నోరు మంచిదైతే అంతా శుభమే
కౌసల్య మనసు మంచిది. ఆఫీస్‌లో అందరికీ సాయపడటానికి ముందుంటుంది. అయితే ఆమె వాడే పదజాలం ఎవరినీ తన దరికి రానివ్వదు. మాట్లాడేటప్పుడు పదాలను ఎంచుకునే విధానమే
కౌసల్య మనసు మంచిది. ఆఫీస్‌లో అందరికీ సాయపడటానికి ముందుంటుంది. అయితే ఆమె వాడే పదజాలం ఎవరినీ తన దరికి రానివ్వదు. మాట్లాడేటప్పుడు పదాలను ఎంచుకునే విధానమే కెరియర్‌లోనైనా, జీవితంలోనైనా.. పదిమందితోనూ కలపడమా, దూరం చేయడమా అన్నది నిర్దేశిస్తుంది... అందుకే అంటారు నోరు మంచిదైతే... అని.
విజయం, వైఫల్యం.. ఈరెండింటి పునాదిలో మాట్లాడే పదాలు కూడా ఇమిడి ఉంటాయి. భాషను అందంగా వినియోగిస్తే అది మన జీవితంపై మంచి ప్రభావం చూపించి ముందుకు నడిపిస్తుంది. అలాకాకుండా ఇలాగే మాట్లాడతా, నా మాట తీరింతే .. అనే తరహా ఇంట్లోవారికే కాదు, కెరియర్‌లోనూ ఇబ్బందుల్ని కలిగిస్తుంది. మానవ సంబంధాలనూ దూరం చేస్తుంది. ఉద్యోగిగా ఉన్నప్పుడు అందరితోనూ చేయీ చేయీ కలిపి అడుగేయాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి వయసుకు తగినట్లు మర్యాదిస్తే, అదే తిరిగి మనకూ దక్కుతుంది. లేదంటే కెరియర్‌లో వెనకడుగు పడుతుంది. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాల్లో మాట్లాడే విధానం కూడా ఒకటి. దీని ద్వారానూ... వ్యక్తిత్వం బయటపడుతుంది.
బృందంతో.. ఆఫీస్‌లో టీం లీడర్‌గా బాధ్యత వహించినప్పుడు సహోద్యోగులపై గౌరవాన్ని ఉంచాలి. సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఎదుటి వారిపై అది మంచి ప్రభావం చూపించాలి. టీం లీడర్ మాట్లాడిన వెంటనే ప్రాజెక్ట్‌ను పూర్తిచేయగలిగే ఉత్సాహం కింది ఉద్యోగుల్లో రావాలి. ప్రసంగంలో వాడే పదాల తీరు అవతలి వారిలో స్ఫూర్తినందించడమే కాదు. తోటివారికి ఆ పనిపట్ల బాధ్యతను గుర్తు చేసేలా ఉండాలి. అంతేకాదు, తమ లీడర్‌పై గౌరవం మరింత పెరిగేలా ఉండాలి. మాట్లాడే తీరుతో అటు బాధ్యతలు పూర్తి చేయొచ్చు. మరోవైపు సంస్థ నుంచి గౌరవ మర్యాదలను పొందొచ్చు. అందుకే పదాల వినియోగంలో ఆచితూచి అడుగేయాలి.
ప్రయత్నం..
ఆఫీస్‌లో పైఅధికారి ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు ‘ప్రయత్నిస్తాను’ అనకూడదు. పూర్తి చేయడానికి కృషి చేస్తాను అని చెప్పాలి. అలాగే సామర్థ్యమంతా వినియోగించి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత పని పూర్తైనా, కాకపోయినా దానికోసం చేసిన కృషి మీపై గౌరవాన్ని పెంచుతుంది. అలాగే సహోద్యోగి సహాయం కోరినప్పుడు నావల్ల కాదని నిర్ద్వంద్వంగా చెప్పకూడదు. తప్పక ప్రయత్నిస్తాను అనాలి. చెప్పినట్లే ప్రయత్నించడం మానకూడదు. ఇతరులతో అనుసంధానమవడానికి ఉపయోగపడే భాషను వినియోగించడంలో జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాల్లో మనసులోని అభిప్రాయాన్ని పైకి చెప్పలేని పరిస్థితుల్లోనూ.. ఎదుటివారికి సున్నితంగా ఆ విషయాన్ని చేరవేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.