నాట్యాన్ని ప్రేమించి.. నటరాజుకే గుడికట్టి!

నాట్యాన్ని ప్రేమించడం అంటే ఆ కళ తనకి మాత్రమే సొంతం అనుకోవడం కాదు. దానిని అందరికీ చేరువ చేయడమే అంటారు రాజమహేంద్రవరానికి చెందిన నాట్య గురువు చింతలూరి శ్రీలక్ష్మి. నటరాజుకే గుడికట్టించి.. అక్కడే ఉచితంగా అందరికీ నాట్యాన్ని నేర్పే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారామె...

Updated : 07 Sep 2022 09:16 IST

నాట్యాన్ని ప్రేమించడం అంటే ఆ కళ తనకి మాత్రమే సొంతం అనుకోవడం కాదు. దానిని అందరికీ చేరువ చేయడమే అంటారు రాజమహేంద్రవరానికి చెందిన నాట్య గురువు చింతలూరి శ్రీలక్ష్మి. నటరాజుకే గుడికట్టించి.. అక్కడే ఉచితంగా అందరికీ నాట్యాన్ని నేర్పే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారామె...

చిన్నతనంలో చూసిన శ్రీనివాస కల్యాణం నృత్య ప్రదర్శన శ్రీలక్ష్మి మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు కూచిపూడి నృత్య శిక్షణాలయంలో చేర్పించి ప్రోత్సహించారు. భరత నాట్యంలోను సాధన మొదలుపెట్టి 13ఏళ్లకే పరిణతి సాధించి, దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారామె. ‘విజయవాడలో పుట్టి పెరిగాను. నాట్యంపై ఇష్టాన్ని గమనించి నాన్న కృష్ణమూర్తి, అమ్మ కామేశ్వరి నన్ను ప్రోత్సహించారు. చదువుకుంటూనే నాట్యం సాధన చేశాను. గురువులతో కలిసి అనేక ప్రదర్శనలిచ్చా. డిగ్రీ చివరి ఏడాదిలో సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఆలిండియా రైల్వేస్‌ నిర్వహించిన నృత్య పోటీల్లో గెలిచి రైల్వేశాఖ సాంస్కృతిక విభాగంలో ఉద్యోగం సాధించా. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఉద్యోగం. అయినా  నృత్య ప్రదర్శనల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. పిల్లల సంరక్షణ, ఈ ఉద్యోగం, ప్రదర్శనలు... సమన్వయం కష్టమైంది. దాంతో 13ఏళ్ల తర్వాత ఉద్యోగం మానేశా’ అంటారు శ్రీలక్ష్మి. 

కళాక్షేత్రం నిర్వహిస్తూ..

నృత్య కళాక్షేత్రం, నాట్యవేదం వంటి శిక్షణాలయాలు ప్రారంభించి వేలమందికి ఈ కళని చేరువ చేశారు శ్రీలక్ష్మి. అందులో ఎందరో దేశవిదేశాల్లో స్థిరపడి ఆ కళని అక్కడా విస్తరిస్తున్నారు. ‘నేను నాట్యం నేర్చుకునే నాటికి గురువులు ఎక్కువగా అందుబాటులో ఉండే వారు కాదు. చాలా దూరం వెళ్లి నేర్చుకొనే దాన్ని. నా పిల్లలకు చిన్నతనం నుంచే శిక్షణ మొదలు పెట్టా. నృత్య కళాక్షేత్రం ప్రారంభించి పిల్లలతోపాటు ఆసక్తి కలిగిన వారికీ శిక్షణ ఇచ్చేదాన్ని. తర్వాత మావారు వెంకటరత్నం వృత్తిరీత్యా 2008లో రాజమహేంద్రవరం రావడంతో అక్కడే స్థిరపడ్డాం. అప్పట్నుంచి ‘నాట్యవేదం’ పేరుతో దానవాయిపేటలో శిక్షణాలయం నిర్వహిస్తూ వేలమందికి నాట్యం నేర్పించా. అందులో కొందరు విదేశాల్లో స్థిరపడి కళాకారులుగా రాణిస్తున్నారు. కూచిపూడి నృత్యంలో అమ్మాయిలు అబ్బాయి వేషధారణ, అబ్బాయిలు అమ్మాయిల వేషధారణ చేయడం సంప్రదాయంగా వస్తోంది. అందుకే నా పిల్లలిద్దరితో దానిని కొనసాగిస్తున్నా. మా బాబు అనిరుధ్‌ గౌర్‌ ఎంటెక్‌ చదువుతూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మా ప్రదర్శనల్లో ప్రత్యేకించి దేవతామూర్తులకు సంబంధించిన వాటిలో వేంకటేశ్వరస్వామిగా తనే ప్రదర్శన చేస్తాడు. భామాకలాపం చేస్తే అబ్బాయి అని గుర్తు పట్టడం కష్టమే. మా అమ్మాయి పీయూష సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.  దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ‘కూచిపూడి నాట్య వైభవం’ పేరుతో బర్కిలీ యూనివర్సిటీ నుంచి డాన్స్‌ డిప్లొమా ఇన్‌ కూచిపూడి చేస్తోంది. పీయూష స్త్రీ పాత్రలతోపాటు అన్నమాచార్య, ప్రహ్లాదుడు వంటి వేషధారణలతో నృత్యాభినయం చేస్తోంది’అని తన పిల్లల గురించి చెప్పిన శ్రీలక్ష్మి 108 అన్నమాచార్య కీర్తనలకు నృత్యాభినయం చేసి ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నారు. 

జీవితం నాట్యానికే అంకితం..

‘రాజమహేంద్రవరంలో ‘శ్రీనటభైరవి సమేత నటరాజస్వామి ఆలయం’ నిర్మిస్తున్నా. ఇందులో నటరాజస్వామి, నటభైరవి అమ్మవారు, నాట్య గణపతి, తాండవ కృష్ణుడు కొలువై ఉంటారు. వచ్చే కార్తీక మాసంలో ప్రతిష్ఠాపన జరుగుతుంది. ఈ నటరాజ సన్నిధిలోనే ఆసక్తి కలిగిన వారికి సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సుల్లో ఉచితంగా నాట్యం నేర్పించాలనుకుంటున్నా’నంటూ తన జీవితాశయాన్ని వివరించారు శ్రీలక్ష్మి.

- సూర్యకుమారి యడ్లపల్లి, రాజమహేంద్రవరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్