ఆస్తులు అబ్బాయికే చెందాలంటే...

నేనో ప్రభుత్వ ఉద్యోగిని. నాలుగేళ్ల కిందట విడాకులు తీసుకున్నా. పదో తరగతి చదువుతున్న మా అబ్బాయి, నేనూ కలిసి ఉంటున్నాం. నేను సంపాదించుకున్న ఆస్తులు, ఉద్యోగరీత్యా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ, మా అబ్బాయికి

Updated : 19 Jul 2022 12:25 IST

నేనో ప్రభుత్వ ఉద్యోగిని. నాలుగేళ్ల కిందట విడాకులు తీసుకున్నా. పదో తరగతి చదువుతున్న మా అబ్బాయి, నేనూ కలిసి ఉంటున్నాం. నేను సంపాదించుకున్న ఆస్తులు, ఉద్యోగరీత్యా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ, మా అబ్బాయికి చెందేలా ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవలిసి ఉందా? అబ్బాయి స్కూల్‌ సర్టిఫికెట్లలో తండ్రి పేరును తొలగించి నా పేరును నమోదు చేసుకోవలసిన అవసరం ఉందా. దయచేసి తెలియజేయండి.

- ఒక సోదరి

మీరు భర్త నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు కాబట్టి స్కూల్‌ రికార్డుల్లో ఆయన పేరు తొలగించడానికి అడ్డంకులేమీ ఉండవు. మీ ఆఫీస్‌ రికార్డుల్లో కూడా నామినీగా మీ భర్త పేరును తొలగించి అబ్బాయి పేరు చేర్చండి. హిందూ వారసత్వ చట్టం- సెక్షన్‌ 14 ప్రకారం మహిళ తను సంపాదించుకున్న ఆస్తినైనా, పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తినైనా, పెళ్లి తర్వాత అత్తమామలు లేదా భర్త ద్వారా పొందిన.. అంటే ఆమె పేరు మీదే రిజిస్టర్‌ చేసిన ఆస్తికైనా, పిల్లల ద్వారా ఆమె పేరు మీద పెట్టిన ఆస్తికైనా ఆమే సంపూర్ణ హక్కుదారు అవుతుంది. అందువల్ల ఆమె ఆ ఆస్తిని తన ఇష్టం వచ్చినవారికి స్వార్జితపు ఆస్తిగా ఇవ్వొచ్చు. హిందూ వారసత్వ చట్టం- సెక్షన్‌ 15 ప్రకారం వీలునామా రాయకుండా చనిపోయిన మహిళ ఆస్తి పిల్లలకు, భర్తకు చెందుతుంది. మీరు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు కాబట్టి మీ ఆస్తి మీ పిల్లలకే వస్తుంది. దానికోసం మీరు వీలునామాగానీ, గిఫ్ట్‌గాగానీ రాసి రిజిస్టర్‌ చేసినా, చెయ్యకపోయినా అతనికే చెందుతుంది. మీకు ఇంకా అనుమానం ఉండకూడదనుకుంటే ‘నా స్థిర, చరాస్తులు, ఉద్యోగరీత్యా వచ్చే ప్రయోజనాలన్నీ నా తదనంతరం నా కుమారుడికే చెందుతాయి’ అని వీలునామా రాసి రిజిస్టర్‌ చేయండి. కానీ అది మీ ఉద్యోగ విరమణ తర్వాత చేస్తే అప్పటికి మీకు ఎంత ఆస్తి ఉందో కచ్చితంగా తెలుస్తుంది కదా! వీలునామా అయితే మీ తదనంతరం వర్తిస్తుంది. గిఫ్ట్‌ అయితే మీరు ఇచ్చిన మరుక్షణమే చెల్లుబాటులోకి వస్తుంది. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని