అక్కడా కావాలో ఫ్రెండు!

కాలేజీలో బోలెడు మంది స్నేహితులున్నా.. ఆఫీసుకొచ్చేసరికి ‘హాయ్‌, బై’కి పరిమితమయ్యే వారే ఎక్కువ. వయసు తేడాలు, ఏం మాట్లాడితే తప్పో అని చాలామంది అమ్మాయిల భయం.

Published : 11 May 2023 00:32 IST

కాలేజీలో బోలెడు మంది స్నేహితులున్నా.. ఆఫీసుకొచ్చేసరికి ‘హాయ్‌, బై’కి పరిమితమయ్యే వారే ఎక్కువ. వయసు తేడాలు, ఏం మాట్లాడితే తప్పో అని చాలామంది అమ్మాయిల భయం. అందుకే తమ పని తాము చూసుకొని వెళ్లిపోతారు. కానీ అదే తప్పంటున్నారు నిపుణులు..

* ‘ఆఫీసులో స్నేహితులెందుకు?’ ఓ అధ్యయనం ప్రకారం చాలామంది అమ్మాయిలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారట. కానీ ఇక్కడా తప్పక ఫ్రెండ్‌ ఉండాలి. అయోమయం, అసంతృప్తి, ఆందోళన వంటివి పని ప్రదేశంలోనూ ఉంటాయి. ఇవి అలాగే కొనసాగితే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయట. అసంతృప్తులను వింటూ.. వెనుకబడ్డప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించేవారు ఉంటే ఆందోళనలన్నీ నిమిషాల్లో పటాపంచలై తిరిగి గాడిలో పడతారు.

* టీ తాగుతూ ‘మా బాస్‌ ఇలా అన్నాడు’, ‘పని భారం పెరిగింది’, ‘ఫలానా వారి ప్రవర్తన బాలేదు’.. వంటి ఇబ్బందులన్నీ ఏకరువు పెట్టినట్టు ఉన్నా.. భావోద్వేగాలను బయటపెట్టే మార్గాలే. ఎంత ఇబ్బందిగా తోచినా అన్నిసార్లూ పైవాళ్ల ముందు చెప్పలేం. బయట పెట్టక చివరి వరకూ లోపలే అదిమిపెట్టినా పనిపై అసంతృప్తి, తప్పులు దొర్లడం వంటివీ జరిగే ప్రమాదం ఉంది. అందుకే పంచుకునే వారు ఉండాలి.

* ‘స్నేహం చేసేంతలా ఎవరూ నచ్చలేదు’ అనిపించడం సాధారణమే! వ్యతిరేకతతో ఉన్నప్పుడు ఎవరైనా ఎలా నచ్చుతారు? అలాగని ఒక్కసారిగా అందరితో నవ్వుతూ మరీ రాసుకు పూసుకు తిరగాల్సిన పనిలేదు. కానీ.. గమనించండి. మీ మనసుకు, అభిరుచులకు దగ్గరగా ఉండేవారు దొరుకుతారు. అయితే జాగ్రత్త! మీతో బాగుంటూనే వెనక మీ గురించి మాట్లాడే వారితో ప్రమాదం. మంచి పేరుతో ఇతరులపై ఫిర్యాదు చేయమనడమో, వదంతులు వ్యాప్తి చేయడమో చేస్తున్నా వారికి దూరంగా ఉండాలి. స్నేహితులుండాలి.. అలాగని తొందరొద్దు. కాస్త ఆలస్యమైనా బాగా పరిశీలించుకొని తర్వాతే దగ్గరవ్వండి. ఆఫీసు పనీ.. ఆనందంగా తోస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని