మనమెప్పుడవుతాం.. సమానం!

‘ఆడా మగా ఇద్దరూ సమానం’.. ‘కాకపోతే మగవాళ్లు కాస్త ఎక్కువ సమానం’ లాంటి డొంక తిరుగుడు ధోరణులు ఈ దేశాల్లో చెల్లనే చెల్లవు. ‘అన్నింటా సమానం’ అనే దాంట్లో రాజీలేని ధోరణి పాటిస్తున్నారు కాబట్టే లింగ సమానత్వం సాధించిన దేశాల్లో అగ్రస్థానంలో నిలబడ్డాయి. ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక నివేదికలో మన దేశం 135వ స్థానంలో

Updated : 19 Jul 2022 06:43 IST

‘ఆడా మగా ఇద్దరూ సమానం’.. ‘కాకపోతే మగవాళ్లు కాస్త ఎక్కువ సమానం’ లాంటి డొంక తిరుగుడు ధోరణులు ఈ దేశాల్లో చెల్లనే చెల్లవు. ‘అన్నింటా సమానం’ అనే దాంట్లో రాజీలేని ధోరణి పాటిస్తున్నారు కాబట్టే లింగ సమానత్వం సాధించిన దేశాల్లో అగ్రస్థానంలో నిలబడ్డాయి. ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక నివేదికలో మన దేశం 135వ స్థానంలో ఉంది. మరి మనమూ ఎదగాలంటే ఆ దేశాల నుంచి మనమేం నేర్చుకోవాలో చూద్దాం రండి...


స్త్రీల రాజ్యం..

‘ఆడ... మగ సమానం’ అని అంటే వినడమే కానీ ఎప్పుడైనా చూశామా? స్వీడన్‌ వెళ్తే మీకా అవకాశం వస్తుంది. అక్కడ మీరు ఏ మూలకు వెళ్లినా.. పిల్లలకు అన్నం తినిపించే తండ్రులు, జోలపుచ్చే నాన్నలే కనిపిస్తారు. ప్రభుత్వ యంత్రాంగంలోనే కాదు పార్లమెంటులోనూ, ప్రైవేట్‌ సంస్థల్లోనూ అమ్మలు మగవాళ్లకు ఏమాత్రం తగ్గకుండా సత్తాచాటుతున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసా? స్వీడన్‌ ముందు నుంచీ లింగ సమానత్వానికి పెద్దపీట వేసింది. 1974లోనే మెటర్నిటీ లీవ్‌ అనే పదాన్ని తీసేసి... పేరెంటెల్‌ లీవ్‌ అనే పేరు పెట్టింది. అలా పిల్లల బాధ్యత అమ్మకు మాత్రమే పరిమితం చేయకుండా అది తండ్రి బాధ్యత కూడా అని స్పష్టం చేసింది. అందుకోసం ఇద్దరికీ 480 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఇవికాక అవసరాన్ని బట్టి మరో 90 రోజుల సెలవులు కూడా తీసుకోవచ్చు. వీటిని తల్లిదండ్రులు ఇద్దరూ బిడ్డకు ఆరేళ్లు వచ్చేంత వరకూ ఎలా అయినా వినియోగించుకోవచ్చు. ఒక వేళ తల్లి మాత్రమే ఉంటే ఆ సెలవులన్నీ ఆమే తీసుకోవచ్చు. పిల్లల్ని చూసుకోవడానికి నైట్‌ నర్సరీలు కూడా ఉంటాయి. వాటికింతని చెల్లించి పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసుకొనే తల్లులూ ఉంటారు. మరో పక్క పిల్లల్ని కన్నందుకు ప్రభుత్వం కొంత పారితోషికం కూడా ఇస్తుంది. ఇవేకాదు ఆడవాళ్లకు అడుగడుగునా ప్రభుత్వ విధానాలు అండగా ఉండటంతో అక్కడ వాళ్లు అన్ని రంగాల్లోనూ రాణించడం మొదలుపెట్టారు. ఏ యూనివర్సిటీలో అడుగుపెట్టినా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు చదువుకుంటుంటారు.. అంతే సమానంగా ఉద్యోగావకాశాల్నీ అందుకుంటున్నారు. క్రీడల్లో... అథ్లెటిక్స్‌లోనూ అమ్మాయిలే మెరుగ్గా ఉన్నారక్కడ.  


12ఏళ్లుగా మొదటి స్థానంలో..

ఒకటీ రెండూ కాదు... పన్నెండు సంవత్సరాలుగా లింగ సమానత్వం సాధించిన దేశాల్లో ముందు వరుసలో ఉంది ఐస్‌లాండ్‌. 90 శాతం లింగ వివక్షని అధిగమించిన దేశం. ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ స్త్రీల హక్కులు... మగవాళ్ల హక్కులు అంటూ విడిగా ఉండవు. అంతెందుకు మగవాళ్లకి ఆడవాళ్లకంటే ఎక్కువ వేతనం ఇవ్వడం ఇక్కడ నేరం. అయితే ఆ హక్కుని అక్కడి ఆడవాళ్లంతా కలిసి ఉద్యమించి సాధించుకున్నారు. ఆ తర్వాత నుంచీ ఎవరో వస్తారని చూడకుండా.. వాళ్లకేం కావాలన్నా ఇలా ఉద్యమించి సంఘటితంగా సాధించుకోవడం అనేది ఓ సంప్రదాయంగా మారిపోయింది. అలా సురక్షిత గర్భస్రావాల గురించీ, స్త్రీ స్వేచ్ఛ గురించీ  ప్రత్యేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ 80 శాతం మహిళలు ఉత్పత్తి రంగంలో ఉన్నారు. ఏడాదిపాటు వీళ్లకు పేరెంటల్‌ లీవ్‌ దొరుకుతుంది. నర్సరీ నుంచే ఆడపిల్లలకు.. ‘ఐ యామ్‌ స్ట్రాంగ్‌’ అనే విషయాన్ని గుర్తుచేస్తూ ఒక పాఠంగా నేర్పిస్తూ పెంచుతారట.


బోర్డుల్లో హవా..

పనిచేసే చోట సమాన హక్కుల్ని అందుకోవడంలోనూ... అధికారంలోనూ, పిల్లల్ని పెంచడంలోనూ స్త్రీలకు అత్యధిక ప్రయోజనాలని అందిస్తున్న దేశం నార్వే. పిల్లలకి 18 ఏళ్లు వచ్చేంత వరకూ ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందొచ్చు. హైస్కూల్‌, ఉన్నత చదువులు అందరికీ ఉచితం. ఇక పనిచేస్తూ పిల్లల్ని చదివించాలనుకొనే తల్లులకు... ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు ఇస్తుంది. ఇంటి నుంచే పనిచేయొచ్చు. ఆఫీసుల్లో పిల్లలకి పాలివ్వడానికి ప్రత్యేకంగా బ్రెస్ట్‌ ఫీడింగ్‌ గదులుంటాయి. వ్యాపార సంస్థల మేనేజ్‌మెంట్‌ బోర్డుల్లో అత్యధికంగా స్త్రీలు ఉన్న దేశం కూడా నార్వేనే. బోర్డు మెంబర్లుగా 40 శాతం మహిళలు తప్పనిసరిగా ఉండాలనేది నిబంధన. ‘షీ కాన్ఫరెన్స్‌’ పేరుతో ఏటా అంతర్జాతీయ సదస్సుని నిర్వహిస్తారు. దీని లక్ష్యం లింగవివక్షని ఇంకా ఇంకా తగ్గించడం ఎలా అనే. ‘హర్‌ స్పేస్‌’ పేరుతో మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించడానికి అవసరం అయిన ప్రోత్సాహాన్ని నిరంతరం అందిస్తారు. ‘ఫిమేల్‌ ఫ్యూచర్‌’ పేరుతో నాయకత్వ సదస్సులు నిర్వహిస్తూ స్త్రీలు నడిపే స్టార్టప్‌లు, పెద్ద సంస్థలకు పెట్టుబడులు అందేలా ప్రభుత్వం చూస్తుంది. ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టే లింగవివక్షని అధిగమించిన మూడో దేశంగా నార్వే ఘనత సాధించుకుంది.


తేడా ఉండదిక్కడ..

లింగవివక్షని అధిగమించడంలోనే కాదు ప్రపంచంలో సంతోషంగా ఉండే దేశాల్లో ఫిన్లాండ్‌ కూడా ఒకటి. ఇందుకు కారణాలు అన్వేషిస్తే... స్త్రీ, పురుషుల వేతనాలు సమానంగా ఉండటం ఒకటైతే.. ఆడ, మగ అని తేడా లేకుండా అందరికీ చదువుకొనే అవకాశం ఉండటం మరొకటి. యూనివర్సిటీ విద్య, వైద్యం అందరికీ ఉచితం. దాంతో అక్కడి స్త్రీలు మేం ఆడవాళ్లం కాబట్టి ఈ పని చేయలేం అనే ఆలోచనని పొరపాటున కూడా రానీయరట. ఉద్యోగ బాధ్యతల్లో ఏయే రోజులు, ఏ సమయంలో పనిచేయగలమో నిర్ణయించుకునే హక్కు ఇక్కడ మహిళలకుంది. నిరుద్యోగులకు, గృహిణులకు నెలకు రూ.40వేలు జీవనభృతి అందిస్తుందీ ప్రభుత్వం. ఉద్యోగ, వ్యాపారాల్లో లింగ సమానత్వానికి ఇక్కడ పెద్దపీట. ప్రతి రంగంలోనూ మహిళలకు అవకాశాలిస్తూ, వారికోసం  ప్రత్యేక పథకాలనూ ఈ దేశం రూపొందిస్తోంది. ఇక్కడ మహిళలపై లైంగిక దాడుల సంఘటనలు అతి తక్కువ. మహిళలకు తమ భద్రతపై భరోసా ఉంది. వీరి ఆరోగ్యపరిరక్షణకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను రూపొందిస్తుంది. గర్భిణిలకు ఆరోగ్యపథకాలతోపాటు ప్రసవం వరకు పూర్తి ఉచిత వైద్య సేవలుంటాయి. ప్రసవ సెలవులుంటాయి. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో ఉండే తల్లుల సౌకర్యార్థం పసిపిల్లలకు ఉచితంగా డేకేర్‌ సెంటర్స్‌ నిర్వహిస్తుంది. సమాన అవకాశాలు ఇస్తున్నప్పుడు సమానంగా రాణించడం కష్టం కాదని నిరూపిస్తున్నారు ఇక్కడి స్త్రీలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్