ఆస్తి తీసుకున్నారు.. బాధ్యత మరిచారు!
మా అత్తమామలకు ఇద్దరు అబ్బాయిలు. మా మామయ్య చనిపోక ముందు తన స్వార్జితం రెండు ఎకరాల పొలాన్ని మా బావగారికి 2002లో రాశారు. అందులో మావారికి వాటా ఇవ్వలేదు. మావారూ అప్పుడు అడ్డు చెప్పలేదు. మా అత్తమామలు మొదట్నుంచీ మా దగ్గరే ఉండేవారు. ఇప్పటికీ అత్తయ్య మా దగ్గరే ఉంటున్నారు. ఆమెకు 85 ఏళ్లు. మా బావగారు గతేడాది మరణించారు. ఆయన ఉన్నప్పుడూ తల్లి బాగోగులు చూసుకోలేదు. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాలేదు...
మా అత్తమామలకు ఇద్దరు అబ్బాయిలు. మా మామయ్య చనిపోక ముందు తన స్వార్జితం రెండు ఎకరాల పొలాన్ని మా బావగారికి 2002లో రాశారు. అందులో మావారికి వాటా ఇవ్వలేదు. మావారూ అప్పుడు అడ్డు చెప్పలేదు. మా అత్తమామలు మొదట్నుంచీ మా దగ్గరే ఉండేవారు. ఇప్పటికీ అత్తయ్య మా దగ్గరే ఉంటున్నారు. ఆమెకు 85 ఏళ్లు. మా బావగారు గతేడాది మరణించారు. ఆయన ఉన్నప్పుడూ తల్లి బాగోగులు చూసుకోలేదు. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాలేదు. ‘ఇన్నాళ్లూ మేం చూసుకున్నాం.. మీరు ఆస్తులు పొందారు కాబట్టి.. ఇప్పుడైనా అమ్మ బాధ్యత చూసుకోండి’ అని వాళ్ల వదిన, పిల్లల్ని మా వారు అడిగినా వాళ్లు పట్టించుకోవడం లేదు. కోర్టుకు వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
మీ అత్తయ్యగారి చేత మీవారి వదినగారి మీద సెక్షన్ 20- హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనన్స్ యాక్ట్ కింద మెయింటెనన్స్ కోసం పిటిషన్ వేయించండి. సెక్షన్ 21, సెక్షన్ 22- హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనన్స్ యాక్ట్, 1956 ప్రకారం చనిపోయిన వ్యక్తి వారసులు ఆస్తిని అనుభవిస్తూ ఉంటే ఎవరి ఆస్తి అయితే అనుభవిస్తున్నారో ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉన్నవాళ్లకి భరణం లేదా జీవన భత్యంను చెల్లించాలి. దీనికి మీరు మీ మామయ్యగారి ఆస్తి రాసిన కాగితాలు, మీ అత్తగారి అవసరాలు, మీవారి స్థితులు, వారి స్థితిగతులు, వారి ఆదాయం మొదలైన విషయాల్ని పిటిషన్‌లో పొందుపర్చండి. మీవారి వదినగారు అనుభవిస్తున్న ఆస్తి విలువ, దాని మీద వచ్చే ఆదాయం, మీ అత్తగారి అవసరాలు లాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని మీ అత్తగారికి చెల్లించాల్సిన భరణాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. మీ అత్తగారి చేత సీనియర్ సిటిజెన్ యాక్ట్ ద్వారా ఏర్పడిన ట్రిబ్యునల్‌లో కూడా ఫిర్యాదు చేయించవచ్చు. ఆవిడ ఆస్తి తీసుకుని మెయింటెనెన్స్ మరిచారని మీవారి వదినగారి మీద ఫిర్యాదు చేయవచ్చు. వాళ్లని పిలిపించి మాట్లాడి నెలకింత వచ్చేలా ఏర్పాటు చేస్తారు. లేదా మీ అత్తగారు గృహహింస యాక్ట్ ద్వారా అయినా మెయింటెనెన్స్ కూడా కోరవచ్చు. పైన చెప్పిన అన్ని కేసులలో మీ మామయ్యగారి ఆస్తిని వాళ్లు అనుభవిస్తున్నారు అనేదే ముఖ్యమైన కారణం. మీ అత్తగారికి కోర్టులో కేసు వేసే స్థోమత లేకుంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించమనండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.