Updated : 27/06/2022 15:33 IST

మీలో ఈ నైపుణ్యాలున్నాయా..

గీతిక డిగ్రీ చేసింది. మంచి విద్యార్థి కదా.. తన మార్కులకు తగ్గట్టుగానే ఉద్యోగానికి పిలుపులూ వస్తున్నాయి. వచ్చిన చిక్కల్లా ఎంపికవ్వకపోవడమే. మంచి మార్కులు, సబ్జెక్టుపై పట్టున్నా ఎందుకిలా అని మధనపడుతోంది. కొలువుకి ఇవే సరిపోవంటున్నారు నిపుణులు. ఇంకా ఏం కావాలో చెబుతున్నారిలా..

ఆలోచనాసరళి..

ఏ అంశానికైనా సరైన రీతిలో స్పందించగలిగే ఆలోచనావిధానం ఉండాలి. ఉద్యోగానికి సంబంధించి ప్రాజెక్టు లేదా డస్క్‌ వర్క్‌లో దేన్ని ఎలా ఛేదించాలో తెలియాలంటే ముందు దాని గురించి ఆలోచించి అవగాహన పెంచుకోవాలి. ఉద్యోగంలో ఎదురయ్యే ప్రతి సమస్య చదువులో ఉండవు. కొన్నింటిని అనుభవంద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు గ్రహించి పరిష్కరించేలా మెదడు ఉత్సాహంగా ఉంటేనే వీలవుతుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తేనే ఇచ్చిన స్థానాన్ని కాపాడుకోగలుగుతారు.

కమ్యూనికేషన్‌..

అప్పటివరకు చదువు, కాలేజీ అంటూ సహ విద్యార్థుల మధ్య మెలుగుతారు. తర్వాత ఆఫీస్‌ వాతావరణంలో అడుగు పెట్టినప్పుడు కమ్యూనికేషన్‌లో ఇబ్బందులెదురవుతాయి. తెలియని ముఖాలు, తమకన్నా అనుభవం ఉన్నవారెందరో ఎదురుపడుతుంటారు. వారితో మాట్లాడటానికి భయపడి వెనుకడుగు వేయకూడదు. అలా ఉంటే ఒక్క పని కూడా పూర్తిచేయలేని స్థితి ఏర్పడుతుంది. ఎదుటివారితో బాగా మాట్లాడి కలిసిపోగలగాలి. ఇందుకోసం ఎవరికివారే స్వీయశిక్షణ ఇచ్చుకోవాలి. అప్పుడే బాధ్యతల్లో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలకు పరిష్కారాలు వంటివి అడిగి తెలుసుకుంటూ ముందడుగు వేయడానికి ప్రయత్నించొచ్చు.

సృజనాత్మకంగా..

బాధ్యతల్లో సృజనాత్మకతను ప్రదర్శించే నైపుణ్యం తప్పనిసరి. తేలికగా, సునాయసంగా ప్రాజెక్టు పూర్తిచేయగలిగే ప్రణాళిక సృజనాత్మకత నుంచే వస్తుంది. ఇది అనుభవం ఉన్నవారిలోనూ కొన్ని సందర్భాల్లో కనిపించదు. అటువంటి చోట ఈ నైపుణ్యం అందరిలోనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. అలాగే ప్రతి చిన్నపనినీ బాధ్యతాయుతంగా పూర్తిచేసే విధానం పనిపై ఆసక్తిని పెంచుతుంది. విజయాన్ని అందిస్తుంది. ఏ పని ఇచ్చినా బాధ్యతగా చేస్తారనే మంచి పేరు దక్కుతుంది. ఇది పైమెట్టు ఎక్కడానికి అవకాశంగా మారుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది బృందంతో కలిసి పనిచేయడం. టీంవర్కర్‌గా నిలబడటానికి ప్రయత్నిస్తూ, అందరితో చర్చించేటప్పుడు మరెన్నో కొత్త ఆలోచనలు వెలుగులోకి వస్తాయి. వాటిలో సరైనవాటిని ఎంచుకొని కార్య్ఝారణలో అనుసరిస్తే మరిన్ని విజయాలు సాధించొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని