ఉద్యోగం వదిలేముందు.. ఒక్కమాట!
‘ఒకరి దగ్గర పనిచేయడం కాదు.. నేనే ఇంకొందరికి ఉపాధి కల్పించాలి!’... ఇలా ఆలోచిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికోసం మంచి ఉద్యోగం, భారీ జీతాల్నీ వదిలేస్తున్నారు. అలాంటి వారికి ‘షుగర్ కాస్మొటిక్స్’ వ్యవస్థాపకురాలు, సీఈఓ వినీతా సింగ్ ఓ సలహానిచ్చారు. అదేంటంటే..
‘ఒకరి దగ్గర పనిచేయడం కాదు.. నేనే ఇంకొందరికి ఉపాధి కల్పించాలి!’... ఇలా ఆలోచిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికోసం మంచి ఉద్యోగం, భారీ జీతాల్నీ వదిలేస్తున్నారు. అలాంటి వారికి ‘షుగర్ కాస్మొటిక్స్’ వ్యవస్థాపకురాలు, సీఈఓ వినీతా సింగ్ ఓ సలహానిచ్చారు. అదేంటంటే..
వినీత.. ఐఐటీ, ఐఐఎంల నుంచి డిగ్రీ, మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. కోట్ల రూపాయల జీతాన్ని కాదని వ్యాపార కలలతో ముంబయిలో అడుగుపెట్టారు. చిన్న గదిలో వ్యాపారాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మనవాళ్ల చర్మానికి తగ్గ సౌందర్య, మేకప్ ఉత్పత్తులు తయారు చేశారు. నాణ్యత అనగానే మనవాళ్ల చూపు విదేశాలవైపు మళ్లుతుంది. కానీ అక్కడి సంస్థలు తమ వారి చర్మతీరుకు తగ్గట్టుగా ఉత్పత్తులను చేస్తాయి. వాళ్లతో పోలిస్తే మన వాతావరణం, చర్మతీరు, రంగు భిన్నం. దీంతో చాలామందికి ఆ ఉత్పత్తులు సంతృప్తినిచ్చేవి కావు. అలాంటి వారిని ‘షుగర్ కాస్మొటిక్స్’తో ఆకర్షించారు వినీత. దానికి ఆన్‌లైన్, డీ2సీ సర్వీసులనూ జోడించి, రూ.300 కోట్ల పైచిలుకు వ్యాపార సామ్రాజ్యంగా మలిచారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు. అందుకే.. యువతరానికి ఓ సలహానిచ్చారు. ‘స్టార్టప్ కోసం కార్పొరేట్ కొలువును వదిలేముందు ఒక్కమాట. విజయం సాధించడానికి ఒక ముఖ్యమైన పదార్థం కావాలి. అదే నమ్మకం. వైఫల్యాలు, అవరోధాలు లెక్కలేనన్ని ఎదురవుతాయి. ఈ నమ్మకం లేకే ఎంతోమంది వెనకడుగు వేస్తుంటారు. ‘నమ్మకం’.. దీన్ని ఏ స్కూళ్లూ, ఆన్‌లైన్ కోర్సులూ నేర్పించలేవు. లాజిక్‌కీ దీనికీ పొంతనే ఉండదు. అయినా.. సవాళ్లకు ఎదురొడ్డుతూ సాధించగలననుకుంటూ సాగితేనే విజయం సాధిస్తారు’ అంటూ తన లింక్‌డిన్, ట్విటర్ ఖాతాల్లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. వినీత.. మోటివేషనల్ స్పీకర్ కూడా. పలు విద్యాసంస్థల్లో వ్యాపార పాఠాలు చెబుతారు. షార్క్ ట్యాంక్ టీవీ షోలో న్యాయనిర్ణేతగా సాధారణ ప్రేక్షకులకూ చేరువయ్యారు. తన పోస్టును చూసి ఎంతోమంది ‘మాలో స్ఫూర్తి నింపా’రంటూ మెచ్చుకుంటూ మెసేజ్‌లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.