కట్టడాలకు ఊపిరిపోస్తాం!
ఒకవైపు ముంబయిలాంటి మహానగరంలో జలవనరుల సుందరీకరణలో పాలు పంచుకుంటోంది... మరోవైపు తెలుగునేలపై వందల చారిత్రక కట్టడాలు ప్రాభవాన్ని కోల్పోకుండా ఉండేందుకు కృషి చేస్తోంది. వీటితోపాటు ఆవిష్కరణలు, సేవ, నాట్యం, రచన... ఇలా పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న తెలుగమ్మాయి తాన్యా దిగోజుతో వసుంధర మాట్లాడింది..
ఒకవైపు ముంబయిలాంటి మహానగరంలో జలవనరుల సుందరీకరణలో పాలు పంచుకుంటోంది... మరోవైపు తెలుగునేలపై వందల చారిత్రక కట్టడాలు ప్రాభవాన్ని కోల్పోకుండా ఉండేందుకు కృషి చేస్తోంది. వీటితోపాటు ఆవిష్కరణలు, సేవ, నాట్యం, రచన... ఇలా పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న తెలుగమ్మాయి తాన్యా దిగోజుతో వసుంధర మాట్లాడింది..
మా తాతయ్య వాళ్లది నల్గొండలోని మోత్కూరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న సత్యనారాయణ పశ్చిమ రైల్వేలో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ అధికారి. అమ్మ సత్యలక్ష్మి. నాన్న ఉద్యోగరీత్యా చిన్నతనం నుంచీ ముంబయిలోనే ఉన్నా.. ఇంటర్ హైదరాబాద్‌లో చదివా. తర్వాత ముంబయిలోని సర్ జేజే ఆర్కిటెక్చర్ కళాశాలలో డిగ్రీ చదివా. రెండో సంవత్సరంలో భవనాలని డిజైన్ చేసేటప్పుడు... అవి తక్కువ విద్యుత్‌ని వినియోగించేలా చేయాలనుకున్నాను. భవనంలోనే అమరి పోయి, గాలితో విద్యుత్‌ని తయారు చేసుకొనే యంత్రాలని రూపొందించ వచ్చని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాను. అది అందరికీ నచ్చడంతో ఆ పరికరానికి నేనే రూపం ఇవ్వాలని అనుకున్నాను. ఈ విషయంలో ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన నాన్న సలహాలు తీసుకున్నా. అలాగే ఐఐటీ హైదరాబాద్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, యూట్యూబ్ సాయంతో.. తేలికపాటి గాలికే తిరిగే బ్లేడ్లు తయారుచేశా. అడుగు ఎత్తుండే ఈ పరికరాన్ని భవనాల గోడల్లో అమరిస్తే చాలు... బయట నుంచి వచ్చే గాలిని.. విద్యుత్తుగా మారుస్తుంది. ‘హవాయి జహాజ్ 2.0’ పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకి జాతీయ స్థాయి పోటీల్లో మంచి గుర్తింపు లభించింది. దీనికే సెయింట్ గోబియన్ సంస్థ రెండు లక్షల రూపాయల ఫండ్ ఇచ్చింది. ఈ పరికరానికి పేటెంట్ ప్రక్రియ సాగుతోంది. అలాగే... బెంగళూరులో ఆర్కిటెక్చర్ విద్యార్థుల కోసం రూపొందించిన ఒక డిజైన్‌కీ అంతర్జాతీయ పోటీల్లో గుర్తింపు లభించింది. కొవిడ్ సమయంలో.. ఆసుపత్రుల కొరతని దృష్టిలో పెట్టుకుని రోగులకు సేవలందించేందుకు రైల్వే బోగీల్ని, వ్యవస్థని వాడుకుంటూ చేసిన డిజైన్‌కి ముంబయి యూనివర్సిటీ ఇచ్చే ఫ్యాకల్టీ మెడల్ అందుకున్నా. విదేశాల నుంచి వచ్చే శరణార్థుల ఆవాసం కోసం చేసిన డిజైన్‌ని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ ప్రశంసించి ముంబయిలో ప్రదర్శనకు ఉంచింది. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ స్పేస్‌ల ప్రాజెక్ట్‌లో జలవనరుల సుందరీకణపై నివేదిక అందించా.
‘వారధి’ అయ్యా... ముంబయిలో పెరిగినా తెలుగు నేలంటే నాకెంతో మమకారం. ఈ నేలకు ఏదో చేయాలన్న ఆలోచనతోనే.. కాకతీయ కట్టడాల పరిరక్షణ కోసం, నా స్నేహితుడు అరవింద్ ఆర్యతో కలిసి ‘టార్చ్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా. చారిత్రక, పురావస్తు కట్టడాలని సంరక్షించడం, డాక్యుమెంటేషన్ చేయడం మా సంస్థ లక్ష్యం. ఇంతవరకూ 1200 పురాతన కట్టడాలని ఫొటో డాక్యుమెంటేషన్ చేశాం. ఈ కట్టడాల గురించి బ్లాగ్స్, పుస్తకాలు రాస్తాం. ఆ సమాచారాన్ని గూగుల్‌లోనూ పెడతాం. వికీపీడియాలో రాయిస్తాం. ఫొటోలు అప్‌లోడ్ చేస్తాం. మా పనిలో మరో ముఖ్య విషయం ఏంటంటే... స్కేలింగ్ చేస్తాం. అంటే భవిష్యత్తులో ఈ కట్టడాలకు నష్టం వాటిల్లితే.. వాటిని యథాతథంగా నిర్మించడానికి వీలుగా 30 అంశాలతో ప్రతి సూక్ష్మవివరాన్నీ నమోదు చేసుకుంటాం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ.. అగ్గలయ్య గుట్ట, వరంగల్‌లోని ఐదుమెట్ల బావుల, ములుగు జిల్లాలోని ఆదిమానవుల సమాధులు, కొత్తూరు గ్రామంలో దేవుడి గుట్ట ప్రాంతాలను అభివృద్ధి చేశాం. దేవుడి గుట్ట అభివృద్ధికి మూడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. టార్చ్ ఐదుగురితో ప్రారంభమై... 140 మందికి చేరుకుంది. మా కృషి తెలిసి, నచ్చి కాకతీయుల వారసుడు భంజ్‌దేవ్ మాతో చేతులు కలిపారు. మా సేవల్ని చత్తీస్‌గఢ్, ఏపీ, మహారాష్ట్రలకు విస్తరిస్తున్నాం. వరంగల్ నగరాన్ని... స్మార్ట్ సిటీగా మార్చాలని అనుకుంటున్నారు కదా! ఒక హెరిటేజ్ సిటీని స్మార్ట్‌సిటీగా మార్చడానికి కావాల్సిన మార్గ నిర్దేశకాలని చెబుతూ వారధి అనే పుస్తకాన్ని రాశాను. దీన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇవే కాదు... యూకేజీ నుంచి భరత నాట్యం సాధన చేస్తున్నా. పద్దెనిమిదేళ్లుగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చా. సాహిత్యమన్నా ఇష్టం. తెలుగు పాటలూ రాస్తుంటాను.
ఆన్‌లైన్ వేదిక.. కొవిడ్ సమయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థుల ఇబ్బందులు గమనించాక కార్పొరేట్ సంస్థలని అనుసంధానించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలనుకున్నా. ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ‘ఆక్యులస్ ఇండియా’ సంస్థను ఏర్పాటు చేశా. ఇప్పుడు మా సంస్థలో 200 మందికి పైగా సభ్యులున్నారు. ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించుకోవడంలో మావంతు సహాయాన్ని చేశాం. నా కార్యకలాపాల్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నా.
- గుండు పాండురంగ శర్మ, ఈనాడు, వరంగల్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.