Updated : 17/03/2023 04:10 IST

ధైర్యంగా సాధన చేస్తే..

నేటికీ మనలో కొంత మంది కొత్తవాళ్లతో, ఇంటర్వ్యూలో, పై అధికారులతో మాట్లాడాలంటేనో వణికిపోతారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఇలాంటి భయాలన్నీ పక్కన పెట్టి మనదైన శైలిలో పై స్థాయి ఉద్యోగుల దగ్గర ఎటువంటి జంకూ లేకుండా మాట్లాడగలగాలంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దామా..

ది సహజమే.. ప్రతి ఒక్కరూ ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు భయపడటం సహజమే. ఎవరి ముందైనా మాట్లాడాలంటే గుండె వేగంగా కొట్టుకోవటం, చేతులు, కాళ్లకు చెమటలు పట్టడం జరుగుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒంటరిగా అద్దం ముందు కూర్చొని ఎవరో ఉన్నట్టు ఊహించుకోవాలి. ముఖ్యమైన విషయాలన్నీ ముందే నోట్స్‌లో రాసుకోవాలి. పదే పదే వాటిని నెమరేసుకుంటూ ఉండాలి.  ఇలా తరచూ చేస్తే ఎవరిముందైనా మాట్లాడే ధైర్యం వచ్చేస్తుంది.

నోట్‌ చేసుకోండి.. ఏదైనా కార్యక్రమం, ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ఏమేం తప్పులు చేశామో అవన్నీ రాసుకోవాలి. వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించండి. మళ్లీ అలాంటివి చేయకుండా ఉండేందుకు ఏం చేయాలో పరిష్కారం వెతకండి.

సౌకర్యంగా.. ఎక్కడికి వెళ్లినా ముందు సౌకర్యంగా ఉండే దుస్తులు, అలంకరణకు ప్రాధాన్యమివ్వాలి. లేదంటే అసౌకర్యానికి గురవుతారు. ధ్యాస మొత్తం వాటి మీదకు మళ్లి ప్రజెంటేషన్‌ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ.

కట్టిపడేసేలా.. ఎదుటివారిని ఆకట్టుకోవడంలో బాడీ లాంగ్వేజ్‌దీ ప్రధాన పాత్రే! ముఖ కవళికలతో, చేతులను అటూ ఇటూ తిప్పుతూ విషయాన్ని వివరించే తీరుతో  ఎదుటివారిని ఆకట్టుకోవచ్చు. దీనిపైనా శ్రద్ధ పెడితే కట్టిపడేసేలా మాట్లాడొచ్చు.

సాధనతోనే.. ఇవన్నీ కేవలం చదవడం వల్లో, గుర్తుంచుకోవడం వల్లో ఒంటపట్టవు. సాధనతోనే పట్టు సాధించడం సాధ్యం. వీటితోపాటు మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే ఎంత పెద్ద పని అయినా సులభంగా చేసేయొచ్చంటున్నారు నిపుణులు. ఈ సూత్రాలను పాటించేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని