ఆత్మవిశ్వాసానికి ఈ నాలుగు..
అరుణ కష్టపడి పని చేస్తుంది. అంతలోనే తాను చేసింది సరైంది కాదంటూ తనను తానే నిందించుకుంటుంది. ఆత్మన్యూనతే దీనికి కారణం. కానీ ఆత్మవిశ్వాసాన్ని కృషి, పట్టుదలతో సాధించొచ్చంటున్నారు నిపుణులు.మనసులో ప్రతికూల ఆలోచనలను దూరం చేయాలంటే స్ఫూర్తి ప్రదాతల
అరుణ కష్టపడి పని చేస్తుంది. అంతలోనే తాను చేసింది సరైంది కాదంటూ తనను తానే నిందించుకుంటుంది. ఆత్మన్యూనతే దీనికి కారణం. కానీ ఆత్మవిశ్వాసాన్ని కృషి, పట్టుదలతో సాధించొచ్చంటున్నారు నిపుణులు.
మనసులో ప్రతికూల ఆలోచనలను దూరం చేయాలంటే స్ఫూర్తి ప్రదాతల జీవితచరిత్రలు చదవాలి. వాటిలోని వాక్యాలను కాగితాలపై విడివిడిగా రంగురంగుల స్కెచ్‌లతో రాసి, గోడపై ఫ్రేమ్ లేదా అద్దంపై అంటించాలి. పుస్తక పఠనాన్ని అభిరుచిగా మార్చుకుని వాటి నుంచి సేకరించిన స్ఫూర్తిదాయక అంశాల్ని డైరీలో రాసుకోవాలి. రాత్రి నిద్రకు ముందు వాటన్నింటినీ ఓసారి చదవాలి. ఇవన్నీ మనసుపై ప్రభావం చూపి, ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తాయి.
1 మనసుతో..
మన మనసుతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాకాక ఆత్మ న్యూనతతో మనల్ని మనమే నిందించు కుంటూ, తక్కువనే భావంతో ఉంటే, మనసులో ఉండే మంచి అంశాలను క్రమేపీ మర్చిపోయే ప్రమాదం ఉంది. నిత్యం మనతో మనం స్నేహం చేయాలి. మనసు చెప్పేది వింటే మానసిక శక్తితోపాటు ఆత్మగౌరవం పెరుగుతుంది. డైరీలో మనకున్న నైపుణ్యాలు, గతంలో సాధించిన విజయాలు, ఇతరులకు అందించిన చేయూత వంటివన్నీ వరుసగా రాసి చదువుతుంటే మనం తక్కువనే ఆలోచనలు దూరమవుతాయి.
2 ఆలోచన..
మన ఆలోచనావిధానాన్ని మార్చుకోవడానికి కృషి చేయాలి. ఎటువంటి వైఫల్యమైనా వెంటనే కారణం మనమే అనే భావనను దరికి రానీయకూడదు. ఇది ఆత్మన్యూనతను పెంచుతుంది. భయం మొదలవుతుంది. ఏ పనీ ధైర్యంగా చేయలేం. ముందుగా అసలు కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. సమస్యకు మూలాన్ని కనిపెట్టాలి. అందులో మన పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకుంటే చాలు. ఆత్మవిశ్వాసం దూరం కాదు.
3 నచ్చినట్లు..
మనకు నచ్చినట్లుగా ఉండటానికి కృషి చేయాలి. మనసును కష్టపెట్టే అంశాలను దూరంగా ఉంచాలి. నచ్చిన వంట చేసి తినడం, యోగా, ధ్యానంతోపాటు వర్కవుట్లు చేయడం, ముఖాన్ని మెరిసేలా చేయడానికి లేపనాలు వేయడం, మేకప్ చేసుకోవడం వంటివి చేస్తే మనసులో ఉత్సాహం నిండుతుంది. ఇవి మనపై మనకు నమ్మకాన్ని పెంచేలా చేస్తాయి.
4 సంబంధాలు..
కుటుంబసభ్యులు, స్నేహితులతో అనుబంధంగా ఉండాలి. అవసరమైన వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైనా కొత్త భాష, సంగీత పరికరం వాయించడం నేర్చుకోవాలి. నైపుణ్యాలను పెంచుకుంటే కూడా
మనపై మనకు నమ్మకం పెంపొందుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.