బహుముఖ సృజన
సృజనది కాకినాడలోని వాకలపూడి. నాన్న సూర్యదేవర రామారావు విశ్రాంత సైనికాధికారి, అమ్మ విజయ. నాన్న స్ఫూర్తితో.. పేదలకు సేవ చేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది. చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాల్లోనూ రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. నీట్‌లో 390వ ర్యాంకు సాధించి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించింది.
తండ్రి దేశ సేవ చేస్తే.. తాను సమాజానికి సేవ చేయాలనుకుంది. అందుకు వైద్యవిద్యను ఎంచుకుంది సూర్యదేవర సృజన. 12 బంగారు పతకాలు అందుకుని.. వర్సిటీ బెస్ట్ అవుట్ గోయింగ్ విద్యార్థినిగానూ నిలిచింది. అంతేనా... ఇంకా ఎన్నో రంగాల్లోనూ రాణిస్తోంది.
సృజనది కాకినాడలోని వాకలపూడి. నాన్న సూర్యదేవర రామారావు విశ్రాంత సైనికాధికారి, అమ్మ విజయ. నాన్న స్ఫూర్తితో.. పేదలకు సేవ చేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది. చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాల్లోనూ రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. నీట్‌లో 390వ ర్యాంకు సాధించి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించింది. ప్రస్తుతం అదే కళాశాలలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఇటీవల రంగరాయ వైద్య కళాశాల 64వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో చదువులో ప్రతిభ చూపినందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డా.శ్యామ్‌ప్రసాద్ చేతుల మీదుగా బంగారు పతకాలతో పాటు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు అందుకుంది. నాలుగో ఏడాది సబ్జెక్టులు, మొత్తంగా వచ్చిన మార్కులకు ఏడు బంగారు పతకాలు, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్‌గా 5 బంగారు పతకాలు సాధించిన ఏకైక విద్యార్థినిగానూ నిలిచింది. సృజన ఆటల్లోనూ ముందే. షాట్‌పుట్, డిస్కస్ త్రోల్లో ఇంటర్ వర్సిటీ మీట్‌లో బంగారు పతకాలు అందుకుంది. నృత్యం, చిత్రలేఖనంలోనూ ఎన్నో బహుమతులు వరించాయి. ‘అమ్మా నాన్నా నాకెన్నో సౌకర్యాలు కల్పించారు. కానీ వాళ్లు అవేమీ లేకుండానే ఈ స్థాయిలో నిలిచారు. వాళ్లే నాకు స్ఫూర్తి. ఇంటర్న్‌షిప్ చేస్తున్నా. జనరల్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ చేయాలనుంది. ఆపై ఎయిమ్స్ న్యూదిల్లీలో పని చేయాలన్నది నా కల. ఇన్ని బంగారు పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. మొదట్నుంచీ చదువు ఒక్కదాని మీద దృష్టి పెట్టలేదు. ఆటపాటలకీ సమ ప్రాధాన్యమిస్తూ వచ్చా. అందుకే ఒత్తిడి ఎరుగను. ప్రణాళిక ప్రకారం ముందుకెళితే కోరుకున్న లక్ష్యం చేరుకోవడం సులువే. శాస్త్రీయ నృత్యాన్ని మరింత సాధన చేసి, దానిలోనూ రాణిస్తా. జీవితంలో మనకు స్ఫూర్తినిచ్చే వారెందరో! నేనూ ఒక్కరికైనా స్ఫూర్తినిచ్చేలా నిలవాలన్నది నా కోరిక’ అంటోందీ బహుముఖ ప్రజ్ఞాశాలి.
- ముత్యాల దివ్యమూర్తిబాబు, కాకినాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.