Updated : 14/08/2022 07:33 IST

ఈ రాణులు..గుండెల్లో కోట కట్టుకున్నారు!

తమ నెత్తురైనా... దేహమైనా ఈ మట్టిలోనే కలవాలనుకున్నారు!  కోటల్నీ, కిరీటాల్ని వదిలి ప్రజల గుండెల్లోనే కొలువున్నారీ రాణులు..  భవిష్యత్‌ తరాల స్వరాజ్య స్థాపన కోసం పోరాటానికి కావాల్సినంత స్ఫూర్తిని రగిలించారు...


పదహారేళ్లకే.. నాయకత్వం!

‘ఈశాన్య భారత ఉగ్రవాది’ అన్నారు.. ‘పట్టిస్తే మీ ఊరికి పదేళ్లు పన్ను రద్దు చేస్తాం!’ అన్నారు.. ఎన్ని ఆశలు చూపించినా, ఎంత భయపెట్టినా నాగాలు దేవతగా కొలిచే తమ పర్వత రాణిని వదులుకోలేదు. ఆమె పేరు గైడెన్లియు. ఈ రాణికి కిరీటాలు లేవు, కోటలూ లేవు. 13 ఏళ్ల చిన్న వయసులో నాగా జాతి రక్షణ బాధ్యత తీసుకొంది. అందుకే ఈశాన్య భారతమంతా ఆమెని రాణిగా, దేవతగా కొలిచింది. అసోం, మణిపుర్‌, నాగాలాండ్‌ ప్రాంతాల్లోని కొండల్లో విస్తరించిన ఆదివాసీ నాగా జాతి.. జెలియాంగ్రోంగ్‌! అందులో భాగమైన రోంగ్‌మే తెగలో 1915 జనవరి 26న జన్మించింది గైడెన్లియు. ఆమెను దైవ ప్రసాదంగా ప్రజలు భావించేవారు. ఆమె బంధువు అయిన హైపౌ జాడోనాంగ్‌ను తమ తెగ రక్షకుడిగా కొలిచేవారు. బ్రిటిషర్లు నాగ జాతి సంస్కృతినీ, అస్తిత్వాన్ని నాశనం చేసేందుకు మతాంతరీకరణలు మొదలుపెట్టారు. దీన్ని అడ్డుకొనేందుకు హైపౌ ‘హెరాకా’ ఉద్యమాన్ని ప్రారంభించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాడు. అది భరించలేని బ్రిటిషర్లు అతనికి ఉరి వేశారు. అంతటితో నాగాల పని అయిపోయిందనే అనుకున్నారు. కానీ 16 ఏళ్ల గైడెన్లియు ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. గాంధీజీ స్ఫూర్తితో నాగాలను సహాయ నిరాకరణ ఉద్యమానికి సిద్ధం చేసింది. శిస్తులు కట్టకుండా, ఆంగ్లేయ సర్కారుకు సహకరించకుండా ఉద్యమాన్ని కొత్త పంథాలో నడిపించింది. ఇలా గాంధేయ వాదానికి తోడు... తమదైన గెరిల్లా యుద్ధతంత్రాన్ని కూడా కొనసాగించటం గైడెన్లియు చతురత. 1932 అక్టోబరులో బ్రిటిష్‌ సైన్యం మెరుపుదాడి చేసి ఆమెని పట్టుకుంది. హత్యానేరం బనాయించి, యావజ్జీవం విధించింది. ఆమె షిల్లాంగ్‌ జైల్లో ఉండగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఆమెని కలుసుకొని తన పేరుని రాణి గైడెన్లియుగా మార్చారు. ఆమెను విడుదల చేయాల్సిందిగా ఆంగ్లేయ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ సర్కారు నిరాకరించింది. దేశానికి స్వాతంత్య్రం రాగానే నెహ్రూ ఇచ్చిన మాట మేరకు రాణి గైడెన్లియును జైలు నుంచి విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె నాగాల అభ్యున్నతి కోసం ఎంతో పోరాడారు. 1982లో పద్మభూషణ్‌ పురస్కారంతో కేంద్రం గౌరవించింది. 1993లో 79వ ఏట కన్నుమూసిన ఈ నాగనారీమణిని... నేటికీ అక్కడి ప్రజలు దేవతా స్వరూపిణిగా ఆరాధిస్తున్నారు.


ఈ మట్టిలోనే కలవాలని..

రాణీ జిందాన్‌ కౌర్‌... తన కళ్ల ఎదుటే కొడుకుని ఎత్తుకుపోయారు. కోట్ల విలువైన నగల్ని సొంతం చేసుకున్నారు. జైల్లో బంధించారు. ఇన్ని చేసినా ఆమె ధైర్యాన్ని రవ్వంతైనా తగ్గించలేకపోయారు బ్రిటిష్‌ అధికారులు. అందుకే ఆమెని రోమన్‌ సామ్రాజ్యాన్ని నేలకూల్చిన మెస్సలీనాతో పోలుస్తూ ‘మెస్సలీనా ఆఫ్‌ పంజాబ్‌’ అని పిలుచుకొనేవారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకారిగా భావించి ఎన్నో రకాలుగా నిలువరించారు. అయినా తన శరీరం ఈ మట్టిలోనే కలవాలని కోరుకున్న దేశభక్తి ఆమెది. కాబూల్‌ నుంచి కశ్మీర్‌ వరకూ సిక్కు రాజ్యాన్ని విస్తరించిన రాజా రంజిత్‌సింగ్‌ భార్య రాణీ జిందాన్‌ కౌర్‌. ఆమె తండ్రి ఓ సాధారణ రాజోద్యోగి. తన అందాన్ని చూసి ఇష్టపడిన రంజిత్‌సింగ్‌ ఆమెని తన 17వ భార్యగా స్వీకరించాడు. ఆమె ధైర్యం అసామాన్యం. ఆమె రాజనీతిజ్ఞత ముందు నిలవడం ఎవరికైనా కష్టమే. రంజిత్‌ సింగ్‌ మరణించిన కొద్ది రోజులకే ఆమెకు పుట్టిన దులీప్‌సింగ్‌ ఐదేళ్ల వయసులో సింహాసనం ఎక్కాడు. ఆ పిల్లాడి తరపున జిందాన్‌ పరిపాలనా బాధ్యతలు తీసుకుంది. ఆమె ధైర్యం, తెలివితేటల్ని పసికట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం... ఆమె నుంచి కొడుకుని కిడ్నాప్‌ చేసింది. అతన్ని ఇంగ్లాండ్‌ పంపించి, క్రైస్తవాన్ని స్వీకరించేలా చేసింది. రాణిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని చునార్‌ కోటలో బంధించింది. ఆమె అక్కడి అధికారుల కన్నుగప్పి.. పరిచారిక వేషంలో అడవి మార్గం గుండా 800 మైళ్ల దూరం నడిచి నేపాల్‌ చేరుకుంది. అక్కడ్నుంచే లేఖల ద్వారా.. నిధులు అందించడం ద్వారా తిరిగి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొనేందుకు ప్రయత్నించింది. పదేళ్ల పాటు ఆ ప్రయత్నాలు చేసింది. అవేమీ ఫలించలేదు. కొడుకుని కలవడం కోసం ఇంగ్లాండ్‌ వెళ్లింది. తన నలభైవ ఏట చనిపోవడానికి ముందు జిందాన్‌ కోరిక ఒకటే... తన శరీరం భారతదేశ మట్టిలోనే కలవాలని. ఇటీవలే ఆమె దగ్గర దోచుకొన్న కోట్లాది రూపాయల నగలని బ్రిటన్‌ ప్రభుత్వం వేలం వేసింది.


అవంతీబాయి.. మరో లక్ష్మీబాయి!

మొదటి స్వతంత్ర సంగ్రామం ఊపందుకున్న రోజులవి. రామ్‌గఢ్‌ రాణి అవంతీ బాయి తన చుట్టుపక్కల సంస్థానాదీశులకు ఓ లేఖ, దాంతోపాటు కొన్ని గాజులు పంపి.. ‘భరతమాతకు బానిస సంకెళ్లనుంచి విముక్తి కల్పించాలనుకుంటే కత్తులు దూయండి. లేదంటే ఈ గాజులు వేసుకుని ఇళ్లల్లో దాక్కొండి’ అని రెచ్చగొట్టింది. ఆ మాటలతో కదనరంగంలోకి దూకడానికి సిద్ధమయ్యారు వాళ్లు. లోదీ రాజు విక్రమాదిత్య సింగ్‌ మధ్యప్రదేశ్‌ ప్రాంతంలోని రామ్‌గఢ్‌ పాలకుడు. అనారోగ్యంతో చిన్న వయసులోనే అతడు చనిపోతే రాణిని గానీ, మైనర్లయిన అతడి కుమారుల్నిగానీ వారసులుగా గుర్తించకుండా అక్కడ సొంత పాలనాధికారిని నియమించింది ఈస్ట్‌ ఇండియా కంపెనీ. ప్రజలు పన్నుల భారాన్ని మోయలేకపోవడాన్ని చూస్తూ ఉండలేకపోయిన అవంతీబాయి.. పాలనాధికారిని వెళ్లగొట్టి ఆంగ్లేయులపైన యుద్ధం ప్రకటించింది. నాలుగువేల మంది సైన్యంతో బ్రిటిష్‌ ఆధీనంలో ఉన్న మాండ్లాపైన దాడికి సిద్ధమైంది. ఆమె అక్కడికి చేరకముందే కమాండర్‌ వాడింగ్టన్‌ నేతృత్వంలో బ్రిటిష్‌ సైన్యం ఖేరి గ్రామం దగ్గర అడ్డుపడింది. రాణి స్వయంగా కత్తి దూయడంతో ప్రత్యర్థి సైన్యంలో భారీగా ప్రాణనష్టం జరిగింది. ప్రాణభయంతో వాడింగ్టన్‌ వెనుదిరిగాడు. ఆపైన కొద్దిరోజులకు పెద్ద మొత్తంలో సైన్యం, ఆయుధాలతో రామ్‌గఢ్‌పైకి ప్రతీకార దాడికి దిగాడు. విషయం తెలిసి కొద్దిమంది సైనికులతో వెళ్లి దేవర్‌గఢ్‌ అడవుల్లో తలదాచుకుంది రాణి. ఆ కోపంలో రామ్‌గఢ్‌కి నిప్పంటించి దేవర్‌గఢ్‌వైపు వెళ్లాడు వాడింగ్టన్‌. తన సైనికులతో గెరిల్లా పోరాటం చేసింది అవంతీబాయి. ఓటమి తప్పదని అర్థమయ్యాక.. శత్రువు చేతిలో చనిపోవడం ఇష్టంలేక కత్తితో పొడుచుకుని మార్చి 20, 1858లో ఆత్మార్పణం చేసింది. ఆమె ధైర్యసాహసాలు ఇప్పటికీ చరిత్రలో సజీవంగా నిలిచిపోయాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని