జీవితానికి గెలుపు స్క్రిప్టు రాసుకుంది!

అసలే పేద కుటుంబం.. దానికి తోడు నాన్న చనిపోయాడు. దాంతో 15 ఏళ్లకే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుందా అమ్మాయి.. టీవీ షోలూ, నాటకాలకు స్క్రిప్టులు రాసింది, మోడలింగ్‌ చేసింది.. ఇన్ని చేస్తున్నా చదువును వదల్లేదు. బాగా చదివి పాతికేళ్లలోపే న్యాయవాదిగా ఉన్నత శిఖరాలకు చేరింది. ఇదంతా సినిమా కథలా ఉంది కదూ! కానీ ఇది కథ కాదు, నిజం.

Updated : 21 Aug 2022 07:11 IST

అసలే పేద కుటుంబం.. దానికి తోడు నాన్న చనిపోయాడు. దాంతో 15 ఏళ్లకే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుందా అమ్మాయి.. టీవీ షోలూ, నాటకాలకు స్క్రిప్టులు రాసింది, మోడలింగ్‌ చేసింది.. ఇన్ని చేస్తున్నా చదువును వదల్లేదు. బాగా చదివి పాతికేళ్లలోపే న్యాయవాదిగా ఉన్నత శిఖరాలకు చేరింది. ఇదంతా సినిమా కథలా ఉంది కదూ! కానీ ఇది కథ కాదు, నిజం. దీన్లో కథానాయిక ప్రియాంక. మీడియా, వినోద రంగంలో తిరుగులేని న్యాయవాదిగా తన జీవితానికి విజయవంతమైన స్క్రిప్టు రాసుకుందీ అమ్మాయి. అదేంటో చూడండి...

ప్రియాంక అమ్మానాన్న ముంబయిలోని మహీమ్‌ రైల్వేస్టేషన్‌ బయట చిన్న టెలిఫోన్‌ బూత్‌, జిరాక్స్‌ షాప్‌ నడిపే వారు. దాని వెనకే ఓ చిన్న గదిలో నివాసం. తను పుట్టిన ఏడాదికి ఆ కుటుంబం ఓ చాల్‌కి మారింది. ఇరుకైన ఒంటి గది ఇళ్ల సమూహమే చాల్‌. స్కూల్లో చదువుతోపాటు కరాటే, నాటకాలు వేయడం- రాయడంలోనూ ముందుండేది తను. మరాఠీ, హిందీ, ఇంగ్లిషుల్లో చక్కగా స్క్రిప్టు రాసేది. అలా 15 ఏళ్లకే ‘తమన్నా హౌస్‌’ టీవీ సీరియల్‌ స్క్రిప్ట్‌ బృందంలో చోటు సంపాదించింది. అదే సమయంలో తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబ భారాన్ని తీసుకుంది ప్రియాంక. చదువుకుంటూనే టీవీ, రేడియో షోలు, అవార్డు కార్యక్రమాలకు రైటర్‌గా పనిచేసేది. మోడల్‌గా కూడా మెరుస్తూ ఉండేది.

అనుకోకుండా ‘న్యాయవాది’

అమ్మ ముస్లిం, నాన్న గుజరాతీ. ఇద్దరి వైపు కుటుంబాల్లో అందరూ బాగా చదువుకున్న వాళ్లే. తండ్రితోపాటు వాళ్ల నుంచి చదువు ప్రాధాన్యాన్ని వింటూ పెరిగింది తను. అందుకే కష్టాల మధ్యా చక్కగా చదివింది. బయోటెక్నాలజీలో డిగ్రీ చేసింది. ఆపైన న్యాయశాస్త్రం చదివింది. క్యాంపస్‌లో ఉండగానే విఖ్యాత ‘ముల్లా అండ్‌ ముల్లా అసోసియేట్స్‌’లో అవకాశం వచ్చింది. ‘23వ ఏట లాయర్‌గా ప్రాక్టీసు మొదలుపెట్టా. టీవీ, సినీ రంగాల్లో నా పరిచయస్థులు, వారి స్నేహితులూ న్యాయ సలహాలు అడిగే వారు. కొందరు కేసుల్నీ అప్పగించేవారు. అలా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ తన పాటల రాయల్టీ సమస్యల గురించి నన్ను సంప్రదించారు. వాటిని పరిష్కరించాను. నా సలహా మీదే ఆవిడ ‘లతా మంగేష్కర్‌ మ్యూజిక్‌’, ‘ఎల్‌ఎం స్టూడియోస్‌’ సంస్థల్ని ప్రారంభించారు. ఆవిడకున్న ఇతర న్యాయ వివాదాలనూ పరిష్కరించాను. అవన్నీ చూసే లత ఆస్తుల బోర్డులో నన్నూ సభ్యురాలిగా తీసుకున్నారు. తర్వాత మరికొందరు గాయకులూ నా క్లయింట్స్‌గా మారారు’ అంటూ బాలీవుడ్‌తో అనుబంధాన్ని వివరించింది ప్రియాంక.

సొంత సంస్థకు అడుగులు...

అమ్మాయి... చిన్నవయసులోనే గుర్తింపు సాధించడం చూసి కొందరు అడ్డంకులు సృష్టించే వారు. దాన్ని గ్రహించిన ప్రియాంక ఉద్యోగం వదిలేసింది. 2014లో ‘ఖిమానీ అండ్‌ అసోసియేట్స్‌’ ప్రారంభించింది. అప్పటికి తనకు 26. మొదట్లో తను, ఓ ఇంటర్న్‌.. అంతే. ‘మనసు చెప్పినట్లు నడుచుకో.. మద్దతుగా నేనుంటా’ అన్న లతా మంగేష్కర్‌ మాటలు ధైర్యాన్ని ఇచ్చాయంటుంది ప్రియాంక. ‘కేసు డాక్యుమెంట్లు మాత్రమే చూసి పని చేయను. వారితో కూలంకషంగా మాట్లాడి, సమస్యను దగ్గర నుంచి పరిశీలించి... సరైన పరిష్కారాన్ని అందించేందుకు కృషిచేస్తా. వారి నుంచి నేనూ చాలా నేర్చుకుంటా. సుష్మితా సేన్‌, ఏఆర్‌ రెహ్మాన్‌, శృతిహాసన్‌, మల్లికా దువా... ఇంకా ఎందరో ప్రముఖులు మా ఖాతాదారులే. పెద్ద పెద్ద తారలకు ఏం కేసులుంటాయి అనుకుంటారేమో... సహేతుక కారణం లేకుండా ప్రాజెక్టు మధ్యలో తొలగిస్తుంటారు. లైంగిక వేధింపులూ ఉంటాయి. ఆస్తి వివాదాలు, సంస్థలతో ఒప్పందాలు... ఇలా వాళ్ల సమస్యలెన్నో’ అనే ప్రియాంక గతేడాది ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌-100 న్యాయవాదుల్లో స్థానం దక్కించుకుంది. ఇప్పుడు తన సంస్థలో 40 మంది న్యాయవాదులు పని చేస్తున్నారు. వారిలో 35 మంది మహిళలే. చెల్లెల్ని వైద్యవిద్య చదివించి ఓ ఇంటి దాన్ని చేసింది. తనూ ఆరేళ్ల కింద అస్తాద్‌ రణ్‌డేరియాని పెళ్లి చేసుకుంది. ఆయనా న్యాయవాదే.


‘నా ఆలోచనలూ, కష్టపడే నైజానికి నేను పెరిగిన చాల్‌ నేపథ్యమే ప్రధాన కారణం. న్యాయవాద వృత్తితోపాటు వ్యాపారంలోనూ రాణించాలన్నది నా లక్ష్యం. అందుకే సొంత సంస్థ నడిపే క్రమంలో అడ్డంకులకు వెరవలేదు. న్యాయసేవల రంగంలో నిలదొక్కుకోవడం మగవాళ్లూ, బాగా అనుభవజ్ఞులకే సాధ్యమన్నది ఓ అపోహేనని నిరూపించాలనుకున్నా’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్