మిమ్మల్ని మీరు నమ్మండి!

చాలామంది మహిళలు తాము చేస్తున్న పనిని సమర్థంగా పూర్తి చేస్తారు. కానీ, ఏవైనా పెద్ద బాధ్యతల్ని ఒంటరిగా నిర్వర్తించాలన్నా, బృందాన్ని నడిపించాలన్నా... కాస్త తటపటాయిస్తుంటారు.

Published : 05 May 2023 00:16 IST

చాలామంది మహిళలు తాము చేస్తున్న పనిని సమర్థంగా పూర్తి చేస్తారు. కానీ, ఏవైనా పెద్ద బాధ్యతల్ని ఒంటరిగా నిర్వర్తించాలన్నా, బృందాన్ని నడిపించాలన్నా... కాస్త తటపటాయిస్తుంటారు. ఇలాంటప్పుడు మీపై మీకు వచ్చే సందేహాలను ఎలా పటాపంచలు చేసుకోవాలి... ఎలా ముందడుగు వేయాలో చెబుతున్నారు నిపుణులు.

* ఈ పని ‘నేను చేయగలనా?’, ‘ఓడిపోతే ఏమవుతుంది?’.. ‘ఈ బాధ్యతలు తీసుకుంటే... నాకు అంతా సహకరిస్తారా’... ఇలా మీ ప్రతికూల భావాలకి అడ్డుకట్టవేయండి. బదులుగా ‘నేను కచ్చితంగా చేయగలను?’ ‘మరింత నేర్చుకోవడానికి ఇదో చక్కటి అవకాశం!’ ‘ప్రయత్నించి చూడటంలో తప్పులేదు కదా’ వంటి మాటలు మననం చేసుకోండి. ఇవి మీపై మీకు నమ్మకాన్ని పెంచుతాయి.

* ఇప్పటివరకూ అనుభవించిన ఆనందకరమైన క్షణాలని, విజయాలని కాగితంపై రాసి మడిచి ఓ చిన్న డబ్బాలో వేయండి. ఒక్కోదాన్ని మీ దగ్గరివారితో బయటకు తీయించండి. వాళ్లు తీసి చదవగానే వాటి నేపథ్యాన్ని వివరించండి. మీ కష్టాన్నీ,  ప్రతిభనూ, సమయస్ఫూర్తినీ గుర్తు చేసుకునే విశేషాలేమైనా ఉంటే చెప్పండి. ‘ఇందులో ఏముంది?’ అనిపిస్తుంది కానీ.. మీపై మీకు నమ్మకాన్ని తెచ్చే మంచి ప్రక్రియ ఇది! ఓ సారి ప్రయత్నించరాదూ!

* మీకు భయాన్ని, ఆందోళనని కలిగించే ఆ విషయం నుంచి కాసేపు బయటకు రండి. మిమ్మల్ని మీరు మరిచిపోయేందుకు నచ్చిన ఏదైనా వ్యాపకంపై దృష్టిపెట్టండి. హాస్య కథలూ, వీడియోలూ చూడండి. మనసుకి నచ్చిన వారితో మీ అభిప్రాయాల్ని పంచుకోండి. ఈ విరామం మీ ముందున్న విషయాన్ని కొత్తకోణంలో చూసేందుకు ఉపయోగ పడుతుంది. ‘ఓస్‌.. ఇంతేకదా! మనం చేయగలం..!’ అనే ఆలోచనా తీసుకువస్తుంది. ఆ దన్నుతో మిమ్మల్ని భయపెడుతున్న అంశాలేమిటీ.. వాటినెలా ఎదుర్కోవచ్చు.. ప్రణాళికలు వేసుకోండి. అవసరమైతే స్నేహితుల సాయమూ తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని