అసూయను తరిమేద్దాం...
ఎవరికైనా విద్యార్హతలూ, నైపుణ్యాలను బట్టే ఉద్యోగాలు వస్తాయి. అయితే కొందరు ఉన్నచోటే ఉండిపోతే మరికొందరు పదోన్నతులు పొందుతూ ఎదుగుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో అభినందించకపోగా అసూయ చెందడం, కించపరచడం చూస్తుంటాం.
ఎవరికైనా విద్యార్హతలూ, నైపుణ్యాలను బట్టే ఉద్యోగాలు వస్తాయి. అయితే కొందరు ఉన్నచోటే ఉండిపోతే మరికొందరు పదోన్నతులు పొందుతూ ఎదుగుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో అభినందించకపోగా అసూయ చెందడం, కించపరచడం చూస్తుంటాం. ఈ ప్రొఫెషనల్ జెలసీ గురించి కెరియర్ కౌన్సిలర్లు ఏమంటున్నారో చూడండి...
* విద్యార్హతలు చాలామందికి ఒకలానే ఉంటాయి. కానీ నైపుణ్యాల్లో తేడా ఉంటుంది. వాటిని బట్టే ఎదుగుదల సాధ్యమౌతుంది. వీధి వీధిలో డాక్టర్లున్నా కొద్దిమందికే పేరెందుకొస్తుంది? ప్రతిభా వ్యుత్పత్తులను బట్టే కదా! ఇది అర్థం చేసుకుంటే ఈర్ష్య కలగదు. మీరు కూడా అలాంటి సామర్థ్యాలను పెంచుకోవాలే తప్ప అక్కసు ప్రదర్శించొద్దు.
* ఇంకొందరైతే మర్యాదల సరిహద్దులు చెరిపేసి ‘బాస్‌తో చనువుగా ఉన్నందున పదోన్నతి వచ్చింది’, ‘పైవాళ్లని కాకాపట్టి ఆ స్థానానికి వెళ్లింది’ తరహా చవకబారు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సైకాలజిస్టులు ఇలాంటి నైజాన్ని వ్యక్తిత్వ లోపంగా, మానసిక వ్యాధిగా పరిగణిస్తారు. మీ ఎదుట ఇలాంటి భావాలు వ్యక్తంచేస్తే వారితో కలిసి వంత పాడకండి. మీరు గనుక నిరసిస్తే మరోసారి ఇలాంటి ప్రస్తావనలు తీసుకురారు.
* వ్యక్తిగత ఇష్టాలు ఉన్నంతలో పదోన్నతులు పంచిపెట్టడానికి అవి మిఠాయిలు కావని అర్థం చేసుకోండి. అర్హత లేనివారిని అందలం ఎక్కిస్తే తన ఉద్యోగానికే ఎసరొస్తుందని పై అధికారికి తెలీదా? ఒకవేళ సంస్థ యజమానే అలా చేశారనుకుంటే అది మరీ హాస్యాస్పదం. అతడు లాభాల బాటలో పయనించాలనుకుంటాడు కానీ సంస్థను దివాలా తీయించడుగా!
* సహోద్యోగికి ప్రమోషన్ వస్తే మీకూ రావాలనుకోవడం తప్పు కాదు. కానీ అందుకు ఈర్ష్య పరిష్కారం కాదు. ఆమె నేర్పు ఏమిటో గమనించి మీరూ అలవరచుకోండి. అంతకంటే ముందు మనసారా అభినందించండి. మీలో లేని, మీకు తెలీని అంశాలను నేర్చుకోండి. అవసరమైన సలహాలూ, సహకారం తీసుకోండి. కృషీ, పట్టుదల ఉంటే ఈరోజు కాకుంటే రేపు మీరూ ఉన్నత స్థితికి వెళ్తారు.
* ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అది న్యూనతకు దారితీస్తే మరింత అనర్థమని మర్చిపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.