నిలవాలంటే.. నేర్చుకోవాలి!

‘ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం..’ విజయవంతమైన వారి నుంచి ఈ మాట ఎన్నోసార్లు వినుంటాం కదా! కెరియర్‌లో ముందుకు వెళ్లాలన్నా, ఆత్మవిశ్వాసం పెంపొందాలన్నా ఈ సూత్రం

Published : 17 Sep 2022 00:17 IST

‘ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం..’ విజయవంతమైన వారి నుంచి ఈ మాట ఎన్నోసార్లు వినుంటాం కదా! కెరియర్‌లో ముందుకు వెళ్లాలన్నా, ఆత్మవిశ్వాసం పెంపొందాలన్నా ఈ సూత్రం పాటించాల్సిందే అంటారు నిపుణులూ..

* రోజురోజుకీ సాంకేతికతలో ఎన్నో మార్పులు. నిరంతరం మారిపోయే ప్రపంచంతో పోటీ పడాలంటే మనమూ ఆ వేగాన్ని  అందుకోవాలిగా! అందుకే కొన్ని సంస్థలు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కానీ అందరికీ ఆ ఆస్కారం ఉండదు. పైగా అవీ తమకు కావాల్సిన నైపుణ్యాలే నేర్పిస్తాయి. మనలో చాలా మంది నాయకురాలై నడిపించాలనుకుంటున్నారు. దాన్ని అందుకోవాలనుకుంటే నేర్చుకోవడంలో రాజీపడొద్దు.

* ‘మహిళలు నాయకత్వ హోదాకు పోటీపడక పోవడానికి.. వాళ్లకి వాళ్లు తక్కువన్న భావనతో ఉండటమే కారణం’.. ఓ పరిశోధన సారాంశమిది. పక్కవాళ్లకు ఎక్కువ తెలుసు అనుకున్నప్పుడే కదా ఈ సమస్య. ఆ పరిజ్ఞానాన్ని మనమే పెంచుకుంటే ఆత్మవిశ్వాసం అదే వస్తుంది. కాబట్టి, తాజా ధోరణులను గమనించండి. అప్పుడిక నల్లేరు మీద నడకే!

* ‘మహిళల్లో సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఎక్కువ’ని చాలా పరిశోధనలు రుజువు చేశాయి. చిన్నతనం నుంచీ నేర్చుకునే పనులు, తెలుసుకోవాలనే తపన సహజంగానే ఈ నైపుణ్యాన్ని అలవరుస్తాయి. అందుకే ఇంట్లో చిన్నచిన్న సమస్యల్ని ఇట్టే పరిష్కరిస్తాం. కెరియర్‌ విషయంలోనూ దీన్ని పాటించగలగాలి. చేతిలో ఎంత సమాచారం ఉంటే అంత వేగంగా ఆలోచనలు పుట్టుకొస్తాయి. దీంతో పాత ప్రాజెక్టులు, రికార్డులు తిరగేయాల్సిన పనుండదు. ఇదీ లాభించే విషయమేగా! అంతేకాదు.. ఎదుటివారితో మాట్లాడే నైపుణ్యాలూ మెరుగవుతాయి. కాబట్టి.. నేర్చుకోవడం మొదలుపెట్టేయండి.


ఇల్లు, ఉద్యోగానికి తోడు మళ్లీ ఇదో అదనపు శ్రమ అనుకుంటున్నారా? నేర్చుకోవడం సంతోషానికీ కారణమవుతుంది. ఎలాగంటారా.. నేర్చుకునే క్రమంలో పరిచయాలూ పెరుగుతాయి. వారి నుంచి అవకాశాలు, హాబీలు, ఆరోగ్యకరమైన సూచనలు ఇలా ఎన్నో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఫలితంగా పదోన్నతులూ దక్కుతాయి. ఇవన్నీ ఆనందం కలిగించే అంశాలేగా మరి!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని