తాత ఆస్తిపై హక్కుంటుందా?
మా నాన్నగారికి వాళ్ల నాన్న ద్వారా అయిదు ఎకరాల పొలం, రెండు ఇళ్లు వచ్చాయి. మా నాన్నగారికి ఇద్దరం అమ్మాయిలం, ఇద్దరు అబ్బాయిలు. మా నలుగురికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇటీవల మా నాన్నగారు మాకెవరికీ తెలియకుండా
మా నాన్నగారికి వాళ్ల నాన్న ద్వారా అయిదు ఎకరాల పొలం, రెండు ఇళ్లు వచ్చాయి. మా నాన్నగారికి ఇద్దరం అమ్మాయిలం, ఇద్దరు అబ్బాయిలు. మా నలుగురికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇటీవల మా నాన్నగారు మాకెవరికీ తెలియకుండా ఒక ఎకరా అమ్మ పేరున సేల్ డీడ్ చేసి అమ్మకానికి పెట్టారు. తాతగారి ఆస్తి అమ్మ పేరున మార్చి అమ్ముకునే వీలుందా. మాకు తాతగారి ఆస్తిపైన చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు ఉంటాయి?
- ఓ సోదరి
మీ నాన్నకి తండ్రి ద్వారా సంక్రమించిన పొలం భాగాలు పంచుకోనిదైతే పిత్రార్జితం అవుతుంది. తాతలతండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను పిత్రార్జితం అంటారు. తండ్రులు దాన్ని తాత హయాంలో పంచుకున్నా, తండ్రి హయాంలో పంచుకున్నా అంటే అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగి ఉంటే అప్పుడు దాన్ని పిత్రార్జితంగా భావించరు. అప్పుడు మీ నాన్నగారి వాటాకు వచ్చిన ఆస్తి ఆయన స్వార్జితమవుతుంది. పిత్రార్జిత ఆస్తిలో పిల్లలకు పుట్టుకతోనే భాగం వస్తుంది. హిందూ వారసత్వ చట్టం-2005లో సవరణ చేశారు. అంతకు ముందు కేవలం మగపిల్లలకు వారసత్వ హక్కు ఉండేది. 2005 తరువాత హిందూ కుటుంబంలో పుట్టిన ఆడ పిల్లలకూ వారసత్వ హక్కు వచ్చింది. సాధారణంగా పిత్రార్జితంలో ఎంతమంది వారసులు ఉంటే అందరికి ఒక్కో భాగం కేటాయిస్తారు. మీ నాన్నగారు మీ అమ్మగారి పేరుమీద చేసిన సేల్ డీడ్‌లో తనకు సంక్రమించిన ఆస్తి గురించి ఏమని ప్రస్తావించారో తెలుసుకోండి. దీన్లో అన్నదమ్ముల భాగస్వామ్యం ద్వారా వచ్చిన అని చెబితే అది భాగం పంచుకోబడిన ఆస్తి అయ్యుండాలి. ఒకవేళ అన్నదమ్ములెవరూ లేక మీ తాత గారు భాగాలు పంచకుండా ఉన్నట్లయితే మీ అమ్మగారి పేరుమీద చేసిన సేల్ డీడ్ చెల్లదని, మీరు కూడా పిత్రార్జితం ఆస్తిలో భాగస్వాములని చెప్పి చూడండి. లేకపోతే మధ్యవర్తుల ద్వారా సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించండి. ఒప్పుకుంటే పార్టిషన్ డీడ్ రాసుకుని మీ ఆస్తి మీరు తీసుకోవచ్చు లేదంటే దావా వేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.