అన్నదాతకు దన్నుగా.. అమ్మాయిల పరిశోధన
ప్రధానమంత్రి ఫెలోషిప్! ఏటా పదుల సంఖ్యలో ఇచ్చే వీటికి దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది. వేలమందిని దాటుకొని ఆ అవకాశం దక్కించుకున్న వారిలో మన తెలుగమ్మాయిలు బిక్కసాని మైత్రి, మల్‌రెడ్డి జ్యోత్న్స కూడా ఉన్నారు. తమ పరిశోధనలతో సామాన్య రైతులకు లాభాలు చేకూర్చడమే ఉద్దేశమంటున్న వాళ్లని వసుంధర పలకరించింది!
ప్రధానమంత్రి ఫెలోషిప్! ఏటా పదుల సంఖ్యలో ఇచ్చే వీటికి దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది. వేలమందిని దాటుకొని ఆ అవకాశం దక్కించుకున్న వారిలో మన తెలుగమ్మాయిలు బిక్కసాని మైత్రి, మల్‌రెడ్డి జ్యోత్న్స కూడా ఉన్నారు. తమ పరిశోధనలతో సామాన్య రైతులకు లాభాలు చేకూర్చడమే ఉద్దేశమంటున్న వాళ్లని వసుంధర పలకరించింది!
వాళ్లని లాభాలబాట పట్టించాలని
మల్‌రెడ్డి జ్యోత్స్న
మాది నాగర్‌కర్నూలులోని రంగాపూర్. నాన్న దామోదర్ రెడ్డి ఎక్స్ సర్వీస్ మెన్. అమ్మ ఉమాదేవి. ఇంటరయ్యాక భవిష్యత్తు బాగుంటుందంటే బ్యాచిలర్స్‌లో ఫిషరీ సైన్స్‌ని ఎంచుకున్నా. చదువుతున్న కొద్దీ ఆక్వాకల్చర్‌పై ఆసక్తి పెరిగి పీజీలో చేరా. డాక్టర్ జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి నాలుగు బంగారు పతకాలూ అందుకున్నా. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నా. నా పరిశోధనాంశం పాలీకల్చర్! అంటే చేపలు, రొయ్యలను కలిపి పెంచడం. సాధారణంగా రైతులు వీటిల్లో ఏదో ఒకదాన్నే ఎంచుకుంటారు. రొయ్యలేమో నీటి అడుగున, చేపలు పైభాగంలో జీవిస్తాయి. స్థలం వృథా కాదు, పెంచేవాళ్లకీ రెట్టింపు లాభం వస్తుందన్న ఆలోచనతో దీనిపై పరిశోధన మొదలుపెట్టా. ఇందుకు బయోఫ్లోక్ టెక్నాలజీ అంటే ఇంట్లో వృథాగా పడేసే గంజి, గడువు ముగిసిన మీల్ మేకర్, బెల్లం వంటివాటిని చేపలకు ఆహారంగా అందిస్తాం. సాధారణంగా ఏ ఆవిష్కరణలు చేసినా కాలుష్యం, కరెంటు.. ఇలా ఏదో ఒకదాన్ని త్యాగం చేయాలి. కానీ ఆక్వాకల్చర్ మాత్రం వ్యర్థాలను తీసుకొని, మనకు చేపలు, రొయ్యల రూపంలో ఆహారం ఇస్తుంది. అలాంటి వాటిని పెంచే రైతులకు లాభం చేకూరాలన్నది నా కోరిక. రైతులకు వచ్చే లాభాల్లో 70 శాతం వీటి ఆహారానికే సరిపోతుంది. ఈ విధానంతో ఖర్చు చాలా తగ్గుతుంది. ఇంట్లోనూ చిన్నపాటి వ్యాపారంగా ప్రయత్నించొచ్చు. నాన్న స్నేహితుడి సలహాతో ప్రధానమంత్రి ఫెలోషిప్ గురించి తెలిసింది. గత సెప్టెంబరులో నా పరిశోధనాంశాన్ని వివరిస్తూ దరఖాస్తు చేసుకున్నా. ప్రాజెక్టు పరిశ్రమకు ఎంతవరకూ మేలు చేస్తుందన్నది పరిశీలిస్తారు. లక్షకు పైగా వచ్చే దరఖాస్తుల్లో ఎంపికవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్త అవ్వాలన్నది నా కల.
మొక్కజొన్నలో దిగుబడులకు..
బిక్కసాని మైత్రి
మాది ఖమ్మం జిల్లాలోని మోటాపురం. నాన్న రామ్మోహనరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అమ్మ సుజాత. గ్రామ నేపథ్యంలో పెరగడం వల్లేమో చిన్నతనం నుంచీ పంటలపై ఆసక్తి. అందుకే ఇంటరయ్యాక శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హార్టికల్చర్‌లో చేరాను. అక్కడి అధ్యాపకుల ప్రోత్సాహంతో మనసు పరిశోధనల వైపు మళ్లింది. దీంతో కేరళలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తిచేశాను. తరువాత ఏడాది పాటు భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థలో రిసెర్చ్ ప్రోగ్రాములో పని చేశాను. ఆపై పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో చేరా. ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్‌ను పరిశోధనాంశంగా ఎంచుకున్నా. ప్రపంచంలో హరిత విప్లవం ద్వారా దాదాపు అన్ని పంటల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కానీ మొక్కజొన్న విషయంలోనే అనుకున్నంత స్థాయిలో మార్పులు రాలేదు. మన దగ్గర ఎక్కువగా పండించే వాటిల్లో ఇదీ ఒకటి. దీంతో ఆ దిశగా పరిశోధనలు చేయాలనుకున్నా. ప్రధానమంత్రి ఫెలోషిప్‌కు గత డిసెంబర్‌లోనే దరఖాస్తు చేశాను. నా పరిశోధనలకు మొక్కజొన్నలో విత్తనాలు, దిగుబడుల పెంపునకు ఎరువుల తయారీలో కృషి చేస్తున్న ఓ ప్రముఖ సంస్థ సహకారం అందిస్తోంది. తాజాగా ఈ ఫెలోషిప్‌కి ఎంపికవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. మొక్కజొన్న పంటలో ఎక్కువ దిగుబడులు రాబట్టడం, జన్యు మార్పిడి ద్వారా తెగుళ్లను తట్టుకునేలా నూతన వంగడాలను రూపొందించడంపై పరిశోధన చేస్తున్నా. తద్వారా రైతులకు మేలు చేయొచ్చన్న ఆశ. అమ్మనాన్నలు నా ప్రతి అడుగులో తోడుంటారు. వాళ్ల ప్రోత్సాహంతోనే పరిశోధనల వరకూ రాగలిగా.
- రవితేజ, నేలకొండపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.