Published : 01/05/2022 01:44 IST

ఎంత వేతనం ఆశిస్తున్నారు?

అఖిల ఇంటర్వ్యూల్లో అన్నింటికీ బాగా చెబుతుంది. కానీ వేతనమెంత కావాలి అనే ప్రశ్న దగ్గర తడబడుతుంది. ఆడవాళ్లం... జీతం గురించి మనం కచ్చితంగా ఇంత అనడం బాగుండదేమో అని తన సందేహం. ఈ విషయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు కెరియర్‌ నిపుణులు.

ఆడైనా, మగైనా ఉద్యోగం చేస్తున్నామంటే కెరియర్‌ అభివృద్ధితోపాటు వేతనానికీ ప్రాముఖ్యత ఉంటుంది. అప్పుడే రెండింటికీ సమన్వయం కుదురుతుంది. పేరుకి పెద్ద హోదా ఉండి, వేతనం కింది స్థాయి ఉద్యోగిలా ఉంటే అసంతృప్తి పెరిగి పనిలో నాణ్యత తగ్గుతుంది. కొన్ని సంస్థలు అర్హతబట్టి ఇస్తే, మరికొన్ని అనుభవానికి పెద్దపీట వేసి వేతనాన్ని నిర్ణయిస్తాయి. సాధారణంగా ఉద్యోగం మారేటప్పుడు పాత సంస్థలో వచ్చే వేతనానికి 20 నుంచి 30 శాతాన్ని కొత్త సంస్థ అదనంగా చెల్లిస్తుంది. మరికొన్నిచోట్ల అర్హత, బాధ్యతలకు ప్రాముఖ్యతనిచ్చి ఆ స్థానానికి తగినట్లుగా ఊహించని వేతనాన్ని ఇస్తుంటాయి. అందుకే మీరు అడుగుపెట్టాలనుకుంటున్న ఆ సంస్థ తీరుతెన్నులను తెలుసుకోండి. ఈ అంశంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు తడబడకండి.

అవగాహనతో... సాధారణంగా పాత ఉద్యోగంలో వేతనం కన్నా ఎంత శాతాన్ని కొత్త సంస్థ అదనంగా చెల్లిస్తుందో ముందుగా తెలుసుకోవాలి. వేరే ప్రాంతానికి ఆ ఉద్యోగ రీత్యా వెళుతున్నారంటే అక్కడి జీవనశైలి, ఖర్చులపై అవగాహన ఉండాలి. గతంలో మీకు బాధ్యతలు తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు పిల్లల చదువులు, కుటుంబ నిర్వహణ వంటివీ దృష్టిలో ఉండాలి. ఆలోచించి సమాధానాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కొన్ని సంస్థల్లో ఫలానా స్థాయికి స్థిరంగా ఇంతే వేతనమనే నియమం ఉంటుంది. దాన్ని దాటి మీకు ఇవ్వలేకపోవచ్చు. అటువంటప్పుడు కూడా మీ బాధ్యతల గురించి చెప్పడంలో తప్పులేదు. ఆపై సంస్థ నిర్ణయాన్ని వినాలి.

మొహమాటం వద్దు... వేతనం గురించి మాట్లాడేటప్పుడు మీ విద్యార్హత, అనుభవం, చేపట్టనున్న బాధ్యతలు వంటివన్నీ ప్రస్తావించాలి. కొన్నిచోట్ల బోనస్‌, ఆరోగ్యబీమా, ప్రయాణ భత్యం, చైల్డ్‌కేర్‌ బెనిఫిట్స్‌, ఏటా జీతం పెరగడం వంటివి ఉంటాయి. అటువంటప్పుడు వేతనం సాధారణంగా ఉంటుంది. ఇటువంటివి ఉన్నాయో లేవో కూడా ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు ఒకే రకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నా మగవారికీ, మహిళలకూ వేతనాల్లో తేడా చూపిస్తాయి. ఈ అంశాన్ని కూడా ఆరా తీయాలి. ఎక్కువ అడిగితే అక్కడ అవకాశం దొరకదేమో అనుకోవద్దు. మొహమాటంగా ముందు తక్కువ చెప్పి, ఆ తర్వాత అడగొచ్చులే అనుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఒకసారి ఒక వేతనానికి ఓకే చెబితే తిరిగి వెంటనే మార్చడం కుదరకపోవచ్చు. పైగా తర్వాత మళ్లీ అడిగితే మీకు స్థిరత్వం లేదనుకునే ప్రమాదం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని