Updated : 24/07/2022 05:37 IST

మునివేళ్ల స్పర్శతోనే మేకప్‌ చేసేస్తుంది!

ఆ అమ్మాయి ఎదుటివారి ముఖాన్ని తన మేకప్‌ నైపుణ్యాలతో క్షణాల్లో అందంగా తీర్చిదిద్దేయగలదు. అందులో ఏముంది, చాలా మంది చేస్తారు అంటారా? అంతే కాదు... ఎంతో మందికి మేకప్‌ కళలో నైపుణ్యాలు నేర్పి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఇదీ మామూలే అంటారా. కానీ ఇక్కడ ఆ అమ్మాయి అంధురాలు!!! ఇప్పుడేమంటారు? కళ్లు కనిపించని అమ్మాయి మేకప్‌ చేయడం, నేర్పడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు  గ్జియో జియా కథ తెలుసుకోవాలి...

ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జియా చిన్నప్పుడు ఆరోగ్యంగానే ఉండేది. వాళ్లది చైనా. చదువులో చాలా చురుకు. 14 ఏళ్ల వయసులో అనుకోకుండా చూపు తగ్గడం మొదలైంది. వైద్యులు పరీక్షలు చేసి రెటినల్‌ డిస్ట్రోఫీ అన్నారు. మరికొన్నాళ్లలో చూపు పూర్తిగా పోతుందన్నారు. అలాగే జరిగింది కూడా. అప్పటివరకూ చదువుతున్న బడిలో తనకు పాఠాలు చెప్పలేమన్నారు. మరో దారి లేక అంధుల పాఠశాలలో చేర్పించారు అమ్మానాన్న. అక్కడే జియాకు అసలు ప్రపంచమేంటో అర్థమవడం మొదలైంది. అక్కడికొచ్చే వారిలో చాలామంది అమ్మాయిలు అనాథాశ్రమాల నుంచి వచ్చినవారే. కంటి చూపు లేని అమ్మాయిలకు చదువెందుకని ఎద్దేవా చేసేవారు తోటి అంధ మగ విద్యార్థులు. ఎప్పటికైనా పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండాల్సిందే కదా అనేవారు. వాళ్లలా ఉంటే... పాఠాలు చెప్పడంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు తేడా చూపించే వారు ఉపాధ్యాయులు. మగ పిల్లలందరూ మసాజ్‌ థెరపీలో శిక్షణ పొందితే, ఆడపిల్లలకు అవేవీ అవసరం లేదనే వారు. అలా అక్కడ తీవ్రమైన లింగ వివక్షను చూసింది జియా. తర్వాత  కాలేజీలో చేరి డిగ్రీ పూర్తిచేసింది. అక్కడితో ఆగలేదు... పార్లర్‌ కోర్సు చేసింది. మరొకరివద్ద పనిచేసే బదులు, సొంతూరులోనే తనకాళ్లపై తాను నిలబడాలనుకుంది. బ్యూటీ పార్లర్‌ ప్రారంభించింది. మేకప్‌ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండటంతో అందులోనూ శిక్షణ తీసుకుంది.

ఆత్మవిశ్వాసాన్ని..

పార్లర్‌ తెరిచాక కొత్త ఇబ్బందులొచ్చాయి జియాకి. ‘పార్లర్‌లో మసాజ్‌ కూడా చేయాల్సి వచ్చేది. మెల్లగా వినియోగదారుల నుంచి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. దాంతో పార్లర్‌ని మూసేశా. అప్పటికి నాకు 20 ఏళ్లు నిండాయి. ఉద్యోగం చేయడానికి బీజింగ్‌ వెళ్తానంటే అమ్మానాన్న ఒప్పుకోలేదు. అంధురాలివి, ఒంటరిగా వెళ్లొద్దంటూ అభ్యంతరం చెప్పారు. వారినెదిరించి మరీ అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లా. ఓ ప్రైవేటు సంస్థలో స్టెనోగ్రాఫర్‌గా చేరా. ఒక ఎన్జీవోలోనూ పనిచేశా. ఇవేవీ  తృప్తినివ్వలేదు. నేనే సొంతంగా ఏదైనా చేయాలనుకున్నా. అలా 2015లో అంధులకు ప్రత్యేకంగా మేకప్‌ టెక్నిక్స్‌పై శిక్షణనిచ్చే కోర్సు మొదలుపెట్టా. కోర్సు మొత్తం 21 రోజులుంటుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ... రెండు పద్ధతుల్లోనూ చెబుతా. మాయిశ్చరైజర్‌ రాసుకోవడం నుంచి ఫౌండేషన్‌, ఐ మేకప్‌, లిప్‌స్టిక్‌, చివరిగా బ్లష్‌ వరకు నేర్పిస్తా. వేళ్ల స్పర్శతో ఏ చర్మానికి ఎంత ఫౌండేషన్‌ సరిపోతుందో చెప్పగలను. కాటుక పెట్టడంలో నైపుణ్యాలను నేర్పుతాను. ప్రతీదీ స్పర్శ ద్వారానే శిక్షణ ఉంటుంది. ఈ ఏడేళ్లలో వేలమంది అంధ మహిళలు నా వద్ద శిక్షణ తీసుకున్నారు. ఎవరికి వారు సొంతంగా మేకప్‌ వేసుకునే ఈ నైపుణ్యాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయని ఎందరో నాకు సమాచారం పంపుతుంటారు.  ఇది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహమాడాను. మరిన్ని వేలమందికి మేకప్‌లో శిక్షణనిస్తా’ అంటున్న జియా తనలాంటివారికే కాదు, అందరికీ స్ఫూర్తిదాయకమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని