ఫుల్‌టైం ఉద్యోగం చేయమంటున్నారు!
నేనో వెబ్ డిజైనర్‌ని. కొవిడ్ వల్ల ఉద్యోగం పోయింది. ఏడాదికిపైగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్నా. సంపాదనా బాగుంది. నా పని మెచ్చి ఎందరో రిఫరెన్సులూ ఇస్తున్నారు. నిజానికి ఉద్యోగంలో కంటే రెట్టింపు సంపాదిస్తున్నా. నాకు నచ్చిన వీణను వాయిస్తున్నా. చిన్నచిన్న ప్రదర్శనలిస్తున్నా.
నేనో వెబ్ డిజైనర్‌ని. కొవిడ్ వల్ల ఉద్యోగం పోయింది. ఏడాదికిపైగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్నా. సంపాదనా బాగుంది. నా పని మెచ్చి ఎందరో రిఫరెన్సులూ ఇస్తున్నారు. నిజానికి ఉద్యోగంలో కంటే రెట్టింపు సంపాదిస్తున్నా. నాకు నచ్చిన వీణను వాయిస్తున్నా. చిన్నచిన్న ప్రదర్శనలిస్తున్నా. ఆనందానికి తోడు కొంత మొత్తమూ వస్తోంది. మావారేమో ఫుల్ టైమ్ ఉద్యోగం చూసుకోమంటున్నారు. మీరేమంటారు?
- రూపిణి
మీరు చేస్తున్న దాన్ని ‘గిగ్ జాబ్స్’గా అభివర్ణిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానానికి ఆదరణ పెరుగుతోంది. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కన్సల్టింగ్.. ఇలా రకరకాల ఉద్యోగాల్లో ఇదీ ఒకటి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఈ తరహా ఉద్యోగాలు చేస్తున్నవారి సంఖ్య 2020-21 నాటికి 77 లక్షలు. 2029-30 నాటికి ఇది 2.35 కోట్లకు చేరుతుందని అంచనా. గత దశాబ్ద కాలంగా విపరీతంగా పెరుగుతోన్న గిగ్ ఎకానమీ వ్యక్తుల పనితీరుపై పెద్ద ప్రభావమే చూపింది. ఇవి ఉద్యోగ భద్రతను కల్పించలేవు. కానీ ఎప్పుడు, ఎక్కడ్నుంచి పని చేయాలన్న స్వేచ్ఛనిస్తాయి. అదనపు ఆదాయాన్నీ తెచ్చిపెడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు అదనంగా సంపాదించుకోవాలనుకునే వాళ్లు దీన్ని ఎంచుకునేవారు. కొత్త కెరియర్లను ప్రయత్నించాలనుకునే వాళ్లూ ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఉదాహరణకు- మీకు సంగీతమంటే ఇష్టం. కాన్సర్ట్ ప్లేయర్ అయ్యి సంపాదిద్దామనుకున్నారు. ఈ కెరియర్ సరిపోతుందా అన్నది తెలియడానికి ఆర్కెస్ట్రాలో సమయమున్నప్పుడల్లా పని చేశారనుకోండి. నిజంగా ఇష్టమా.. లేదా అలా అనిపించిందా అన్నది అర్థమవుతుంది కదా! సంపాదన ఎంతవరకూ సాధ్యమన్నదీ తెలుస్తుంది. ఇలాంటి విషయాల్లో స్పష్టత తెచ్చుకోవడానికి ‘గిగ్ వర్క్’ సాయపడుతుంది. సంప్రదాయ పని తీరు కాకపోయినా.. ఇప్పుడెందరో ఈ తరహా పనిని ఎంచుకుంటున్నారు. సరైన ప్రణాళిక, సన్నద్ధతతో మంచి ఆదాయాన్నీ పొందొచ్చు. కాబట్టి, ప్రస్తుత పని తీరు మీకు సంతృప్తిగా అనిపిస్తే నిరభ్యంతరంగా కొనసాగించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.