* ఆఫీసంటే నలుగురితో చేసే పని. మరీ అవసరమైతే తప్ప అప్పటికప్పుడు సెలవులు పెట్టొద్దు. ఆ ప్రభావం మిగతా  వారిపై పడుతుంది. కొద్దిరోజుల ముందుగానే చెబితే వాళ్లూ తగ్గట్టుగా పనిపరమైన మార్పులు చేసుకోగలుగుతారు. చాలావరకూ స్కూళ్లలో ఈవెంట్లు, వేడుకల గురించి అప్పటికప్పుడు చెబుతుంటారు. మనం చూసుకోవడం ఆలస్యమైతే.. పిల్లల్ని సిద్ధం చేయలేం. వాళ్లేమో చిన్నబోతారు. తరగతి ఉపాధ్యాయులతో వీటి గురించి ముందే చర్చిస్తే ఈ సమస్యలుండవు.

* ఆఫీసు, ఇల్లు సమన్వయంపైనే దృష్టిపెట్టొద్దు. మీ మానసిక, శారీరక ఆరోగ్యాలనీ చూసుకోండి. కెరియర్‌లో ముందుకు సాగడానికి అవసరమైన కోర్సులు, శిక్షణపై దృష్టిపెట్టండి. సేదతీరడానికి మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోండి. అవసరమైతే ఇంట్లో వాళ్ల సాయం కోరండి. పిల్లలకీ పనులు అప్పజెప్పొచ్చు. అప్పుడు మీపైన పని భారం తగ్గుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని