మంత్రినే అడిగేశా!

పెద్ద చదువులు చదవలేదు. వ్యాపారమంటే తెలీదు. కానీ బతుకు మార్చుకోవాలన్న తపన ఆమెది. ధైర్యం చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టింది. మెలకువలు, సృజనాత్మకతను అందిపుచ్చుకొని పదుల కుటుంబాలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు.. తోడు నిలిచిన భర్తా దూరమయ్యాడు. అయినా ధైర్యం చెప్పుకొంది. తనని నమ్ముకున్న పిల్లలు, నేతవారికి అండగా నిలిచింది. వేలతో మొదలుపెట్టిన వ్యాపారాన్ని లక్షలకు పెంచగలిగింది.

Updated : 18 Aug 2022 07:49 IST

పెద్ద చదువులు చదవలేదు. వ్యాపారమంటే తెలీదు. కానీ బతుకు మార్చుకోవాలన్న తపన ఆమెది. ధైర్యం చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టింది. మెలకువలు, సృజనాత్మకతను అందిపుచ్చుకొని పదుల కుటుంబాలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు.. తోడు నిలిచిన భర్తా దూరమయ్యాడు. అయినా ధైర్యం చెప్పుకొంది. తనని నమ్ముకున్న పిల్లలు, నేతవారికి అండగా నిలిచింది. వేలతో మొదలుపెట్టిన వ్యాపారాన్ని లక్షలకు పెంచగలిగింది. వేముల శ్రీదేవి నేత ప్రయాణం ఆమె మాటల్లోనే..!

పుట్టింది వరంగల్‌. అమ్మానాన్నలది నేత పనే. ముగ్గురం ఆడపిల్లలం. పదో తరగతి చదువుతున్నప్పుడే పెళ్లిచేశారు. దాంతో తొలిసారి ఊరుదాటి అడుగు బయటపెట్టా. అత్తగారిది కరీంనగర్‌ పక్కన చిన్న పల్లె. మావారు శ్రీనివాస్‌.. వ్యవసాయ కూలీ. 1995లో మగవాళ్లకే పాతిక రూపాయలిచ్చేవారు. మహిళలైతే రూ.15. ఆ కొద్దిమొత్తంతో ఏం బతుకుతాం? మావారితో సొంతంగా చేనేత పని మొదలుపెడదామన్నా. ఇంట్లో వద్దన్నా.. ఆయన నాకు తోడు నిలిచారు. రూ.5 వేలు పెట్టుబడితో వరంగల్‌ నుంచి నూలు తెప్పించుకొని వస్త్రాలు, దుప్పట్లు నేసివ్వడం మొదలుపెట్టాం. 2003 వరకూ ఇలాగే చేశాం. ఇలా ఒకరికింద ఎంత కాలం? సొంతంగా చేసుకుంటే ఇంకొందరికీ ఉపాధి కల్పించొచ్చు అనిపించింది. కానీ పెట్టుబడి సమస్య! చిన్నప్పటి నుంచి దేన్నైనా లోతుగా తెలుసుకోవడం అలవాటు. ఆ గుణమే మాకు పెట్టుబడీ తెచ్చింది. రుణం కోసమని ఐకేపీ బృందంలో సభ్యురాలినయ్యా. ఓసారి జమ్మికుంటలో సమావేశం జరుగుతోంటే వెళ్లాం. అక్కడికొచ్చిన మంత్రికి మా సంస్థ గురించి చెప్పి లోను ఇప్పించమని కోరా. చుట్టూ ఉన్నవాళ్లు అలా అడగొచ్చా అన్నారు. కానీ నేను భయపడలేదు. నా చురుకుదనం చూసి మంత్రి అక్కడిక్కడే రూ.లక్ష మంజూరు చేశారు. ఆ మొత్తంతో ముడిసరకు, యంత్రాలను కొని ఉత్పత్తులు ప్రారంభించాం. కూలీ రూ.30 ఇస్తుండటంతో చాలామంది చేరారు. సొంతంగా చేసుకుంటామన్న వాళ్లకీ సాయం చేశా. వాళ్ల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ నేనే చేసిపెట్టే దాన్ని. ఇప్పుడు చుట్టుపక్కల పది గ్రామాలకు ఇదే జీవనోపాధి. నేను 84 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నా. మా దగ్గర చేసేవారిలో 80 శాతం గృహిణులే.

ఆ సవాలును..

మేం చేసేవాటికి, మార్కెటింగ్‌కు తీసుకున్నదీ తోడై పెద్దమొత్తంలో సరకు పోగుపడింది. అమ్మడమెలాగో తెలియలేదు. వాటిని చూసి అత్తామామలు దెప్పిపొడిచేవారు. అయినా వెనకడుగు వేయలేదు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) వారిని కలిశా. ప్రభుత్వ కార్యక్రమాలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్లలో స్టాల్స్‌ పెట్టుకొనే అవకాశమిచ్చారు. వరంగల్‌ ఎగ్జిబిషన్‌లో మా ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యాయి. ఆరోజు నా ఆనందానికి అవధుల్లేవు. అప్పట్నుంచీ ఇంట్లో వాళ్లకీ నమ్మకం కుదిరింది. మా స్టాళ్లకు ఇతర రాష్ట్రాల వారూ వచ్చే వారు. వాళ్ల రాష్ట్రాల్లోనూ స్టాల్స్‌ పెట్టమనేవారు. డీఆర్‌డీఏ వాళ్లని అడిగితే ‘నీకు హిందీ రాదుగా’ అన్నారు. నాకు వచ్చనీ,  మాట్లడగలనని చెప్పా. నిజానికి అప్పటికి నాకూ పెద్దగా తెలీదు. ధైర్యమల్లా.. నేనేదైనా అనుకుంటే ఎంత కష్టమైనా నేర్చుకోగలను. అలా దిల్లీ వెళ్లే అవకాశం వచ్చింది. ఇప్పుడు దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లోనూ స్టాల్స్‌ నిర్వహిస్తున్నాం. విజయవాడలోనూ ఒక యూనిట్ నడిపిస్తున్నాం.

తనతోపాటే వెళదామనుకున్నా..

మావారికి హిందీ తెలియదు. కానీ టికెట్లు, రవాణా నుంచి స్టాల్‌ సర్దడం వరకూ అన్నీ చూసుకునే వారు. 2011లో ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. ఆయనతోపాటే నేనూ చనిపోదామనుకున్నా. కానీ నన్ను నమ్ముకున్న పిల్లలు, నేతవాళ్లను చూసి సముదాయించుకొన్నా.. వాళ్లలోనూ ధైర్యాన్ని నింపా. వాళ్లూ నాకు తోడు నిలిచారు. వ్యాపార మెలకువలతోపాటు సాంకేతికతను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో కలంకారీ నేర్చుకున్నాను. అప్పటిదాకా సాధారణ మ్యాట్‌లు, దుప్పట్లను తయారు చేసి దిల్లీలోని ఓ సంస్థకు పంపే వాళ్లం. తిరిగి వాళ్లు చేసివ్వడానికి సమయం పట్టేది. దీనివల్ల కొన్ని సార్లు నష్టపోయాం. నేర్చుకున్నాక మేమే స్వయంగా చేసుకుంటున్నాం. ఎక్కడికెళ్లినా మా ఉత్పత్తులపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటా. ఏడాదికి రూ.75-85 లక్షల వ్యాపారం చేస్తున్నాం. ఇద్దరు పిల్లల్నీ పీజీ చదివించా. బాబు వ్యాపారంలో సాయం చేస్తున్నాడు. అమ్మాయికి పెళ్లి చేశా. ఇప్పుడు హిందీ అనర్గళంగా మాట్లాడతా, ఇంగ్లిష్‌, కన్నడ అర్థమవుతాయి. ఈ ప్రయాణంలో ఎన్నో పురస్కారాలనీ అందుకున్నా. ఇటీవల కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్‌ సన్మానమూ చేశారు. ఆన్‌లైన్‌ వ్యాపారమూ ప్రారంభించాం. నాబార్డ్‌, టెస్కోలకూ విక్రయిస్తున్నాం. శ్రీకాంత్‌, ఊహ, నాజర్‌, మంగ్లీ, సుమ ఇలా ఎంతోమంది సినీ, టీవీ తారలూ మా కస్టమర్లే. భవిష్యత్‌లో మరింతమంది మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు. కాస్త ఓపిక, పరిస్థితులకు బెదరక ధైర్యంగా ఉండగలిగితే ఎవరైనా విజయం సాధించొచ్చు. నా జీవితమే దానికి ఉదాహరణ.

- టి.శారద, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్