జీఎం అవుతాననుకున్నా
సీనియర్ మేనేజర్‌ని. మా బాస్ మానేశారు. ఆయన స్థానంలో జనరల్ మేనేజర్ అవుతాననుకున్నా. ఇంటర్వ్యూనీ బానే చేశా. తీరా చూస్తే బయటివారికి అవకాశమిచ్చారు. కారణమడిగితే.. హోదా, బృందం పరంగా భవిష్యత్ వ్యూహాల విషయంలో స్పష్టత లేదన్నారు.
సీనియర్ మేనేజర్‌ని. మా బాస్ మానేశారు. ఆయన స్థానంలో జనరల్ మేనేజర్ అవుతాననుకున్నా. ఇంటర్వ్యూనీ బానే చేశా. తీరా చూస్తే బయటివారికి అవకాశమిచ్చారు. కారణమడిగితే.. హోదా, బృందం పరంగా భవిష్యత్ వ్యూహాల విషయంలో స్పష్టత లేదన్నారు. అవకాశం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. నా ఆలోచనా పరిధిని పెంచుకునే మార్గముందా?
- శిల్ప
ఉద్యోగి నుంచి నాయకత్వ హోదాకి వెళ్లడం సవాళ్లతో కూడుకున్నది. దీన్ని ఏ సంస్థలోనూ ప్రత్యేకంగా నేర్పరు. మరి ఇంటర్వ్యూ ముందో, ఆ హోదాని అందుకునే ముందో ఆ నైపుణ్యాలు ఠకీమని ఎలా వచ్చేస్తాయ్? అయితే నాయకులవ్వాలంటే దీర్ఘదృష్టి ఉండాల్సిందే. సంస్థనీ, బృందాన్నీ ఏ దిశగా నడిపించాలనుకుంటున్నారన్న వాటిపై స్పష్టతా ఉండాలి. మీరు లోపలి వ్యక్తి కాబట్టి, ఈ విషయంలో మీకు కొన్ని ప్రతికూలతలు ఉన్నట్లే. ఎందుకంటే.. ఆ వాతావరణంలో ఇప్పటికే పనిచేస్తున్నారు. సంస్థలో పని తీరుపై అవగాహన ఉంటుంది. దాంతో అందరూ సాగే దిశలోనే వెళుతుంటారు. అదే బయటి వ్యక్తి అనుకోండి. ప్రతిదీ కొత్తే. ప్రతిదాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి, లోపాలూ స్పష్టంగా కనిపిస్తాయి. వాళ్లు నడిపించే హోదాలో ఉంటే ఏం కోరుకుంటారన్న దానిపై స్పష్టత ఉంటుంది. దీంతో సూచనల విషయంలో వెనకాడరు. ముందు మీరు లోపలి వ్యక్తి అన్న దాన్నుంచి బయటపడండి. మంచి బాస్, బృందంలో స్నేహితులు, ఆనందకర వాతావరణం.. వీటికే పరిమితమవ్వొద్దు. దాన్ని మించి ఆలోచించండి. కొత్త విషయాలు తెలుసుకోవడానికీ, నేర్చుకోవడానికీ ప్రయత్నించండి. కొత్త లీడర్‌తో నేరుగా కలిసి పనిచేయడం మీకు దొరికిన మంచి అవకాశం. తనని గమనించండి. ఏదో ఒక హోదానే లక్ష్యంగా పెట్టుకోకండి. అంతకు మించి ఎదిగే అవకాశాల కోసం చూడండి. ఇంటర్వ్యూల్లో కలిసి పనిచేసే వ్యక్తిగా కాక నాయకురాలిగా ఆలోచించండి. ఉద్యోగులు, బృందం, సంస్థ విషయంలో గతంలో చెప్పడానికి భయపడే అంశాల్నీ నిర్భయంగా చెప్పేయండి. దానికి చేయాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన చర్యలను ముందుంచండి. ప్రతిదానికీ మీ దగ్గర సమాధానం ఉండాలనేమీ లేదు. కానీ కొంత అవగాహన, అవకాశమిస్తే దాన్ని మార్చగల సత్తా ఉందని నిరూపించుకోగలిగితే చాలు. ఈ అంశాలపై దృష్టిపెట్టండి. మీరనుకున్నది సాధించడంలో సాయపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.