స్వాతంత్య్ర సమరంలో తెలుగు తారకలు

కష్టాలనీ, కన్నీళ్లని... ఇష్టంగా స్వాగతించారు! కటకటాల జైలు జీవితాన్ని... ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు.. స్వరాజ్య సాధనలో.. గెలుపు గీతికలై వికసించిన తెలుగింటి ఆడపడుచులు ఎందరో. ఈ అమృత మహోత్సవాల్లో మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం జీవితాలను ధారబోసిన కొందరి స్ఫూర్తిగాథల్ని స్మరించుకుందాం...

Updated : 12 Aug 2022 08:00 IST

కష్టాలనీ, కన్నీళ్లని... ఇష్టంగా స్వాగతించారు! కటకటాల జైలు జీవితాన్ని... ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు.. స్వరాజ్య సాధనలో.. గెలుపు గీతికలై వికసించిన తెలుగింటి ఆడపడుచులు ఎందరో. ఈ అమృత మహోత్సవాల్లో మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం జీవితాలను ధారబోసిన కొందరి స్ఫూర్తిగాథల్ని స్మరించుకుందాం...


ఆమె రాసిన ‘సీతారామం’.. 

‘సీతారామం’ అబ్బే సినిమా కాదు! 1916లో కోల్‌కతాలో ఉంటున్న ఓ 16 ఏళ్ల అమ్మాయి రాసిన పుస్తకం పేరది. సీతారాముల కథని అందమైన బొమ్మల సాయంతో పుస్తకంగా రాసి ప్రచురించింది. ఆ వచ్చిన డబ్బుతో చదువుకొంది. ఆమె భర్త కూడా అదే కోల్‌కతాలో నేతాజీతో కలిసి చదువుకున్నారు. అతను పైచదువులకోసం అమెరికా వెళ్లాడు. తను కూడా పాస్‌పోర్ట్‌ సిద్ధం చేసుకుని, స్వెట్టర్లూ వగైరా కొనిపెట్టుకుని సిద్ధంగా ఉంది అమెరికా వెళ్లడానికి. కట్‌చేస్తే..
1921... గాందీజీ బెజవాడలో మహిళా సమావేశానికి హాజరయ్యారు. అప్రయత్నంగానే ఆయన చూపు రెండు లక్షలమందున్న ఆ సభని క్రమపద్ధతిగా నడిపిస్తున్న ఓ అమ్మాయిపై పడింది. తనే కాసేపటికి చేతికున్న రెండు గాజులు, మెడలో పుస్తెలూ తప్పించి తక్కిన నగలన్నీ కాంగ్రెస్‌ నిధికి ఇచ్చింది. అంతవరకూ స్త్రీలు ఇలా నగల్ని విరాళంగా ఇచ్చే సంప్రదాయం మొదలుకాలేదు. ఆమెతోనే ఆరంభమైంది. స్పష్టమైన ఇంగ్లిష్‌లో ‘మా ఊరు ఏలూరు రావాల’ని గాంధీని కోరిన ఆ అమ్మాయి మరెవరో కాదు అమెరికా వెళ్లడానికి సిద్ధమైన ఆ కోల్‌కతా పిల్లే. పేరు మాగంటి అన్నపూర్ణాదేవి. ఈ రోజు అరవిందుని లేఖలు వంటి గొప్ప సాహిత్యం మనకి చేరువకావడానికి కారణమైన వ్యక్తే ఈ అన్నపూర్ణాదేవి. తల్లిదండ్రులు.. కలగర రామస్వామి, పిచ్చమ్మలు బ్రహ్మ మతాన్ని అనుసరించడంతో ఆమెని కోల్‌కతాలోని బ్రహ్మబాలికా పాఠశాలకు పంపించారు. అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో సొంతంగా పుస్తకాలు రాస్తూ, బెంగాలీ సాహిత్యాన్ని అనువాదం చేస్తూ చదువుకున్నారామె. అమెరికా బయలుదేరే సమయానికి గాంధీజీ పిలుపువిని ఏలూరు వచ్చేశారు. దాచుకొన్న డబ్బుతో రాట్నాలు కొని అందరికీ పంచారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన భర్తను... జాతీయోద్యమంలోకి వచ్చేలా ప్రోత్సహించారు. సమాజం వెలివేసిన అంటరాని పిల్లలని తెచ్చి ఇంట్లో పెంచారు. అందుకే గాంధీజీ ఆమెని ఉత్తరాల్లో ‘కన్నకూతురు’ అంటూ సంబోధించేవారు. 27 ఏళ్ల వయసులో ఝాన్సీలక్ష్మీబాయి అనే పాపకి జన్మనిచ్చి అనారోగ్యంతో వారం రోజులకే చనిపోయారు. అప్పుడు గాంధీ ‘నా కూతురే మరణించినంత బాధకలుగుతోంది’ అంటూ కుమిలిపోయారు.


స్వయం ఉపాధికి శ్రీకారం చుట్టి...

‘తుపాకీలతో బెదిరిస్తారు.. లాఠీలతో కొడతారు... జైల్లో వేస్తారు. ఏం జరిగినా బెదరకూడదు. ఈ కష్టాలకు నువ్వు సిద్ధమేనా?’ తననెంతో ఇష్టంగా పెంచిన అన్నయ్యతో పాటు గురువు గారి ప్రశ్న కూడా అదే. ‘సిద్ధమే!’ అందామె. అదేదో మాటవరసకి అన్నది కాదని, గుండెల్లోంచి వచ్చిందే అని కొన్ని రోజులకే నిరూపితమైంది.  బ్రిటిష్‌ ప్రభుత్వం ఆర్నెల్ల జైలు శిక్ష వేసింది. అసలు విషయం ఏంటంటే అప్పటికి ఆమె వయసు పద్నాలుగేళ్లు. పేరు సరళాదేవి. కృష్ణాజిల్లా పైడిగుండ్లవారి పాలెం ఆమె స్వస్థలం. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అని ఎన్నో విద్యలు నేర్పినట్టుగా... సరళాదేవి అన్నయ్య యలమంచిలి వెంకటప్పయ్య హిందీ, సత్యాగ్రహ పాఠాలు కలిపి నేర్పించారు. దాంతో ఆ అమ్మాయి పికెటింగులు, ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేది. కానీ నిజమైన గురువు పరీక్ష పెట్టనిదే శిష్యుల్ని రంగంలోకి దింపరట. అందుకే... ముందే ఆమెని జైలు కష్టాలకి సిద్ధం చేశాడు ఆమె సోదరుడు. జైల్లో తోటి ఉద్యమకారుల దగ్గర హిందీని పూర్తిగా నేర్చుకుంది. విడుదలయ్యాక... ముహూర్తాలు, మంత్రాలు లేకుండానే  కొత్తపల్లి వెంకట కృష్ణవర్మని వివాహమాడారు. సేవాగ్రామంలో శిక్షణ తీసుకొని.. తిరిగి వచ్చాక తెలుగునేలపై స్త్రీలు స్వయం ఉపాధి బాట పట్టేలా వారికి శిక్షణ ఇచ్చేవారు. నూలువడకడం, హిందీపాఠాలు, వ్యవసాయ పనులు, తేనె తయారీ ద్వారా ఆదాయం పొందేలా ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన ఆమె.. 1972లో అనారోగ్యంతో మరణించారు.


స్త్రీల కోసం ఆమె.. 

డపిల్ల కన్నీరు ఇంటికీ, సమాజానికీ మంచిది కాదనుకొనే మనస్తత్వం ఆ తండ్రిది. కన్నీరు ఆడపిల్ల ఆయుధం కాదు... ధైర్యమై ఆమెని ముందుకు నడిపిస్తుందనే దూకుడుభావజాలం ఆ కూతురిది. పేరు అచ్చమాంబ. అది తన మేనత్త అయిన బండారు అచ్చమాంబ పేరే. ఆమెలా గొప్ప రచయిత్రి కావాలని తండ్రి భావించాడు. ఆమె మాత్రం మెడికల్‌ కాలేజీలో చేరింది. స్త్రీల ప్రసూతి కష్టాలను తీర్చడానికి గైనకాలజీలో లోతుగా పరిశోధనలు చేశారు. లండన్‌ వెళ్లి... మూడు డిగ్రీలని పూర్తిచేశారు. వామపక్ష భావాలని అలవరుచుకున్నారు. మద్రాసులో గొప్ప డాక్టర్‌గా స్థిరపడే అవకాశం వచ్చినా... స్త్రీలకు సేవలు అందించేందుకు తెలుగునేలపైనే స్థిరపడ్డారు. ప్రసూతి, శిశుపోషణ అనే వైద్యగ్రంథాన్ని కూడా రాసి స్త్రీలల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఇదంతా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు మాట. యుద్ధసమయంలో... ఆహార కొరతలేకుండా చేయడంకోసం పలుగూ పారా చేతపట్టి పొలం పనులు చేశారు. మాంటిస్సోరీ విద్యా విధానంలో చదువు చెప్పడం మొదలుపెట్టారు. శాసనోల్లంఘనం చేసి జైలుకెళ్లారు. 1957లో కాంగ్రెస్‌ తరపున శాసన సభకు ఎంపికయ్యారు. 1964లో ఆమె గుండెపోటుతో చనిపోయినప్పుడు కన్నీరుపెట్టని స్త్రీ మూర్తి లేదని అంటారు.


నిరక్షరాస్యతపై సమరం..

మూసీవరదల్లో చిక్కుకుని హైదరాబాద్‌ నగరం అల్లకల్లోలమైనప్పుడు... పరదాలో ఉంటూనే వందల మంది స్త్రీలకు అండగా నిలబడ్డారు తయ్యబాబేగం. సరోజినీ నాయుడు, ఆమె స్నేహితురాళ్లు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని సాధించిన తొలి ముస్లిం మహిళా గ్రాడ్యుయేట్‌. ఎమ్మే పాసయ్యారు. ఎన్నో నవలలు రచించారు. ఆమె రాసిన భారతీయ లోక్‌గీత్‌ని లండన్‌ పత్రిక ధారావాహికగా ప్రచురించింది. అలాంటి తల్లి కడుపున పుట్టిన మాసుమా బేగం సైతం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జాతీయోద్యమంలో స్త్రీల గొంతుకని సమర్థంగా వినిపించిన యోధురాలు. భర్త ప్రోత్సాహంతో మహిళా విద్యావ్యాప్తికి, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విశేషకృషి చేశారు. అఖిల భారత మహిళా సంస్థ ఉపాధ్యక్షురాలిగా ఎనలేని సేవలందించారు. దేశంలో మొదటి ముస్లిం మహిళా మంత్రిగా ఎన్నికై ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్