జీవించడం నేర్పిస్తోంది!

ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసినా నిరుత్సాహ పడలేదా అమ్మాయి... పైగా తనలాంటి వారిలో స్థైర్యాన్ని నింపుతోంది... ఆత్మహత్య ఆలోచనలకి దూరంగా ఉండటం గురించి యువతకు స్ఫూర్తి పాఠాలూ చెబుతోంది... తనే అనంతపురానికి చెందిన ఆయేషా అజ్మత్‌

Updated : 25 Jul 2022 07:12 IST

ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసినా నిరుత్సాహ పడలేదా అమ్మాయి... పైగా తనలాంటి వారిలో స్థైర్యాన్ని నింపుతోంది... ఆత్మహత్య ఆలోచనలకి దూరంగా ఉండటం గురించి యువతకు స్ఫూర్తి పాఠాలూ చెబుతోంది... తనే అనంతపురానికి చెందిన ఆయేషా అజ్మత్‌. ధైర్యానికి నిలువెత్తు రూపంలా నిలుస్తోన్న ఈ అమ్మాయి వసుంధరతో ఏం చెప్పిందంటే...

నాకు 20 ఏళ్లు.. ఇన్నేళ్లు బతికున్నానంటే నా గురించి తెలిసిన ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నాకు పుట్టుకతోనే తలసీమియా ఉంది. బతకడం కష్టమన్నారు డాక్టర్లు. ఏడో పుట్టినరోజు వరకూ కనీసం నిలబడలేకపోయా. చుట్టపక్కాలు ‘మీ పెద్దమ్మాయి ఉంది కదా. ఈ బాధలెందుకు. చిన్నమ్మాయిని ఏ మందో మాకో పెట్టి వదిలించుకోండి’ అని ఉచిత సలహాలిస్తే.. ‘దానికి పోరాడుతూ బతకడం నేర్పిస్తాం. బతకలేకపోతే అదే చనిపోతుంది’ అని బదులిచ్చే వారట. 20 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవడానికి హైదరాబాద్‌ వెళ్తుంటే... ఎందుకిలా అని అమ్మను అడిగే దాన్ని. కాస్త పెద్దయ్యాక విషయం చెప్పారు. నేనెక్కడ బాధపడతానోనని పత్రికల్లో తలసీమియా వార్తలు వస్తే కనిబడనిచ్చే వారు కాదు. ఈ ఆలోచనల నుంచి మళ్లించడానికి కూచిపూడి నేర్పించింది అమ్మ. ఎనిమిదేళ్లుగా కూచిపూడి నేర్చుకుంటూ చాలా ఆలయాల్లో, పోటీల్లో ప్రదర్శనలిచ్చా.

ఆత్మహత్య ఆలోచనే వద్దు..

అమ్మా నాన్నా సహకారంతో బాగానే జీవిస్తున్నా.. ‘కానీ సమాజానికి ఏం చేస్తున్నా’నని ప్రశ్నించుకున్నా. కనీసం నాలాంటి వాళ్లకైనా ఏదో ఒకటి చేయాల్సిందే అనుకున్నా. జిల్లాలో, ఆ చుట్టుపక్కలా తలసీమియా, హెచ్‌ఐవీ లాంటి ప్రాణాంతక వ్యాధుల బాధితుల గురించి తెలుసుకుని వారితో మాట్లాడతా. తలసీమియాతో ఇక తాము బతకమని పిల్లలు నైరాశ్యంలో మునిగిపోతారు. వారిని ఊరడిస్తూ జీవితంపై ఆశ నింపుతున్నా. వీళ్లు ఎంత సంతోషంగా జీవిస్తారనేది వారి తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుంది. వారితో నా అనుభవాలను పంచుకుంటా. ‘ఆ పిల్లలపై సానుభూతి చూపించద్దు. ధైర్యాన్ని ఇవ్వండి. అదే వారిని బతికిస్తుంది’ అని చెబుతా. మా అనంతపురం వైద్య కళాశాలలో ‘ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సిలబస్‌ అంటే భయంతోనో, మరో కారణంతోనో వైద్య విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేస్తుంటారు. వారికి నా కథ చెబుతా, జీవితం విలువని వివరిస్తూ ఆ ఆలోచనల్ని దూరం చేసుకోవాలని చెబుతా. తలసీమియా బాధితులకు ఆర్నెల్లకోసారి పలు పరీక్షలు చేయాలి. నిర్ణీత వ్యవధుల్లో రక్తం మార్చాలి. ఆ వసతులను మా నగరానికి తీసుకురావడమే నా లక్ష్యం. దీని కోసం ఓ సంస్థ అంగీకరించింది. కూచిపూడి స్కూల్‌ పెట్టాలని ప్రయత్నిస్తున్నా. ఇవన్నీ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసమే కాదు.. ఖాళీగా ఉంటే ఆ వ్యాధి కాదు, దాని ఆలోచనలే చంపేస్తాయని. నాకు పక్షులన్నా చాలా ప్రేమ. 50 వేల మానవ నిర్మిత పక్షి గూళ్లను ఏర్పాటు చేసి రికార్డుల్లోనూ చోటుదక్కించుకున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్