Published : 28/05/2022 01:24 IST

ఉద్యోగంలో ఉన్నతి సాధించాలంటే..

ఉద్యోగం ప్రధానంగా డబ్బు కోసమే అయినా అంతకు మించిన ఆత్మతృప్తి అందులో దొరుకుతుంది. అది మనకో గుర్తింపునీ గౌరవాన్నీ తెచ్చిపెడుతుంది. ఇన్ని లాభాలున్న కొలువును మొక్కుబడిగా చేస్తే ఎలా? ఇష్టంగా, బాధ్యతగా చేయాలి కదూ! అప్పుడే మెరుగైన అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అందుకోసం ఈ సూత్రాలు పాటించి చూడండి..

అర్హతలుంటేనే కదా ఉద్యోగం వచ్చింది, కొత్తగా ఇంకేం నేర్చుకోవాలి అనుకోవద్దు. కాలం ఎక్కడా ఆగిపోదు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత వస్తుంటుంది. టార్గెట్లు పెరుగుతుంటాయి. వాటికి తగ్గట్టు నైపుణ్యాలు పెంచుకుంటేనే మీకు అభివృద్ధి.

పై అధికారులు నియమాలు పెట్టారు, తప్పదు అన్నట్టు కాకుండా అందులో ఆనందాలను చవిచూస్తూ పనిచేయండి. మీకంటూ లక్ష్యాలు నిర్దేశించుకోండి. అవి పూర్తయ్యాక మరి కొన్ని, ఆ తర్వాత ఇంకొన్ని.. అప్పుడిక విజయ సోపానాలు అధిరోహించుకుంటూ సాగడం తథ్యం.

తెలియని మెలకువలను సహోద్యోగుల నుంచి తెలుసుకోండి. అలాగే మీకు తెలిసిన అంశాలను వారికి నేర్పండి. ఇది వ్యక్తిగతంగానేకాక సంస్థాగతంగానూ ఉపయుక్తం.

ఎప్పటికీ ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తూ ఉండిపోవాలనుకోవద్దు. బదిలీ అవకాశం ఉంటే వేర్వేరు విభాగాల్లో పని చేయండి. మూస పద్ధతి పోయి కొత్త ఉత్సాహంతో పనిచేయగలుగుతారు.

రోజూవారీ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయండి. ఇతరులతో పొత్తు ఉన్న పనులను, బృహత్‌ ప్రణాళికలనూ అవకాశాన్ని బట్టి చేసుకుంటూ వెళ్లండి. మీ కృషి, క్రమశిక్షణలే మీకు శ్రీరామరక్ష.

ఆఫీసు బాధ్యతలతో ఇంటిని, ఇంటి పనుల భారం వల్ల కార్యాలయాన్నీ అశ్రద్ధ చేయొద్దు. రెండూ ముఖ్యమే. అందుకే కాస్త జాగ్రత్తగా సమన్వయపరచుకుంటూ వెళ్లండి. రెండు చోట్లా సమర్థంగా చేస్తూ ఆనందాలు మూట కట్టుకోండి.

ఇవన్నీ సాధ్యం కావాలంటే మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి తీరాలి. అందుకోసం మంచి పోషకాహారం తీసుకోండి. రోజూ ఓ అరగంటైనా తప్పక వ్యాయామం చేయండి. కనీసం ఏడు గంటలు నిద్రించండి. అంతే కాదు, తిండీ నిద్రలకు వేళలు పాటించడమూ ముఖ్యమే. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని