పదోన్నతి కావాలా..!

పనికి గుర్తింపే కాదు.. మరింత ఉత్సాహంగా ముందుకు సాగేలా చేసే అస్త్రం ప్రమోషన్‌. అందుకే ప్రతి ఉద్యోగీ దానికోసం ఎదురు చూస్తుంటారు. మీరూ దానికోసం ఎదురు చూస్తున్నారా? కొన్ని అంశాలపై దృష్టిపెట్టాలి మరి!

Published : 27 Jun 2022 02:14 IST

పనికి గుర్తింపే కాదు.. మరింత ఉత్సాహంగా ముందుకు సాగేలా చేసే అస్త్రం ప్రమోషన్‌. అందుకే ప్రతి ఉద్యోగీ దానికోసం ఎదురు చూస్తుంటారు. మీరూ దానికోసం ఎదురు చూస్తున్నారా? కొన్ని అంశాలపై దృష్టిపెట్టాలి మరి!

* ఒకటి రెండుసార్లు బాగా చేశావని అనిపించుకోవడంతో సరిపోదు. ఏడాది పొడవునా మీ ప్రదర్శనను అంచనా వేస్తారు. కాబట్టి, నిరంతరం మెరుగైన ప్రదర్శనపై దృష్టిపెట్టండి. ఇంకా కొత్త సవాళ్లు, ప్రాజెక్టులు చేయడానికి సిద్ధంగా ఉండండి.

*చిన్న చిన్న ప్రశంసలు, సర్టిఫికెట్లు, అవార్డులు.. చాలామంది వీటినో చిన్న అంశాలుగానే పరిగణిస్తారు. కానీ ఇవీ మిమ్మల్ని ప్రమోషన్‌ రేసులో నిలబెట్టేవే! కొన్నిసార్లు ఏ కారణం చేతైనా వస్తుందనుకున్న పదోన్నతి రాకపోతే మీ  పైఅధికారికి మీ పనితీరును గుర్తుచేయడంలోనూ, నేనూ అర్హురాలినే అని చెప్పడంలోనూ ఇవి సాయపడతాయి.

* మనకు ఇంటి వద్ద బోలెడు పనులు, బాధ్యతలు. దీంతో సమయానికి ఇచ్చిన పని ముగించుకొని వెళితే చాలు అన్న ధోరణి ఉండటం సహజమే. అందుకోసమని కొత్త బాధ్యతలు స్వీకరించడానికి వెనకాడతారు. అయితే అది మీరు చేయలేరన్న సంకేతాన్నివ్వొచ్చు. అలాంటప్పుడు పదోన్నతికి ఆస్కారమేది? పదోన్నతి అంటేనే అదనపు బాధ్యత. మీకు చేయగలను అన్న నమ్మకమున్న ఏ పనైనా నిరభ్యంతరంగా ఎదురెళ్లి స్వీకరించండి.

* సహోద్యోగుల్లో స్నేహితులుండటం మామూలే. కానీ మీతో ఏకీభవించలేదని మాత్రం మిగతావాళ్లతో దూరంగా ఉండొద్దు. పని ప్రదేశంలో సంబంధబాంధవ్యాలూ కెరియర్‌లో మీ ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, అందరితో స్నేహంగా మెలగండి. ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదాలొచ్చినా వెంటనే పరిష్కరించుకోండి. ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు.

* ఇదివరకే ప్రమోషన్లు అందుకున్న వారిని దగ్గరగా గమనించండి. వాళ్ల వ్యక్తిత్వం, విజయాలు, అలవాట్లు అన్నింటినీ పరిశీలించండి. అందరితో కలిసిపోవడం, అవసరమైన వారికి అడగకుండానే సాయమందించడం, పైవాళ్లతో అనుబంధం.. ఇలా ఏదైనా అవ్వొచ్చు. వాటిని మీరూ అనుసరిస్తే సరి. కెరియర్‌ పరంగా ముందుకు సాగడానికి ఏం చేయాలో తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని