చిన్నారిని చూసుకుంటూనే...
రవళి ప్రసవమయ్యే వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించింది. ఆరు నెలల తర్వాత తిరిగి ఆఫీస్‌కెళ్లాల్సి ఉంది. కానీ పాపాయిని సంరక్షించడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలో తోచడంలేదు. అలా అని ఉద్యోగం మానేసే పరిస్థితి లేదు.
రవళి ప్రసవమయ్యే వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించింది. ఆరు నెలల తర్వాత తిరిగి ఆఫీస్‌కెళ్లాల్సి ఉంది. కానీ పాపాయిని సంరక్షించడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలో తోచడంలేదు. అలా అని ఉద్యోగం మానేసే పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భాల్లో ఆందోళన చెందక్కర్లేదు, చిన్నారిని చూసుకుంటూనే ఇంటి నుంచి పని చేసే అవకాశాలెన్నో ఉన్నాయంటున్నారు కెరియర్ నిపుణులు.
ఉద్యోగం, పాపాయి సంరక్షణ.. ఈ రెంటినీ సమన్వయం చేసుకోవడానికి పలు మార్గాలున్నాయి. ఆఫీసుకి వెళ్లాలంటే ఇంట్లో చిన్నారిని చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి. అప్పుడే ఉద్యోగబాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరు. కొన్ని సంస్థల్లో ఆరు నెలలు సెలవు అందించి, ఆ తర్వాత విధుల్లో చేరాలనే నియమం ఉంటుంది. మరికొన్ని చోట్ల లాస్ ఆఫ్ పే పద్ధతిలో మరికొన్ని రోజులు ఇంట్లో ఉండే సౌకర్యం దొరుకుతుంది. ఆ తర్వాత తిరిగి ఆఫీస్‌కు వెళ్లొచ్చు. అయితే కొన్నిచోట్ల ఆరు నెలల తర్వాత పనిలో చేరలేకపోతే అంతకు మించి సెలవులు ఉండవు. దీంతో రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇటువంటప్పుడు వేరే మార్గాన్ని చూసుకోవాలి, లేదా మరికొన్ని రోజులపాటు ఇంట్లో ఉండి మరో ఉద్యోగాన్ని వెతుక్కోవడం మంచిది.
ఇంటి నుంచే..
చదువు, ఉద్యోగార్హత ఉన్నవారు ప్రసవం తర్వాత పూర్తిగా ఆఫీస్ పనికి దూరం కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చాలా సంస్థలు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలను ఇస్తున్నాయి. ఆ బాధ్యతలను ఏ సమయంలోనైనా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా అందించాల్సి ఉంటుంది. మరికొన్నిచోట్ల రోజులో ఇన్ని గంటలు పని చేయాలనే నియమం ఉంటుంది. అటువంటి చోట్ల అనువైన సమయాన్ని ఎంచుకోగలిగితే ఇల్లు, పాపాయి బాధ్యతలతోపాటు ఆఫీస్ పనినీ సమన్వయం చేసుకోవచ్చు. పార్ట్‌టైం ఉద్యోగాలను ఎంచుకుంటే మరింత సౌకర్యంగా ఉంటుంది.
సమయపాలన..
బుజ్జాయి ఆలనాపాలనా చూసుకుంటూ మిగతా సమయాన్ని కెరియర్‌కు ఉపయోగించాలనే ఆలోచన ఉన్నవారు ముందుగా సమయపాలన నేర్చుకోవాలి. పాపాయితో గడుపుతూనే, కొంత టైంను కెరియర్ అభివృద్ధి కోసం మిగుల్చుకోవాలి. ఉన్న విద్యార్హతకు మరొకటి జోడించడం మంచిది అనుకుంటే సంబంధిత కోర్సును ఆన్‌లైన్‌లో చేయొచ్చు. అనువైన వేళల్లో కోర్సులు చేయడానికి ఇప్పుడెన్నో అవకాశాలున్నాయి. ఇలా ఏడాది తిరిగేసరికల్లా కోరుకున్న ఉద్యోగానికి కావాల్సిన అర్హత చేతిలో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.