Published : 17/05/2022 02:38 IST

ఈ పొరపాట్లు చేయొద్దు..

కావ్య క్షణం తీరికలేకుండా రోజంతా పని చేస్తుంది. అయినా పనులు సమయానికి పూర్తికావు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఇంటి పని లేదా ఆఫీస్‌పని ఏదైనా... సమయపాలన పాటిస్తూ, ముఖ్యమైన పనులను చిన్నచిన్న లక్ష్యాలుగా చేసుకొంటే చాలు.. సకాలంలో పూర్తి చేయొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అలాకాకుండా ఎంత కష్టపడినా ఒత్తిడి తప్పడంలేదంటే మీరెక్కడో పొరపాటు చేస్తున్నట్లు గుర్తించాలంటున్నారు.

ముందుగా కష్టమనిపించే పని ప్రారంభించాలి. దాన్ని తేలికగా ఎలా పూర్తి చేయగలమో ప్రణాళిక ఆలోచించాలి. అవసరం అయితే మనమే కొత్త పద్ధతిని కనిపెట్టాలి. ఆ ఒక్కపనిపైనే దృష్టి పెట్టి చేయగలిగితే అనుకున్న సమయం కన్నా కాస్త ముందుగానే సులువుగా పూర్తి చేయగలుగుతాం. అలాకాక ఒకేసారి రెండు మూడు పనులను రకరకాలుగా చేయడానికి ప్రయత్నిస్తే పని అవకపోగా అలసట మిగులుతుంది. సమయమూ మించిపోతుంది. శ్రమ వృథా అవుతుంది.

పట్టిక.. పని మొదలుపెట్టేటప్పుడు ముందుగా ఏది ముఖ్యమో దానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఇందుకుగాను చేయాల్సినవన్నింటినీ ఓ పట్టికలా రాసుకోవాలి. ఒకదానితర్వాత మరొకటి పూర్తి చేసుకుంటూ, అయిన పనికి టిక్‌ పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మిగిలిన పనులు కూడా వేగంగా ముగించగలుగుతాం. మనసు ఉత్సాహంగా మారుతుంది. అనుకున్నదానికన్నా కాస్తంత ముందుగానే పూర్తవుతాయి. అయితే ప్రతీ పనినీ నాణ్యంగా పూర్తి చేసేలా జాగ్రత్తపడటం ముఖ్యం. అప్పుడే తిరిగి వెనక్కి అడుగు వేయనక్కర్లేదు.

బ్రేక్‌ వద్దు.. పని మధ్యలో అడుగడుక్కీ విరామం తీసుకోవద్దు. మొదట్లోనే ప్రతి రెండు లేదా మూడు గంటలకొకసారి బ్రేక్‌ తీసుకోవాలని అనుకోవాలి. ఆ మేరకే పని కొనసాగించాలి. అప్పుడే వేగంగా చేయగలుగుతాం. అలాకాక కాసేపటికీ తీసుకొనే బ్రేక్‌లు పనిపై ఆసక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. మధ్యలో ఆగితే ఆ పని గురించి మళ్లీ మొదటి నుంచి ఆలోచించాల్సి వస్తుంది. దానివల్ల సమయం వృథా.

అటూ ఇటూ... కొంత మంది ఒక పని మొదలు పెట్టి, కాసేపు చేశాక దాన్ని పక్కన పెట్టి మరో పని తీసుకుంటారు. ఇదీ మంచిది కాదు. దాని వల్ల ఒక్కో సారి ఏదీ పూర్తికాక గందరగోళం అవుతారు. అందువల్ల ఒకటి అయ్యాక మరొకటి చేయడం మంచి పద్ధతి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని