ఉద్యోగం భారమవుతోంటే..

ఒకవైపు ఇల్లు, మరోవైపు ఉద్యోగం.. రెండు బాధ్యతలూ సమన్వయం చేయడం అంత సులువు కాదు. ఆ ఒత్తిడి మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పనిపై అనాసక్తికితోడు ఉద్యోగమే భారంగా తోయొచ్చు.

Published : 03 Oct 2022 00:57 IST

ఒకవైపు ఇల్లు, మరోవైపు ఉద్యోగం.. రెండు బాధ్యతలూ సమన్వయం చేయడం అంత సులువు కాదు. ఆ ఒత్తిడి మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పనిపై అనాసక్తికితోడు ఉద్యోగమే భారంగా తోయొచ్చు. అలాంటప్పుడు..

* పని కొండలా కనిపిస్తోంటే.. సమయానికి పూర్తవ్వదన్న భయం, కంగారు. దీంతో పొరపాట్లు. ఒక్కోసారి ముఖ్యమైనవాటినీ మర్చిపోయే ప్రమాదం. చేయాల్సిన వాటన్నింటినీ ఓ జాబితాగా రాసుకోండి. వాటిల్లోముందు పూర్తిచేయాల్సినవేవో ర్యాంకింగ్‌ ఇచ్చుకోండి. ఒక్కోటీ పూర్తవుతోంటే టిక్‌ చేసుకుంటూ వెళితే సరి. మీటింగ్‌లు, గుర్తుంచుకోవాల్సిన విషయాలకు అలారమ్‌, ఫోన్‌లో క్యాలెండర్‌ అలర్ట్‌లు పెట్టుకుంటే మరచిపోయే ప్రమాదం ఉండదు.

* పని పూర్తవ్వాలని అదే పనిగా చేసుకుంటూ కూర్చోవద్దు. శరీరానికీ, మనసుకీ విశ్రాంతి కావాలి. ఒక పని పూర్తైందా కాస్త పక్కకు వెళ్లండి. లేదూ కుర్చీలోనే కూర్చొని స్ట్రెచింగ్‌ చేయండి. ఈ చిన్న వ్యాయామాలు మూడ్‌ను తేలిక పరుస్తాయి. విరామం సమయం వృథా అనుకుంటాం కానీ.. ఇది మెదడుని ఉత్తేజపరిచి పని వేగంగా పూర్తయ్యేలా చేస్తుందట.

* అన్ని విషయాలూ అందరికీ తెలియవు. ఒక్కోసారి ఆలోచన తట్టకపోవచ్చు. అలాంటప్పుడు ఆందోళన పడుతూ కూర్చోకండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. సాయం కోరినంత మాత్రాన మీకేం తెలియదని అర్థం కాదు. మీ పని ఎదుటివారిపై రుద్దినట్టూ భావించొద్దు. పనిని మీకు తోచినట్టుగా కాక ఇంకాస్త ప్రభావవంతంగా చేసే ప్రయత్నంగానే భావించాలి.

* ఒక్కోసారి అప్పటికప్పుడు చేయాల్సిన పనులుండవు. మనసూ దానిపైకి మళ్లదు. అలాంటప్పుడు బలవంతంగా పనిపైకి మనసు మళ్లించకండి. విశ్రాంతి కావాలనిపిస్తోందా? తీసుకోండి. వేరే ఏదైనా చేయాలనిపిస్తే చేసేయండి. వీలుకాకపోతే మరేదేదైనా చేయండి. ఆలోచనలు స్తబ్ధుగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా పని కదలదు. పైగా మనసుకీ అలసట. ఇలాంటప్పుడు కొద్దిసేపు నచ్చినవి చేస్తే.. తర్వాత పనివైపు మనసు మళ్లుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని