ఇలా సాంత్వన

ఇంటి పనులు, ఆఫీసు పనులు... ఇవి చాలవన్నట్టుగా బుర్రనిండుగా ఏవో ఆలోచనలు. దీంతో మనసు పెట్టి ఏ పనీ చేయలేని పరిస్థితి. దీన్నుంచి తప్పించుకోవడానికి కొన్ని దారులున్నాయట. అవేంటో చూద్దాం...

Published : 21 Jul 2022 01:31 IST

ఇంటి పనులు, ఆఫీసు పనులు... ఇవి చాలవన్నట్టుగా బుర్రనిండుగా ఏవో ఆలోచనలు. దీంతో మనసు పెట్టి ఏ పనీ చేయలేని పరిస్థితి. దీన్నుంచి తప్పించుకోవడానికి కొన్ని దారులున్నాయట. అవేంటో చూద్దాం...

* చామంతి, లావెండర్‌, రోజ్‌మేరి... లాంటి టీలను ఆదరాబాదరాగా కాకుండా మీకు బాగా ఇష్టమైన ఓ మంచి కప్పులో తాగుతూ ఆస్వాదించి చూడండి. ఓ పదినిమిషాలు కళ్లు మూసుకుని ధ్యానం చేసిన ఫలితం ఉంటుందట. దాంతో అంతవరకూ చికాకు పెట్టిన ఆలోచనలు ఒక్కొక్కటిగా తప్పుకొని మనసుని తేలిక పరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 

* కొన్నిసార్లు ఏదో పనిలో ఉండి స్నేహితురాలి ఫోన్‌ తీయకపోవచ్చు. లేదా ఎవరైనా అప్పగించిన పనిని పూర్తిచేయలేకపోవచ్చు. ఇక అక్కడనుంచి ‘నా గురించి వాళ్లు ఏమనుకుంటారో’ అని వాళ్ల కంటే మనమే ఎక్కువగా ఊహించుకుని అపరాధ భావనతో బుర్రంతా పాడు చేసుకుంటాం. బదులుగా ఫోన్‌ చేసి మీ పరిస్థితి చెప్పేస్తే సరిపోతుంది. ఆ భారం మనసులోంచి తొలగిపోతుంది. కానీ అవతలివారికి మీ ఒక్కరి గురించి మాత్రమే ఆలోచించేంత తీరిక ఉంటుందని అనుకోవద్దు.

* ఒక కాగితంలో... గతంలో మీరు విజయవంతంగా పరిష్కరించుకున్న ఒక పనిని రాసి పెట్టండి. దాని  కింద ఇప్పుడు మీరు పరిష్కరించలేక సతమతమవుతున్న సమస్యను గురించి రాయండి. అప్పటికప్పుడు కాకపోయినా ఈ జఠిలమైన సమస్యకు పరిష్కారం సాధించుకోవడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది.

* ఆలోచనలతో నిండిన మనసు యథాస్థానానికి రావాలంటే నడకకు మించిన పరిష్కారం లేదంటారు నిపుణులు. నచ్చిన పాడ్‌కాస్టో, పాటలో వింటూ నాలుగు అడుగులు వేయండి. మనసు, మెదడు రెండూ తేలిక పడతాయి.

* సోషల్‌ మీడియా వార్తలు కూడా మన అకారణ కోపానికీ, చికాకుకి కారణాలే. అందుకే వీలైనంత వరకూ వాటికి దూరంగా ఉన్నప్పుడు కూడా చికాకులు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని