Published : 25/03/2023 00:26 IST

ఆఫీసూ.. ఉల్లాసంగా!

దేన్నైనా భారంగా అనుకున్నప్పుడే అయిష్టం పెరిగేది! చాలామంది ఆఫీసు విషయంలో ఇలాగే భావిస్తారు. అందుకే ఉసూరుమంటూ పని ప్రదేశానికి వెళుతుంటారు. ఉద్యోగినిగా మనం ఎక్కువ సమయం గడిపే ప్రదేశమది. అలా భారంగా భావిస్తోంటే ఒత్తిడనిపించదూ? ఇలా ఉల్లాసంగా మార్చేసుకోండి!

* సమయంతో పరుగులు మనకు ఇంటి నుంచే మొదలవుతుంది. దానికి ఆఫీసు పనీ తోడవుతుంది కాబట్టి, ఒత్తిడి సహజమే! కాబట్టి, ఉదయాన్నే కొద్దిసేపు వ్యాయామానికి కేటాయించండి. మెదడు ఉత్తేజితమై పని భారంగా తోయదు. సాయంత్రం ఆఫీసయ్యాక కొద్దిసేపు నడవండి. ఆఫీసు ఒత్తిడి ఇంటివరకూ వెళ్లదు.

* చుట్టూ నలుగురూ నవ్విస్తూ పలకరిస్తుంటే ఎంత బాగుంటుంది? కాబట్టి, పరిచయాలను పెంచుకోండి. నవ్వుతూ పలకరించండి. తోటివారికి అవసరమైతే సాయం చేయండి. బంధాలు పెరుగుతాయి. మన అన్నవాళ్లు పక్కనుంటే ఎంత కష్టమైనా దాటొచ్చు అంటారు కదా! అది ఇక్కడా వర్తిస్తుంది. ఈ నెట్‌వర్కింగ్‌ కెరియర్‌కీ ప్రయోజనకరమే.

* అభద్రతా భావం కూడా ఒత్తిడికి కారణమే! కాబట్టి, కెరియర్‌కు సంబంధించిన కొత్త విషయాలను తెలుసుకోండి. లేదూ కొత్త నైపుణ్యం, హాబీలపై దృష్టిపెట్టండి. కొత్త విషయం నేర్చుకుంటున్నానన్న ఆలోచన మనసుకు ప్రశాంతతనిస్తూనే ఆనందాన్నీ నింపుతుంది.

* గతంలో ఏం సాధించామని ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడేంటి అనేదే చూస్తారు. కాబట్టి వెనక్కి చూస్తూ కూర్చోక ఇప్పుడు, ఈ క్షణాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టండి. మీ సానుకూలతలు, దృష్టిపెట్టాల్సిన అంశాలేంటో సరిచూసుకోండి. తట్టలేదూ ఎవరి సాయమైనా తీసుకోవచ్చు కూడా.

* వెనకబడుతున్నా అని కంగారు పడటం, ఎవరో ఏదో అన్నారని మనసుకు తీసుకోవడం, కోపం పెంచుకోవడం వంటి వాటికి దూరంగా ఉండండి. ఇవి బుర్రను సానుకూలంగా ఆలోచించనీయవు. విభేదాలకూ దారితీస్తాయి. ఇక ఆ ప్రదేశం ఆనందంగా ఎలా అనిపిస్తుంది? చివరగా ఎక్కువ గంటలు పనిచేస్తేనే ఫలితం అన్న ధోరణి వద్దు. వీలైనంత త్వరగా పని ముగించుకునే విధానాలపై దృష్టిపెట్టండి. చాలావరకూ వ్యతిరేకత దూరమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని