పెళ్లికి లేటాయెనా?

పైచదువులూ, ఉద్యోగంలో స్థిరత్వం అంటూ కొందరమ్మాయిలు పెళ్లిని వాయిదా వేస్తున్నారు. కుటుంబ జీవితం చాలని ఉద్యోగాన్ని పక్కన పెట్టేయడం ఎలా సరి కాదో, కెరియరే ముఖ్యమనుకుని పెళ్లిని నిర్లక్ష్యం చేయడమూ అంతే పొరపాటని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated : 19 Nov 2022 04:47 IST

పైచదువులూ, ఉద్యోగంలో స్థిరత్వం అంటూ కొందరమ్మాయిలు పెళ్లిని వాయిదా వేస్తున్నారు. కుటుంబ జీవితం చాలని ఉద్యోగాన్ని పక్కన పెట్టేయడం ఎలా సరి కాదో, కెరియరే ముఖ్యమనుకుని పెళ్లిని నిర్లక్ష్యం చేయడమూ అంతే పొరపాటని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెంటికీ ప్రాధాన్యత ఇవ్వాలి, తగిన వయసులోనే పెళ్లీ చేసుకోవాలి, లేదంటే అనర్థాలు తప్పవు అంటున్నారు. ఎందుకో కారణాలు కూడా చెబుతున్నారు.

* డిగ్రీ కాకుండానే సంబంధాలు వచ్చాయి కదాని తొందరపడి ఏదో ఒకటి ఎంచుకోవద్దు. కానీ భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఏం చేయాలని కలలు కంటున్నారో, ఎలాంటి వ్యక్తి అయితే జీవితం సజావుగా, సంతోషంగా సాగుతుందో నిశితంగా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీకు తారసపడితే సరే. లేదంటే  మీ భావాలను అమ్మా నాన్నలకు చెప్పండి.
* పెళ్లికి ముందే ఇల్లూ, కెరియర్‌ గురించి చర్చించి, తగిన నిర్ణయం తీసుకోండి.
* పెళ్లికి పరిపక్వత అవసరమే. కానీ వయసు పెరిగేకొద్దీ అభిప్రాయాలు స్థిర పడతాయి. సర్దుబాటు గుణం సన్నగిల్లుతుంది. ‘నేనింతే, నాకు తగ్గట్టుగా అవతలి వారు ఉండాలే కానీ నేను రాజీపడేది లేదు’ అనిపిస్తుంది. అప్పుడిక పెళ్లి ఆనందానికి బదులు ఆందోళన మిగులుస్తుంది.
* స్వేచ్ఛ, స్వతంత్రభావాలూ అలవాటయ్యాక భాగస్వామి కంటే కెరియరు, సొంత వ్యాపకాలు ముఖ్యమనిపిస్తాయి. దాంతో విభేదాలు తలెత్తే అవకాశముంది. సర్దుబాట్లు బానిసత్వంలా అనిపించి, తనకు నచ్చినట్లు యథేచ్ఛగా జీవించడం మేలనిపిస్తుంది. కానీ తాత్కాలికంగా ఆహా అనిపించే ఆ ఏకాంతం కొన్నాళ్లకి కారడవిలో చీకటిలా మారి ఒంటరితనంతో తల్లడిల్లేట్లు చేస్తుంది.
* సాధారణంగా స్త్రీలకు 40 తర్వాత శారీరక వాంఛలు తగ్గుముఖం పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు లేట్‌ మ్యారేజెస్‌లో ఆలుమగల మధ్య సత్సంబంధాలు కొరవడి, అనురాగం బలపడదు.
* వయసుతోబాటు బాధ్యతలు, ప్రాధాన్యతలు మారి ఆలుమగల మధ్య ఆంతరాలు చోటుచేసుకుంటాయి. అప్పుడిక ప్రేమకి చోటెక్కడిది? ద్వేషం బయల్దేరుతుంది.
* మూడు పదులు దాటాక సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువవుతాయి. గర్భం ధరించినా ప్రసవం కష్టమవుతుంది.
* అన్నిటినీ మించి తగిన వయసులో పిల్లలు పుడితే వాళ్ల అల్లరిచేష్టలను భరించే ఓర్పూ సహనం ఉంటాయి. ఆలస్యమైనప్పుడు చిన్నారుల్ని గారాబం చేయడానికి బదులు చీటికి మాటికి అసహనం, ఆందోళన తప్పవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్