ఈత రాదన్న విషయం మర్చిపోయా!

అభంశుభం తెలియని పసివాళ్లు. మృత్యువుతో పోరాడుతున్నారు. వాళ్లని రక్షించాలనుకుందే తప్ప తన ప్రాణాలకొచ్చే ముప్పు గురించి ఆలోచించలేదు ఎళిలరసి.   సాహసమే ఆమెకు తమిళనాడు ప్రభుత్వం ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ‘కల్పనాచావ్లా’ అవార్డును అందించింది.కష్టం వస్తే ఎవరైనా వచ్చి రక్షించాలని ఎదురుచూస్తాం. కానీ ఎళిలరసి అలా అనుకోలేదు....

Published : 20 Aug 2022 00:27 IST

అభంశుభం తెలియని పసివాళ్లు. మృత్యువుతో పోరాడుతున్నారు. వాళ్లని రక్షించాలనుకుందే తప్ప తన ప్రాణాలకొచ్చే ముప్పు గురించి ఆలోచించలేదు ఎళిలరసి.   సాహసమే ఆమెకు తమిళనాడు ప్రభుత్వం ఏటా అందించే ప్రతిష్ఠాత్మక       ‘కల్పనాచావ్లా’ అవార్డును అందించింది...

ష్టం వస్తే ఎవరైనా వచ్చి రక్షించాలని ఎదురుచూస్తాం. కానీ ఎళిలరసి అలా అనుకోలేదు. సాహసం చేసింది. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడింది. ఎంటెక్‌ పూర్తిచేసిన ఎళిలరసి భర్త కీర్తివాసన్‌తో కలిసి కిలివేలూరులో ఉంటోంది. ఈ ఏడాది మేలో ఓ కుటుంబ కార్యక్రమానికి హాజరవడం కోసం నాగపట్నం జిల్లాలోని అంజువత్తమ్మన్‌ ఆలయానికి వచ్చింది. అదే సమయంలో సమీపంలోని ఆలయ చెరువు గట్టుపై కొందరు గుమికూడి పెద్దుఎత్తున కేకలు పెడుతుండటం చూసింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి చెరువు గట్టు దగ్గరికి పరుగు తీసింది. పిల్లలిద్దరు చెరువులో పడిపోయి...మృత్యువుతో పోరాడుతున్నారని తెలుసుకుంది. అంతే.. వెనకాముందూ ఆలోచించకుండా వాళ్లని రక్షించడం కోసం చెరువులోకి దూకింది. ఇంతకీ ఆమెకి ఈతరాదు. ‘పిల్లల్ని రక్షించాలనే ఆలోచనలో ఆ విషయమే మరిచిపోయా’నంటుంది ఎళిలరసి. ‘స్కూల్లో ఉన్నప్పుడు స్కౌట్స్‌లో చేరా. అప్పుడు ఆపదలో ఉన్నవారిని ఎలా కాపాడాలో చెప్పేవారు. ఆ తర్వాత ఎటువంటి సాధనా లేదు. కానీ ఆరోజు అందరూ కేకలు పెట్టడం, చెరువులో మునిగిన చిన్నారులను కాపాడాలని అరుస్తుండటం మాత్రమే విన్నాను. అందుకే ఎక్కువ ఆలోచించలేదు. ఈత రాకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డా. కానీ ధైర్యంగా ఎలాగో పిల్లలను వెతకడానికి ప్రయత్నించాను. వాళ్లిద్దరిలో ముందు ఒకడు దొరికాడు. వాడిని ఒక చేత్తో పట్టుకొని గట్టుకు చేర్చా. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రెండోవాడి కోసం తిరిగెళ్లా. నా ప్రయత్నం ఫలించింది. ఆ చిన్నారీ నా చేతికి చిక్కాడు. అలా మొత్తానికి ఇద్దరినీ రక్షించగలిగా. తక్కువ సమయంలోనే బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. వాళ్లిద్దరూ అన్నదమ్ములు. పెద్దవాడు పన్నెండేళ్ల శ్రీవర్షన్‌, చిన్నాడు ఏడేళ్ల సాయివిష్ణు. ఇద్దరూ ఆడుకుంటున్నప్పుడు ఆ చెరువులో ముందుగా సాయి జారిపడిపోయాడు. తమ్ముడిని రక్షించడానికి శ్రీవర్షన్‌ దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వాళ్ల అక్క అరుస్తూ చుట్టుపక్కలవారందరినీ పిలిచింది. సరిగ్గా అదే సమయంలో నేను అక్కడికి వెళ్లడంతో వాళ్లని రక్షించగలిగా’ అని చెబుతున్న ఎళిలరసి సాహసాన్ని గుర్తించి స్థానిక కలెక్టరు అభినందించి గౌరవించారు. అలాగే తమిళనాడు రాష్ట్రప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ధైర్యసాహసాలు ప్రదర్శించి ఇతరుల ప్రాణాలను కాపాడే మహిళలకిచ్చే ‘కల్పనాచావ్లా’ అవార్డు ఈ ఏడాది ఎళిలరసికి అందించింది. రూ.5లక్షలు నగదు బహుమతి అందించి గౌరవించింది.  ‘ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేతులమీదుగా ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది’ అంటోంది ఎళిలరసి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్