అబద్ధం...పర్లేదా?

ఆఫీసులో చాలా పని అని చెప్పి స్నేహితులతో గడిపేయడం, ఐదునిమిషాల్లో వచ్చేస్తున్నా అంటూ గంటల కొద్దీ ఎదురు చూసేలా చేయడం.. శ్రీవారు మనతో చెప్పే అబద్ధాలు ఒకటా, రెండా! ఆ క్షణం కోపమొచ్చినా త్వరగానే క్షమించేస్తాం.

Published : 14 Nov 2022 00:18 IST

ఆఫీసులో చాలా పని అని చెప్పి స్నేహితులతో గడిపేయడం, ఐదునిమిషాల్లో వచ్చేస్తున్నా అంటూ గంటల కొద్దీ ఎదురు చూసేలా చేయడం.. శ్రీవారు మనతో చెప్పే అబద్ధాలు ఒకటా, రెండా! ఆ క్షణం కోపమొచ్చినా త్వరగానే క్షమించేస్తాం. అదే మన మనసుకు గాయం చేసేదైతే?

* మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి.. పాత మాటే! కానీ ఇందులో నిజం లేకపోలేదు. ఒకరు చెప్పిన దాంట్లోనూ నిజం ఉండకపోవచ్చు. మీలో మీరు కుంగిపోకుండా నేరుగా తనతోనే మాట్లాడండి. భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా చర్చించండి. దాన్నిబట్టి నిర్ణయం తీసుకోండి.

* ఆయన ప్రవర్తన మీకు బాధ కలిగించింది. అయితే, కొన్నిసార్లు తెలియకుండానూ తప్పు జరగొచ్చు. క్షమాపణ చెప్పారనుకోండి. దానిలో నిజాయితీ కనిపిస్తే క్షమించేయండి. మరోసారి అలా జరగకుండా చూసుకుంటానన్న హామీ తీసుకోండి. దాన్ని అంతటితో వదిలేయాలి. ప్రతి చిన్న విభేదానికీ అదే ప్రస్తావన తేవొద్దు. అది మీ అనుబంధానికి అంత మంచిది కాదు.

* ప్రేమతోపాటు సురక్షితమైన భావన ఉంటేనే అసలైన బంధం. తప్పించుకు తిరగడం, మిమ్మల్ని అశ్రద్ధ చేయడం లాంటివి కనిపిస్తే.... మీపై శ్రద్ధ లేదనే అర్థం. ఇలాంటివి తరచూ జరుగుతోంటే ఆ బంధం నుంచి బయటకు రావడమే మేలు.

* ఎంత ప్రయత్నించినా కొన్ని అబద్ధాలు మనల్ని దాటి పోలేవు. చాలాసార్లు చూసీ చూడకుండా ఉంటాం. అదే చేయొద్దు. మీరు కనిపెట్టలేదనుకొని కొనసాగించే ప్రమాదం ఉంది. పైగా ఆ కోపం.. ఒత్తిడి, మానసిక అలసటకీ దారితీయొచ్చు. గుర్తించినట్లుగా చెబుతూనే, క్షమించేయండి. ఇక అప్పట్నుంచి అబద్ధం చెప్పిన ప్రతిసారీ మీరెక్కడ కనిపెట్టేశారోనన్న ఒత్తిడి వాళ్లపై ఉంటుంది. ఇవన్నీ చిన్నవే! మార్చుకోవడమూ సులువే. మోసం విషయంలో మాత్రం ‘మరో అవకాశం’ సూత్రం పనికి రాదు. క్షమించేయండి ఫర్లేదు. కలిసి నడిచే ఆలోచన మాత్రం వద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని