Updated : 20/06/2022 08:00 IST

సీటుకు అతుక్కుపోతున్నారా?

ఉదయాన్నే ఉరుకులు పరుగులు మనకు మామూలే. దీనికి ఉద్యోగమూ తోడైతే! సమయంతో పోటీపడుతూ మీటింగ్‌లు, టార్గెట్లు.. సకాలంలో పూర్తిచేయడానికి కుర్చీలోంచి లేవరు కొందరు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అయితే ఒక్కోసారి సమయాన్ని మించి అర్ధరాత్రి వరకూ కొనసాగిస్తుంటారు. ఇలాగే కొనసాగితే ఎంత ఒత్తిడి? తప్పించుకోవాలంటే స్వీయ శ్రద్ధ కావాల్సిందే!

త్తిడి.. చిన్న పదమే కానీ.. దాని వల్ల అనర్థాలు బోలెడు. మనలో హార్మోనుల అసమతౌల్యత, నిద్రలేమి, బరువు పెరగడం వంటివీ మొదలవుతాయి. ముందు డీ స్ట్రెస్‌ పద్ధతులపై దృష్టిపెట్టాలి. ఏమాత్రం సమయం దొరికినా 2-3 నిమిషాలపాటు కళ్లు మూసుకుని, ఊపిరి పీల్చి వదలడం సాధన చేస్తుండండి.

* ఆకలికి ఏదో ఒకటి తినేయడం, జంక్‌ ఫుడ్‌ వైపు ఆకర్షితమవడం ఒత్తిడి సూచనలే. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోగా బరువు పెరుగుతారు. పల్లీలు, వేయించిన శనగలు, పండ్లు వంటివి రోజూ వెంట తీసుకెళ్లండి. శరీరానికి తోడ్పడే ప్రొటీన్లు, ఫైబర్‌, మినరల్స్‌ వంటివి అందుతాయి.

* ఎంత నిద్ర సరిపోకపోయినా సమయానికి అల్పాహారం తప్పక తీసుకోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానొద్దు. ఇంకా దానిలో ఫైబర్‌, ప్రొటీన్లు ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. క్యారెట్‌, టొమాటో జ్యూస్‌లనూ భాగం చేసుకుంటే కావాల్సిన పోషకాలు అందుతాయి.

* ఇంటి, అదీ సాధ్యమైనంత వరకూ తాజా ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. బయటి ఆహారం పరిశుభ్రమైనది కాకపోవచ్చు. పదే పదే వాడిన నూనెల్ని ఉపయోగిస్తుండొచ్చు. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా అధిక బరువు, కొన్నిసార్లు భావోద్వేగాల్లో మార్పులకూ కారణమవుతాయి. కాబట్టి, వీటికి వీలైనంత దూరంగా ఉండటం మేలు.

* తగినంత నీటిని తాగాలి. చిరాకు, తలనొప్పి అనిపిస్తే టీ, కాఫీలను ఆశ్రయిస్తుంటాం కదా! వాటి స్థానంలో గ్రీన్‌ టీ చేర్చుకోండి. రాత్రిపూట తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. ఇంకా రోజుకో 20 నిమిషాలు బ్రిస్క్‌వాక్‌ వంటివి చేస్తే.. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని