మీ వ్యక్తిగతం.. వాళ్లకెందుకు?

ఆఫీసులో అస్తమానూ పనిచేయడం కష్టమే! విరామానికని పక్క వాళ్లతో మాటామంతీ కలుపుతుంటాం. వాటిని సరదా సంగతుల వరకే పరిమితం చేయమంటున్నారు నిపుణులు.

Published : 03 Nov 2022 00:34 IST

ఆఫీసులో అస్తమానూ పనిచేయడం కష్టమే! విరామానికని పక్క వాళ్లతో మాటామంతీ కలుపుతుంటాం. వాటిని సరదా సంగతుల వరకే పరిమితం చేయమంటున్నారు నిపుణులు. ఎంత స్నేహితులైనా వ్యక్తిగత అంశాలను చర్చించొద్దు అంటున్నారు.

* స్నేహితులన్నాక ఇంట్లో సరదా సంఘటనలు, పిల్లల కబుర్లు షేర్‌ చేసుకోవడం సహజమే! సందర్భానికి తగ్గట్టుగా ఏదైనా సంఘటన జరిగితే అంతవరకూ పంచుకొని వదిలేయండి. అంతేకానీ దానిపై చర్చలొద్దు. మీ ఇంటి విషయాలు అందరికీ ఆసక్తి కలిగించవు. మీరేమనుకుంటారో అని విన్నా.. తర్వాత మిమ్మల్ని చిన్నచూపు చూసే అవకాశమూ లేకపోలేదు.

* అభిమాన నటులు, నాయకులు, పార్టీలు.. ప్రతి ఒక్కరికీ మామూలే. మీ అభిమానం పక్క వాళ్లకి ఇబ్బంది కాకూడదు కదా! ప్రతి అప్‌డేట్‌నీ పంచుకోవడం, వాళ్ల గొప్పతనాన్ని చర్చించడం మీకు ఆనందమే.. తోటివాళ్లకు కాదు.

* చాలా సంస్థలు ఈ మధ్యే తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇంట్లో పనిచేసిన వాతావరణం కదా! ఒక్కసారిగా మీరు ఆఫీసుకు రావడం ఇబ్బందిగా తోయొచ్చు. అది అందరి సమస్య కూడా. ఒకట్రెండు సందర్భాల్లో బయటపటడం మామూలే. అయితే దాన్ని కొనసాగించొద్దు. పైవాళ్ల వరకూ వెళితే మీపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడగలదు. పైవాళ్ల సూచనలు, మీతో చర్చించిన విషయాలనూ అధికారికంగా ప్రకటించే వరకూ వేరేవాళ్లకు చెప్పొద్దు. ఇలా చేస్తే మీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది.

* షాపింగ్‌దీ మనదీ విడదీయలేని అనుబంధం. ధరలు, బేరాలాడటం, డిస్కౌంట్ల చర్చలకూ ఆఫీసు వేదిక కాకూడదు.

* ఆరోగ్యం బాలేదా.. కారణం చెప్పి వదిలేయండి. వైద్యసలహా కావాలంటే తప్ప లోతుగా చర్చించొద్దు. మీ భాగస్వామితో అనుబంధమూ మీకే ప్రత్యేకం. మీ అన్యోన్యత వివరాలు, బంధంలో సమస్యల్నీ ఏకరువు పెట్టొద్దు. స్నేహితులని అన్నింటినీ పంచుకుంటాం. నిజమే.. ఆఫీసు స్నేహాలకు, సాధారణ వాటికీ తేడా ఉంటుంది. సత్సంబంధాలను నెరిపితే చాలు. ప్రతిదీ పంచుకోవాల్సిన పనిలేదు. ఆ లక్ష్మణరేఖను పాటిస్తేనే.. మీకూ మంచిది, గౌరవప్రదం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్