చెప్పేది వినాలి కదా!

‘బిడియం వదిలి ముందుకొచ్చి మాట్లాడాలి’ ఉద్యోగంలోకి అడుగుపెట్టే అమ్మాయిలకు సహజంగా వచ్చే సలహానే ఇది. కెరియర్‌లో నెగ్గుకు రావాలంటే నిజంగానే ఇతరులను ఒప్పించగలిగే నైపుణ్యం తప్పనిసరి. అలాగని ఎంతసేపూ వసపిట్టలా మీరే మాట్లాడుతున్నారా? ఎదుటివారు చెప్పేదీ వినాలి.

Published : 28 Apr 2023 00:50 IST

‘బిడియం వదిలి ముందుకొచ్చి మాట్లాడాలి’ ఉద్యోగంలోకి అడుగుపెట్టే అమ్మాయిలకు సహజంగా వచ్చే సలహానే ఇది. కెరియర్‌లో నెగ్గుకు రావాలంటే నిజంగానే ఇతరులను ఒప్పించగలిగే నైపుణ్యం తప్పనిసరి. అలాగని ఎంతసేపూ వసపిట్టలా మీరే మాట్లాడుతున్నారా? ఎదుటివారు చెప్పేదీ వినాలి. లేదంటే మీ కెరియర్‌కే ప్రమాదం అంటున్నారు నిపుణులు. కొన్ని అలవాట్లు చేసుకోమని సూచిస్తున్నారిలా..

శ్రద్ధ పెట్టాలి.. మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వినట్లేదు అనిపిస్తే బాధగా ఉంటుంది కదా! అవతలి వారి విషయంలోనూ అలా చేయకూడదు. ఏదైనా చెబుతోంటే ఫోన్‌ చూడటం, మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం మంచి అలవాటు కాదు. మంచో, చెడో చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. అప్పుడే ఇతరుల హావభావాలతోపాటు వ్యక్తిత్వమూ అర్థమవుతుంది. వారితో కలిసి ఎలా పనిచేయగలమన్న దానిపై స్పష్టతా దీని ద్వారా వస్తుంది.

అర్థం చేసుకుంటేనే... ఆఫీసులో ఏదో వివాదం. కొందరు ఆప్తులనో, సానుకూల అభిప్రాయం ఉందనో ఒకవైపు వాదనలే విని వేరే వాళ్లపై ఓ అంచనాకి వచ్చేస్తుంటారు. ఇదీ తప్పే! రెండు వైపుల నుంచీ సమాచారం సేకరించాలి. వాళ్ల భావోద్వేగాల్ని అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా మధ్యలో స్పందించాలి. అప్పుడే ఒక అభిప్రాయానికి రావాలి. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఈ అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

మౌనమూ భాషే... ఎదుటివారు మాట్లాడేటప్పుడు ఒకొక్కసారి భావోద్వేగానికి గురికావొచ్చు. ఆ సమయంలో అసహనానికి గురవడం, అంతరాయం కలిగించడం మంచిది కాదు. వాళ్ల కోణం చెప్పుకొనే వీలు, సమయం ఇవ్వాలి. అప్పుడే తోటివాళ్లతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మరోసారి మనతో సమస్యను పంచుకోవడానికో.. మన సమస్యను వినడానికో ముందుకొస్తారు.

ప్రశ్నిస్తేనే.. వినమన్నారు కదాని ‘అవును’, ‘కాదు’కే పరిమితం కావొద్దు. చెప్పేవాళ్లకీ ఆసక్తి ఉండదు. పైగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనా కలుగుతుంది. పిచ్చాపాటివి కాకుండా ఇద్దరిలో ఏ ఒక్కరికి సాయపడే విషయమైనా సంభాషణ కొనసాగించడానికి ప్రశ్నలడగాలి. అప్పుడే మనకీ ఆసక్తి ఉందని ఎదుటివారు భావిస్తారు. మరింత సమాచారం మనతో పంచుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్