ఆడండి.. పాడండి..

మనలో చాలామందిమి రోజంతా ఊపిరాడని పనులతో సతమతమైపోతుంటాం. అన్నీ అందరికీ అమర్చడమే తప్ప మనకంటూ సమయం కేటాయించుకోలేం. వండిన పదార్థాలను వేడివేడిగా తినడం అసలే కుదరదు.

Published : 19 Apr 2023 00:32 IST

మనలో చాలామందిమి రోజంతా ఊపిరాడని పనులతో సతమతమైపోతుంటాం. అన్నీ అందరికీ అమర్చడమే తప్ప మనకంటూ సమయం కేటాయించుకోలేం. వండిన పదార్థాలను వేడివేడిగా తినడం అసలే కుదరదు. హడావుడిగా కాఫీ తాగేయడమే తప్ప ఒక్కో గుక్కా ఆస్వాదించడం వీలవదు. మగవాళ్లేమో అంతలా ఏం కష్టపడిపోతున్నావని తేలిగ్గా అనేస్తారు. ఇల్లాలి పదవే అలాంటిది మరి. అయితే, ఎప్పుడూ ఇలాగే ఉంటే మానసిక ఒత్తిడి పెరిగిపోవడం ఖాయం. దాని బారిన పడకూడదంటే మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. అందుకేం చేయాలంటారా. ఇవి చదివేయండి.

* పనులు ఎప్పుడూ ఉండేవే. వాటిని కాసేపు పక్కనపెట్టి అరమరికలు లేకుండా మాట్లాడగలిగే నెచ్చెలిని ఇంటికి పిలవండి. ఆమెకి రావడం కుదరదనుకుంటే మీరే వెళ్లండి. కాలక్షేపపు కబుర్లు ఎవరితోనైనా మాట్లాడొచ్చు. కానీ అంతరంగాన్ని కొందరితోనే పంచుకోవడం కుదురుతుంది. అప్పుడే మనసు తేలికవుతుంది.

* బాధ్యతలు మీదపడి ఆటలు అటకెక్కడం సహజం. కానీ శారీరక, మానసిక ఆరోగ్యానికి అవి కూడా అవసరం. రోజూ కుదరదనుకున్నా వారానికోరోజైనా ఆటల కోసం సమయం కేటాయించండి. కాలనీలో మీ వయసు వాళ్లతో ఒక టీమ్‌ ఏర్పాటు చేసుకుని ఆడుతుండండి. ఎంత ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంటుందో మీకే అనుభవమవుతుంది.

* సాదా చీర, లేదా దుప్పటి మీద నచ్చిన రంగులూ, డిజైన్లతో ఫ్యాబ్రిక్‌ పెయింట్‌ వేయండి. వేస్తున్నప్పుడే కాదు, దాన్ని చూసిన ప్రతి సారీ సంతోషం మీ సొంతమవుతుంది. ఇది ఒత్తిడిని ఇట్టే తగ్గిస్తుంది.

* ‘నేనేమన్నా గాయకురాలినా, సంగీత విద్వాంసురాలినా?’ అనుకోకుండా నచ్చిన పాటలను చేతనైనట్లు పాడుకుంటూ పనులు చేసుకోండి. అలసట తెలీదు. హాయిగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఎగతాళి చేయబోతే.. మీరూ నవ్వుతూనే జవాబివ్వండి. కానీ ఆ మాత్రానికే మీరు నీరు కారిపోవద్దు.

* వీలైతే కుటుంబసభ్యులతో లేదంటే ఒంటరిగానైనా సరే.. దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్లి కాసేపు వేగంగా నడవండి. ఆడుకుంటున్న పిల్లల్ని, విరబూసిన పూలనీ గమనిస్తూ కూర్చోండి. రీఛార్జ్‌ అయినట్లుంటుంది. ఇవన్నీ మీ మనసుని తేలికపరిచేవే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని