అభిప్రాయ సేకరణ అవసరం...
‘ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదిస్తే వేణ్ణీళ్లకు చన్నీళ్లలా ఆసరా’ అనేది నిన్నటి మాట. ఇవాళ్టి అమ్మాయిలు మరింత మెరుగ్గా ఆలోచిస్తున్నారు. ఉద్యోగం కేవలం సంపాదన కోసం అనుకోవడంలేదు. జీవితంలో తనకో ప్రత్యేకత సంపాదించుకోవాలి, ఉద్యోగంలో కీలకవ్యక్తిగా ఎదగాలి, కీర్తిప్రతిష్ఠలు పొందాలి... ఇలా బోలెడు ఆశలూ, ఆశయాలూ పెంచుకుంటున్నారు. మరి వీటి సాధనకు ఏం చేయాలని కెరియర్ నిపుణులు చెబుతున్నారో చూడండి...
‘ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదిస్తే వేణ్ణీళ్లకు చన్నీళ్లలా ఆసరా’ అనేది నిన్నటి మాట. ఇవాళ్టి అమ్మాయిలు మరింత మెరుగ్గా ఆలోచిస్తున్నారు. ఉద్యోగం కేవలం సంపాదన కోసం అనుకోవడంలేదు. జీవితంలో తనకో ప్రత్యేకత సంపాదించుకోవాలి, ఉద్యోగంలో కీలకవ్యక్తిగా ఎదగాలి, కీర్తిప్రతిష్ఠలు పొందాలి... ఇలా బోలెడు ఆశలూ, ఆశయాలూ పెంచుకుంటున్నారు. మరి వీటి సాధనకు ఏం చేయాలని కెరియర్ నిపుణులు చెబుతున్నారో చూడండి...
* గతంలోనో, భవిష్యత్తులోనో కాక వర్తమానంలో జీవించడం తెలివైన వ్యక్తుల లక్షణం. విజయ సోపానాల్లో ఇది మొదటి మెట్టని పెద్దలెందరో చెప్పారు. కనుక ప్రస్తుతంలోనే ఉండాలి. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు ఇంటి గురించి, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు గురించీ ఆలోచిస్తే రెంటికీ న్యాయం చేయలేం. పనిలో లీనమై సమర్థవంతంగా చేస్తే ఫలితం అమోఘంగా ఉంటుంది, ఆత్మతృప్తీ దొరుకుతుంది.
* పనిలో వాయిదాలు వద్దు. ఏ రోజు చేయాల్సింది ఆరోజు పూర్తయ్యేలా చూడటం తక్షణ కర్తవ్యం. అప్పుడు పనిలో జాప్యం జరగదు, మీ పట్ల గౌరవం పెరుగుతుంది.
* వారానికోసారి అయినా ఆత్మీయ బంధుమిత్రులతో మాట్లాడాలనే నియమం పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలసటా కలగదు. అంతే కాదు.. కొత్తకొత్త విషయాలు తెలుస్తాయి. పనిలో మెలకువలు నేర్చుకోగలుగుతారు. ఎంతటి అలజడి అయినా తగ్గి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది.
* చేసిన కష్టానికి తగ్గ గుర్తింపు, ఆశించిన ఫలితం దొరకడం లేదని నిరాశ చెందొద్దు. మన సామర్థ్యాలు, నేర్పరితనం ఎన్నటికీ వృథా కావు. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు.. కానీ ఫలితం తప్పకుండా దక్కుతుంది.
* మనమీద మనకెంత నమ్మకం ఉన్నా, వంక పెట్టలేని విధంగా పనిచేస్తామనే ఆత్మవిశ్వాసం ఉన్నా.. ఇతరుల ఆలోచనావైఖరి ఎలా ఉందో అడిగి తెలుసుకోవడమూ ముఖ్యమే. మనల్ని మనం మరింత మెరుగుపరచుకోవడానికి ఈ అభిప్రాయ సేకరణ తప్పకుండా ఉపయోగపడుతుంది. మనకు మనమే సాటి అనుకుంటే ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. ఎదుటి వాళ్ల సలహాలూ సూచనలకు గౌరవం ఇచ్చినప్పుడే మెరుగుదల సాధ్యమౌతుంది.
* మన కంటే బాగా పనిచేస్తున్న వారితో పోటీ పెట్టుకున్నట్లయితే మరింత వృద్ధి సాధిస్తాం. తోటివారి మీద కోపతాపాలు, ఈర్ష్యాసూయలూ పెంచుకోవద్దు. ఒకవేళ అవతలివాళ్లు మనపై విసుగూ చిరాకూ చూపినా అది తాత్కాలికమే అనుకుంటే ప్రశాంతత చేకూరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.