ఆర్థిక సలహానా..ఆగండి!

ఉద్యోగాలు చేసే అమ్మాయిల్లో చాలామందికి ఆర్థిక స్వేచ్ఛ ఉంటోంది. దీంతో పెట్టుబడి నిర్ణయాలూ స్వయంగా తీసుకుంటున్నారు. అయితే వేటి ఆధారంగా? స్నేహితులు, తెలిసినవారు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆధారంగానేనా? మరి బెడిసి కొడితేనో!

Updated : 20 Jun 2022 06:49 IST

ఉద్యోగాలు చేసే అమ్మాయిల్లో చాలామందికి ఆర్థిక స్వేచ్ఛ ఉంటోంది. దీంతో పెట్టుబడి నిర్ణయాలూ స్వయంగా తీసుకుంటున్నారు. అయితే వేటి ఆధారంగా? స్నేహితులు, తెలిసినవారు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆధారంగానేనా? మరి బెడిసి కొడితేనో!

సొంత నిర్ణయాలు, ఆర్థికంగా నిలబడాలనుకోవడం మంచిదే! అయితే స్వయంగానే చేయాలనేం లేదు కదా. కాబట్టి నిపుణుల సాయం కోరండి. ఎవరో చెప్పారని సలహా పాటించి.. పొరబాటున నష్టపోయారో బాధపడేది మీరే. మీ ఖాతా ఉన్న బ్యాంకు లేదా కొన్ని ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిచ్చే నిపుణులుంటారు. వారిని కలవండి. మీ బడ్జెట్‌, ఆశిస్తున్న లాభాలకు తగినవేవో సూచిస్తారు. రిస్క్‌, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వగైరా వాటిపైనా అవగాహన కల్పిస్తారు.

* తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలు.. వినడానికి ఎంత బాగుంటుంది. ఎక్కువమందిని ఆకర్షించే మంత్రమది! అందుకే చాలామంది బోల్తా పడుతుంటారు. దేనిలోనైనా డబ్బులు పెట్టేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. అవసరమైన పరిశోధన చేయండి. సమయం మించి పోతోంది, ఇప్పుడు లేదంటే మళ్లీ అవకాశముండదు లాంటి ఆఫర్లకు బోల్తా పడకండి.

* నాకింత లాభమొచ్చింది అని ఎవరైనా చెబితే ‘మనమూ ప్రయత్నిస్తే’ అన్న ఆలోచన సహజమే. చాలామంది వచ్చిన లాభాల గురించే మాట్లాడతారు. మరి నష్టాల సంగతో? దాన్నీ తెలుసుకోవాలి. లేదూ.. సమంజసమైనదే అని అనిపిస్తే.. ప్రస్తుతం చేతిలో ఉన్న మొత్తం గురించే ఆలోచించొద్దు. భవిష్యత్‌లో కట్టగలిగే వీలునూ చూసుకోవాలి. అలాగే ఆదాయంలో కనీసం 20 శాతం మొత్తాన్ని ఆదాకు తప్పక కేటాయించాలి. రిస్క్‌ ఉన్నవాటికి నెలలో 5 శాతం మాత్రమే పెట్టుబడి పెట్టాలి. లాభాలు వచ్చినా.. నష్టపోయినా అక్కడితోనే ఆగిపోవాలి. అలాకాకుండా ఇంకొంచెం ప్రయత్నిద్దామనుకున్నారో అది వ్యసనమవుతోందనే.

* ఎంత నమ్మకస్థులైనా మీ కార్డు, లావాదేవీలు మీ ఆధీనంలోనే జరగాలి. బ్యాంకు ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ వేరొకరికి ఇవ్వొద్దు. ఆర్థిక నియమాల్లో ఇది అత్యంత ప్రధానమైంది. దీన్ని తప్పక ఆచరించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్